ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోంది
close

Published : 26/10/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోంది

రెలిగేర్‌ కేసుపై సుప్రీం కోర్టు వ్యాఖ్య

దిల్లీ: రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌కు చెందిన రూ.2,397 కోట్ల నిధుల విషయంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ మోహన్‌ సింగ్‌ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల కేసులో ప్రభుత్వం మరీ ఎక్కువ ఆసక్తి చూపుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పాత పరిశీలనలు, వ్యాఖ్యల ప్రభావానికి లోనుకాకుండా తాజా తీర్పునిచ్చే నిమిత్తం ఈ కేసును తిరిగి దిల్లీ హైకోర్టుకే అప్పజెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం తొలుత అభిప్రాయపడింది. ‘అయితే ఇపుడు మళ్లీ (దిల్లీ పోలీసులు) నాలుగు నెలల సమయం అడుగుతున్నారు. వారేం చేయాలనుకున్నారో దేవుడికే తెలియాలి’ అని ధర్మాసనం పేర్కొంది. సింగ్‌కు సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని దిల్లీ పోలీసులు ఫిబ్రవరి 9న తెలిపారని, ఇప్పుడు మళ్లీ సమయం కోరుతున్నారని సింగ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపిన అనంతరం పై వ్యాఖ్యలు చేసింది. రూ.1,500 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని.. దానిపై తప్పుడు చిత్రీకరణ జరుగుతోందని దిల్లీ పోలీసు తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చీఫ్‌ జస్టిస్‌ రమణ మాట్లాడుతూ ‘ఈ కేసు ఎంత మొత్తానికి సంబంధించింది అని మేం అడగట్లేదు. హైకోర్టు తాజాగా దీనిని డీల్‌ చేయాలని కోరుతున్నాం. నేను ప్రభుత్వంపై వ్యాఖ్యానించదలచుకోలేదు కానీ..ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంద’ని అన్నారు. శివీందర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను దీపావళి సెలవుల అనంతరం చేపడతామని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని