సీనియర్‌ సిటిజన్లు నెల నెలా ఆదాయం పొందడమెలా? - Regular income with low risk schemes for senior citizens
close

Updated : 05/07/2021 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియర్‌ సిటిజన్లు నెల నెలా ఆదాయం పొందడమెలా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు జీతం ద్వారా ఆదాయం ఉండ‌దు కాబ‌ట్టి నెల‌వారీ క్ర‌మ‌మైన ఆదాయం వ‌చ్చేలా ఏర్పాటు చేసుకోవ‌డం అవ‌స‌రం. వ‌య‌సు రీత్యా రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం వారికి త‌క్కువగా ఉంటుంది కాబ‌ట్టి రాబ‌డితో పాటు పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం కూడా ముఖ్య‌మే. అందువ‌ల్ల త‌క్కువ రిస్క్‌తో కూడిన పెట్ట‌బడుల‌ను వారు ఎంచుకోవాల్సి ఉంటుంది. ర‌క్ష‌ణ‌తో పాటు లిక్విడిటీ, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, సుల‌భంగా నిర్వ‌హించ‌గ‌లిగేలా ఉండాలి. అలాంటి ఆప్షన్లు ఏవి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌ (SCSS)
ఐదేళ్ల కాల‌ప‌రిమితి ఉండే ఈ ఖాతాలో గ‌రిష్ఠంగా ₹15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఒకేసారి డిపాజిట్ చేయొచ్చు. మ‌రో మూడేళ్లు పొడిగించుకునే అవ‌కాశం కూడా ఉంది. ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.40 శాతం. త్రైమాసికానికోసారి వ‌డ్డీ చెల్లిస్తారు. ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌, జులై, అక్టోబ‌ర్‌, జ‌న‌వ‌రి నెల‌ల్లో మొద‌టి తేదీన వ‌డ్డీ ఖాతాల్లో జ‌మ‌వుతుంది. ముంద‌స్తు విత్‌డ్రాల‌పై పెనాల్టీ ఉంటుంది. ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. జ‌రిమానా డిపాజిట్ మొత్తంపై 1 నుంచి 1.5 శాతం మ‌ధ్య‌ ఉంటుంది. ఇందులో పెట్టుబ‌డి పెట్టిన సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. భార‌తీయ పోస్టాఫీసు, చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ప‌థ‌కం అందుబాటులో ఉంది. 

2. ప్ర‌ధాన మంత్రి వయో వంద‌న యోజ‌న‌ (PMVVY)
ఒక్కసారి ప్రీమియం చెల్లించి ఈ ప‌థ‌కంలో చేరాల్సి ఉంటుంది. కనీసం ₹ 1.5 లక్షలు, గరిష్ఠంగా ₹15 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు. పెట్టిన సొమ్ముకు తగినట్టు నెలవారీ చెల్లింపులు ఉంటాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానకి 7.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తయ్యే వరకు నెలకు ₹1000 నుంచి ప్రారంభించి గరిష్ఠ పెట్టుబడి పెట్టిన వారికి రూ.9,250 పింఛను వస్తుంది. నెల నెలా వద్దనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికో సారి పింఛను అందుకునే వెసులుబాటు ఉంది. ఈ ప‌థ‌కం ఎల్ఐసీ ఇండియా నుంచి కొనుగోలు చేయొచ్చు.

3. ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు
₹15 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ మొత్తాన్ని ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్ల‌లో మ‌దుపు చేయొచ్చు. 60 సంవత్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వారికి ఆరేళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ (70 ఏళ్లు పైబ‌డిన వారికి 5 సంవ‌త్స‌రాలు, 80 ఏళ్లు పైబ‌డిన వారికి 4 సంవత్స‌రాలు) ఉంటుంది. ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.15 శాతం. ఆరు నెల‌లకోసారి వడ్డీ చెల్లిస్తారు.

4. వార్షికంగా ₹ 1.5 ల‌క్ష‌లు ప‌న్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లేదా పోస్ట‌ల్ నేష‌న‌ల్ సేవింగ్స్‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. దీంతో సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను పరిధిలోకి వ‌చ్చే ఆదాయాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

పైన పేర్కొన్నవి పెన్ష‌న్‌, రెంట్ ద్వారా ఆదాయం లేని ఆర్థిక పోర్ట్‌ఫోలియో ₹75 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌గా ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే, పైన పేర్కొన్న పెట్టుబ‌డుల్లో చాలా వర‌కు వార్షికంగా 7 శాతం వ‌డ్డీ ఆదాయాన్ని అందిస్తాయి. ఈ స్ట్రాటజీ ప్ర‌కారం ₹1 కోటి పెట్టుబ‌డి పెట్టిన వారు నెల‌కు ₹55వేలు ఆదాయం ఆర్జించవచ్చు.

సీనియ‌ర్ సిటిజ‌న్లు సెక్ష‌న్ 80 టీటీబీ కింద ₹50వేలు, సెక్ష‌న్ 80సి ప్ర‌కారం ₹ 1.5 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు పొంద‌చ్చు. ఇవి ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. మార్కెట్ లింక్‌డ్‌ ప్రొడక్ట్స్‌లో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. అటువంటి వాటిలో మ‌దుపు చేస్తే రాబ‌డి ఎంత వ‌స్తుంద‌నేది కచ్చితంగా చెప్ప‌లేం. 

అధిక ఫైనాన్షియ‌ల్‌ పోర్ట్ ఫోలియోతో కోటి రూపాయ‌ల‌కు మించి పెట్టుబ‌డులు పెట్ట‌గ‌లిగి, ఇత‌ర ఆదాయ మార్గాలు (పెన్ష‌న్/ అద్దె ఆదాయం) ఉన్న‌వారు.. పై వివ‌రించిన పెట్టుబ‌డులు మాత్ర‌మే కాకుండా స్టాక్స్‌, మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు, ఆర్ఈఐటీ వంటి వాటిలోనూ మ‌దుపు చేయొచ్చు. కచ్చిత‌మైన ప్ర‌ణాళిక‌తో సేప్టీ, లిక్విడిటీ, క్ర‌మ‌మైన ఆదాయం, ప‌న్ను స‌మ‌ర్థ‌త వంటి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి.

త‌ర ముఖ్య‌మైన అంశాలు..
* బీమా సంస్థ‌లు అందించే త‌క్కువ ఆదాయం ఉన్న యాన్యుటీ ప్లాన్‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది. 
* రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులకు లిక్విడిటీ ఉండ‌దు. పైగా అద్దె ఆదాయం త‌క్కువ‌గానే ఉంటుంది. కాబ‌ట్టి వీటిని నివారించ‌డ‌మే మంచిది.
ఒక క్ర‌మ ఆదాయం లేని, త్వ‌ర‌గా రాబ‌డినిచ్చే ప‌థ‌కాల‌ను ఎంచుకోకూడ‌దు. పైగా అధిక రాబ‌డి ఇచ్చే ప‌థ‌కాల్లో రిస్క్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.
* ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం లేక‌పోతే పెట్టుబ‌డి పెట్టిన సంస్థ‌ల‌కు ఫారం 15జి స‌మ‌ర్పిస్తే టీడీఎస్‌ (మూలం వ‌ద్ద ప‌న్ను) ప్ర‌భావాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. 
* ఆధారిత స‌భ్యులు లేక‌పోతే జీవిత బీమా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆరోగ్య బీమా పాల‌సీలు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. కానీ ఆరోగ్య బీమా పాల‌సీలో ఉండే మిన‌హాయింపుల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. అత్య‌వ‌స‌రాల కోసం కొంత డ‌బ్బును ద్ర‌వ్య రూపంలో దగ్గ‌ర పెట్టుకోవాలి.
వ్యాలిడ్ నామినేష‌న్‌, స‌రైన విల్లు ఏర్పాటు చేయ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని