పారిస్‌లో ‘ఆస్తుల జప్తు’.. భారత్‌ స్పందన - Ministry of Finance on reports relating to freezing of Indian assets in France
close

Published : 08/07/2021 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారిస్‌లో ‘ఆస్తుల జప్తు’.. భారత్‌ స్పందన

ఎలాంటి నోటీసులు రాలేదన్న కేంద్ర ఆర్థికశాఖ

దిల్లీ: రెట్రోస్పెక్టివ్‌ పన్ను వివాదంలో భాగంగా ఫ్రాన్స్‌లోని భారత ప్రభుత్వ ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ కంపెనీ జప్తు చేసుకుందని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ఫ్రెంచ్‌ కోర్టు నుంచి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేసింది. 

‘‘పారిస్‌లోని భారత ప్రభుత్వ ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ జప్తు చేసుకున్నట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఫ్రెంచ్‌ కోర్టు నుంచి భారత ప్రభుత్వానికి ఎలాంటి నోటీసులు, ఉత్తర్వులు గానీ సమాచారం గానీ రాలేదు. దీనిపై నిజానిజాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు వస్తే.. దానిపై తగిన విధంగా న్యాయపరమైన చర్యలు చేపడుతాం. భారత ప్రయోజనాలను కాపాడుతాం’’ అని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

రెట్రోస్పెక్టివ్‌ పన్ను వివాదంలో గతేడాది ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఈ ఏడాది మార్చి 22న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో భారత్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని ఆర్థికశాఖ ఈ సందర్భంగా గుర్తుచేసింది. అంతేగాక, ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కెయిర్న్‌ సీఈవో, ప్రతినిధులు.. భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారని తెలిపింది. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొంది. 

భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ గతేడాది డిసెంబర్‌లో ఆర్బిట్రేషన్‌ న్యాయస్థానం కెయిర్న్‌ ఎనర్జీకి అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి 1.2 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని భారత్‌ను ఆదేశించింది. అయితే, ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో సొమ్ము రాబట్టుకోవడం కోసం కెయిర్న్‌ ఎనర్జీ పలు దేశాల్లోని న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే పారిస్‌లోని భారత ప్రభుత్వ ఆస్తుల జప్తునకు ఫ్రెంచ్‌ కోర్టు అనుమతులు మంజూరు చేసిందని, దీంతో 20కి పైగా ఆస్తులను కెయిర్న్‌ జప్తు చేసుకుందని కంపెనీ వర్గాలు గురువారం వెల్లడించాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని