ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల్లో ₹9వేల కోట్లు బ్యాంకులకు - Vijay Mallya Nirav Modi Mehul Choksis Assets Worth RS 9371 Crore Transferred To Banks
close

Updated : 23/06/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల్లో ₹9వేల కోట్లు బ్యాంకులకు

దిల్లీ: పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేసింది. ఈ ముగ్గురి వల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టాల రికవరీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ ముగ్గురు వ్యాపారవేత్తలు తమ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారని విచారణలో తేలినట్లు ఈడీ స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఈడీ జరిపిన విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలను పరిశీలించగా.. విదేశాల్లోనూ వీరు ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని వెల్లడించింది. అలాగే డొల్ల కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి నిధులను సమీకరించారని పేర్కొంది. ఈ అంశాలపై మనీలాండరింగ్‌ చట్టం కింద విచారణ పూర్తయిన తర్వాత కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.

విచారణ ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టామని ఈడీ తెలిపింది. వీరు ముగ్గురి వల్ల వాటిల్లిన మొత్తం నష్టం రూ.22,585.83 కోట్లలో 84.45 శాతం అంటే రూ.18,170.02 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. వీటిలో రూ.969 కోట్లు విలువ చేసే విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్లు తెలిపింది.

అటాచ్‌ చేసిన ఆస్తుల్లో విజయ్‌ మాల్యాకు చెందిన ‘యునైటెడ్‌ బ్రెవరీస్‌ లిమిటెడ్‌(యూబీఎల్‌)’కు సంబంధించిన రూ.6,600 కోట్లు విలువ చేసే షేర్లను ఇటీవల ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియంకు బదిలీ చేసినట్లు తెలిపింది. వీటిలో రూ.5,824.50 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)’ విక్రయించినట్లు వెల్లడించింది. మరో రూ.800 కోట్లు విలువ చేసే షేర్లను సైతం జూన్‌ 25 నాటికి విక్రయించే అవకాశం ఉన్నట్లు ఈడీ తెలిపింది. అలాగే ఈడీ సహకారంతో గతంలోనే కొన్ని షేర్లను విక్రయించి బ్యాంకులు రూ.1357 కోట్లను రాబట్టుకున్నాయి. తాజాగా బదిలీ చేసిన ఆస్తుల్ని విక్రయించడం ద్వారా బ్యాంకులకు మరో రూ.9,041.5 కోట్లు సమకూరనున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని