జియో ల్యాప్‌టాప్‌లు వచ్చేస్తున్నాయట! - indias reliance jio is developing a low cost laptop called the jiobook running on jioos
close

Published : 05/03/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జియో ల్యాప్‌టాప్‌లు వచ్చేస్తున్నాయట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ ధరకే ఇంటర్నెట్‌, ఫీచర్‌ ఫోన్లను అందుబాటులోకి తెచ్చి... రిలయన్స్‌ జియో భారత్‌ టెలికాం రంగంలో విప్లవాన్ని తెచ్చింది. రిలయన్స్‌ తెచ్చిన ఈ మార్పుతో సామాన్యుడికి కూడా ఇంటర్నెట్‌ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రమంలో జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ పనులు కీలక దశకు చేరుకున్నాయని సమాచారం. ‘జియో బుక్‌’ పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నాటికి జియో బుక్‌లు విపణిలోకి రావొచ్చు.

అసలేంటీ జియో బుక్‌..?

సెల్యులార్‌ కనెక్షన్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ల తయారీపై జియో ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన క్వాల్‌కోమ్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ ప్రొడక్ట్ డైరక్టర్‌ మిగ్యుల్‌ న్యూన్స్ 2018లో తెలిపారు. ఆ తర్వాత సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సాధారణ ల్యాపీల్లా విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో కాకుండా, గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఇవి పని చేయడం ఆసక్తికర విషయం. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో కొన్ని మార్పులు చేసి ఈ ల్యాపీల్లో వాడనున్నారు. దీనిని జియో ఓఎస్‌ అని పిలుస్తారని సమాచారం.


(ప్రతీకాత్మక చిత్రం)

జియోబుక్‌ ఫీచర్లేంటంటే..
ల్యాప్‌టాప్‌ తయారీ ఖర్చులను తగ్గించేందుకుగానూ జియో క్వాల్కోమ్‌‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారట. ఇది 11 నానో మీటర్‌ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇప్పటికే అనేక మొబైల్‌ ఫోన్లలో ఈ చిప్‌ను వినియోగిస్తున్నారు. దీనిలో ఇన్‌-బిల్ట్‌ 4జీ ఎల్‌టీఈ మోడెమ్ ఉంటుంది. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5 గిగా హెడ్జ్‌  వైఫై సపోర్ట్‌, బ్లూటూత్‌, 3 యాక్సిస్‌ యాక్సెలెరోమీటర్‌, క్వాల్‌కోమ్‌ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. అంతే కాకుండా ఈ ల్యాప్‌టాప్‌‌లో జియో స్టోర్‌, జియో మీట్‌, జియో పేజెస్‌, జియో యాడ్‌ సర్వీసులను ముందుగానే లోడ్‌ చేసి ఉంచుతారని సమాచారం. ఈ ల్యాపీ ధర మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మొబైల్‌ ఫోన్స్‌ను తక్కువ ధరకే అందిస్తోన్న జియో... ఇప్పుడు ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని