ఫేమ్‌-2 రాయితీల పెంపు గొప్ప నిర్ణయం
close

Published : 13/06/2021 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫేమ్‌-2 రాయితీల పెంపు గొప్ప నిర్ణయం

విద్యుత్‌ ద్విచక్రవాహన సంస్థల హర్షం

దిల్లీ: ఫేమ్‌-2 పథకం కింద వాహనాలకు ఇచ్చే రాయితీని 50 శాతానికి పెంచడం ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా విద్యుత్‌ ద్విచక్రవాహన తయారీ సంస్థలు అభివర్ణించాయి. పర్యావరణ హితమైన విద్యుత్‌ వాహనాలకు మారడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నాయి. ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) రెండో దశకు శుక్రవారం ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటివరకు ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్స్‌తో సహా అన్ని విద్యుత్‌ వాహనాలకు కిలోవాట్‌కు రూ.10,000 రాయితీ ఇస్తుండగా.. ఇకపై విద్యుత్‌ ద్విచక్రవాహనాలకు కిలోవాట్‌కు రూ.15,000 చొప్పున డిమాండ్‌ ప్రోత్సాహాకాలు ఇవ్వనుంది. విద్యుత్‌ ద్విచక్రవాహనాల మొత్తం ధరలో ప్రస్తుతం 20 శాతం రాయితీ పరిమితి ఉండగా.. దాన్ని 40 శాతానికి భారీ పరిశ్రమల శాఖ సవరించింది. ‘ఫేమ్‌-2 విధానంలో మార్పులు గొప్ప నిర్ణయం. కొవిడ్‌ సంక్షోభం ఉన్నప్పటికీ.. విద్యుత్‌ ద్విచక్రవాహన అమ్మకాలు పెరిగాయి. తాజాగా సబ్సిడీ పెంపు నిర్ణయంతో 2025 నాటికి 60 లక్షల అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది. స్థానికంగా విద్యుత్‌ ద్విచక్రవాహనాల తయారీపై దృష్టి పెట్టడం ద్వారా భారత్‌ విద్యుత్‌ వాహన హబ్‌గా ఎదుగుతుంది’ అని ఏథర్‌ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్‌ మెహతా పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సాధారణ వాహనాలకు దగ్గరగా విద్యుత్‌ ద్విచక్రవాహన ధరలు తగ్గుతాయని, ద్విచక్రవాహనాలకు అడ్డంకిగా మారిన అధిక ధరల ముద్ర తొలుగుతుందని విద్యుత్‌ వాహన తయారీదార్ల సంఘం (ఎస్‌ఎంఈవీ) డైరెక్టర్‌ జనరల్‌ సొహిందర్‌ గిల్‌ వెల్లడించారు. ఒకసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ వెళ్లే సిటీ స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.60,000 దిగువకు వస్తుందని, 80 కి.మీ ప్రయాణించే హైస్పీడ్‌ స్కూటర్‌ ధర రూ.లక్షకు చేరుతుందని అభిప్రాయపడ్డారు.

విద్యుత్‌ వాహనాలకు కొత్త శకం: ఫేమ్‌-2 సబ్సిడీ పెంపు నిర్ణయంతో దేశంలో విద్యుత్‌ వాహన శకం ప్రారంభం కావడానికి దోహదపడుతుందని హీరో ఎలక్ట్రిక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ పేర్కొన్నారు. దేశీయంగా పెట్రోల్‌ ధరలు రూ.100 మార్కుకు చేరడంతో వినియోగదారులు విద్యుత్‌ వాహనాల వైపు అడుగులు వేయడానికి సబ్సిడీల పెంపు పనిచేస్తుందని అన్నారు. ఛార్జింగ్‌ పాయింట్‌ల ఏర్పాటు, విద్యుత్‌ వాహన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 53,000 విద్యుత్‌ ద్విచక్రవాహనాలను విక్రయించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20,000 ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని