అక్కడ పాక్‌ ఎన్నికలు పెట్టడమేంటి?:భారత్‌ - No Legal Basis Whatsoever India On Election In Gilgit Baltistan
close
Updated : 25/09/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ పాక్‌ ఎన్నికలు పెట్టడమేంటి?:భారత్‌

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని వివాదాస్పద గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ తేదీని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఖరారు చేయడంపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. సైనికుల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడానికి పాక్‌కు చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ స్పష్టం చేశారు. అది భారత భూభాగమని, అక్కడ పాక్‌ ఎన్నికలు నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. భారత అంతర్గత విషయాల్లో తల దూర్చడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పాక్‌ చేస్తున్న కుట్రలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

నవంబరు 15న అక్కడ పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కంటూ పాక్‌ అధ్యక్షడు డా. అరిఫ్‌ అల్వి ఓ అధికారిక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 18న జరగాల్సిన ఈ పోలింగ్‌ను కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. జూన్‌ 24తో ఐదేళ్ల పాలనా కాలం ముగియడంతో అక్కడ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌ఎన్‌) అధికారానికి తెరపడింది. దీంతో మొత్తం 24 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించాలని పాక్‌ భావిస్తోంది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించే ఆలోచనతోనే పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రస్తుతం పోలింగ్‌ తేదీని ఖరారు చేసింది.

పీఎంఎల్‌ఎన్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా దీనిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. గిల్గిత్-బాల్టిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహించాలని పాక్‌ సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పాలనా ఉత్తర్వులను సవరించడానికి ప్రధానికి అధికారాలిచ్చింది. దీనిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలతోపాటు గిల్గిత్‌, బాల్టిస్థాన్‌ కూడా పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని పాక్‌ ప్రభుత్వానికి  తెలిపింది. అయితే తాజాగా పాక్‌ ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించడంతో మళ్లీ ఈ వివాదం తెరమీదకు వచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని