లక్షణాలు లేనివారిలోనూ వైరల్‌ లోడ్‌ ఎక్కువే..! - Indian scientists find higher viral load in asymptomatic COVID-19 patients
close
Published : 01/09/2020 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్షణాలు లేనివారిలోనూ వైరల్‌ లోడ్‌ ఎక్కువే..!

హైదరాబాద్‌ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి
ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకూ కొవిడ్‌ పరీక్షలు చేయాలని సూచన

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో వైరస్‌ వ్యాప్తి, వాటి జన్యుక్రమంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వైరస్‌ లక్షణాలు కనిపించని రోగుల్లో వైరస్‌ లోడ్‌ ఏవిధంగా ఉందో అనే విషయంపై హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. 200మంది వైరస్‌ సోకిన వారిలో జరిపిన ఈ పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా లక్షణాలు లేని రోగుల్లో వైరల్‌ లోడ్‌ ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పర్యవేక్షించడంతోపాటు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన ఆవశ్యకతను తాజా పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి.

‘ముఖ్యంగా లక్షణాలు లేనివారినుంచి తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో వారు తీవ్ర అనారోగ్యానికి గురి అవడంతోపాటు ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది’ అని సీడీఎఫ్‌డీకి చెందిన పరిశోధకులు మురళీధరన్‌ భాష్యం మీడియాకు వెల్లడించారు. అందుకే లక్షణాలు కనిపించని వారినికూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతంలో వ్యాపిస్తోన్న వైరస్‌‌ వంశాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ పరిశోధన చేపట్టామన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో వైరస్‌ సంక్రమణ, వాటి జన్యుక్రమాలను గుర్తించడం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. అయితే, లక్షణాలు కనిపించని కరోనా రోగుల్లో వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమని దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీకి చెందిన నిపుణులు సత్యజిత్‌ రాత్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌ పరిసరప్రాంతాల్లో దాదాపు 210మంది రోగుల నమూనాలను సేకరించి వారి జన్యుక్రమ సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో భాగంగా వైరస్‌ జన్యువులో తరచూ ఉత్పరివర్తనాలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నమూనాలు సేకరించిన రోగుల్లో ఎక్కువగా (దాదాపు 95శాతం) 20B స్ట్రెయిన్‌ వైరస్‌ ఉండగా, మిగతావి వేరే రకాలకు చెందిన వైరస్‌లుగా తేల్చారు. మే నుంచి జులై వరకు వ్యాపించిన వైరస్‌ 20B స్ట్రెయిన్‌గానే ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి పెరగడానికి అతి ఎక్కువ ప్రాబల్యం కలిగిన ‘డీ614జీ’ రకం వైరస్‌ కారణమనే అనుమానాన్ని కూడా శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు.

వైరస్‌ వ్యాప్తి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ లక్షణాలు లేని రోగుల నుంచి వైరస్‌ వ్యాప్తిచెందడంపై అధ్యయనం చేయాల్సిన ప్రాముఖ్యతను మా పరిశోధన తెలియజేస్తుందని సీడీఎఫ్‌డీ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌పై పోరులో వ్యూహాలు రచించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అయితే, దేశ వివిధ ప్రాంతాల్లో ప్రజలు, వైవిధ్య వాతావరణం కారణంగా వైరస్‌ తీవ్రత ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈసందర్భంలో లక్షణాలు కనిపించని రోగులు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని