‘హిట్‌’ అని చెప్పాల్సింది మీరే: నాని
close
Published : 23/02/2020 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హిట్‌’ అని చెప్పాల్సింది మీరే: నాని

హైదరాబాద్‌: విశ్వక్‌సేన్ పోలీస్‌ అధికారిగా కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘హిట్‌’. శైలేశ్‌ కొలను దర్శకత్వం వహించారు. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతితో కలిసి నాని నిర్మించారు. రుహానీ శర్మ కథానాయిక. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, రానా, అనుష్క హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘ఒకర్ని చూపించి అలా చదువుకోవచ్చు కదా అని మనల్ని అమ్మానాన్న తిడతారు కదా.. అలా చూపించే వ్యక్తి శైలేశ్. మరి అలాంటి వ్యక్తే సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుంది. ఈ సినిమాతో అది జరిగింది. మొదట్లో అనుమానం ఉండేది. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయకు తర్వాత ఉపయోగపడుతుందని శైలేశ్‌తో చెప్పా. కానీ ఇప్పుడు చెప్తున్నా.. నువ్వు దర్జాగా ఉద్యోగానికి రాజీనామా చెయ్‌. విశ్వక్‌సేన్‌ గురించి చెప్పాలంటే.. సినిమాకు విశ్వక్‌ను హీరోగా పెట్టాలనుకున్నప్పుడు అతడి గురించి ఏమీ తెలియదు. కటౌట్‌ బాగా ఉందని మాత్రమే తెలుసు. ఆ తర్వాత అతడి సినిమా చూశాను. ఈ సినిమాకు విశ్వక్‌ అయితేనే బాగా సెట్‌ అవుతాడని అనుకున్నాం. ఏ సినిమాలో అయినా.. ఏ పాత్ర అయినా విశ్వక్‌ ఇరగదీస్తాడని ఇప్పుడు నమ్మకం వచ్చింది. చి||లా||సౌ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా హీరోయిన్‌గా రుహానీ చాలా బాగా చేసిందని అనే వారు. అందుకే ఈ సినిమాలో ఆమెను ఈ పాత్రకు ఎంచుకున్నాం. అనుకున్నట్లుగానే ఆమె సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు. ఒకరు విశ్వక్‌సేన్‌ అయితే ఇంకొకరు సంగీత దర్శకుడు వివేక్‌సాగర్‌. చాలా మంచి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. కొన్ని సీన్లు చూసేటప్పుడు నాకు గూస్‌బంబ్స్‌ వచ్చాయి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా హిట్‌ అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే.. మంచి సినిమా ఇవ్వాల్సింది మేము. హిట్‌ ఇవ్వాల్సింది మీరే’’ అని తెలిపారు.

డైరెక్టర్‌ కావడానికి కారణం నాని: శైలేశ్‌
దర్శకుడు శైలేశ్‌ కొలను మాట్లాడుతూ.. ‘‘నేను అసలు డైరెక్టర్‌ కావాలని అనుకోలేదు. నేను డైరెక్టర్‌ అయ్యానంటే దానికి కారణం నాని. ఆయనను మొదటిసారిగా 2017లో కలిశాను. అప్పుడు ఆయనకు ఒక కథ ఇచ్చాను. దాన్ని చదివిన తర్వాత ‘ఇంత బాగా రాస్తున్నావు. నువ్వే సినిమా డైరెక్ట్‌ చేయొచ్చుగా’ అని చెప్పారు. నాని అలా ఎందుకు చెప్పారో నాకు తెలీదు. ఆ తర్వాత ఒక స్టోరీ రాసి చూపించాను. ఇప్పుడు ఏకంగా సినిమా తీసే అవకాశం ఇచ్చారు. నాకు దిశానిర్దేశకులు నాని. ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఆయన ఎప్పుడూ ఫీల్‌ కాలేదు. నామీద ఉన్న నమ్మకంతో కనీసం సెట్‌కి కూడా వచ్చేవారు కాదు. నువ్వేం అనుకుంటున్నావో అలాగే తీయ్‌ అన్నారు. నాని నమ్మకాన్ని కచ్చితంగా నిలబెడతా. మరో నిర్మాత ప్రశాంతికి కూడా ధన్యవాదాలు. సినిమా సెట్లో విశ్వక్‌సేన్‌ బాగా అల్లరి చేసేవాడు. ఈ సినిమాకు ఒక అగ్రెసివ్‌ హీరో కావాలని అనుకున్నాం. మరి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తుండగా విశ్వక్‌ అయితే బాగుంటుందని నాని నేను చర్చించుకున్నాం. నేను అనుకున్న పాత్ర విశ్వక్‌ వల్ల ఇంకా బాగా వచ్చింది. ఇంకా ఈ సినిమా హాలీవుడ్‌ సినిమాలా ఉందని చాలా మంది అంటున్నారు. దీనికి ప్రధాన కారణం డీఓపీ మణికందన్‌. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ వింటే పిచ్చెక్కడం ఖాయం. వివేక్‌సాగర్‌ చాలా మంచి సంగీతం అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుహానీని తీసుకుంటే బాగుంటుందని నాని చెప్పారు. ఆమె బాగా చేసింది’ అని అన్నారు.

మంచినీళ్లు తాగి రావద్దు.. మధ్యలో వెళ్లలేరు: విశ్వక్‌సేన్‌
విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ.. ‘‘వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పిన మాట ఒక్కటే నాని చాలా తెలివైన వ్యక్తి అని. నాకు ఒకసారి ఫోన్‌ చేసి ఒకపాత్ర చెయ్‌ అని సలహా ఇచ్చారు. తన అనుభవాన్ని వివరిస్తూ నాకు చాలా నేర్పించారు. నాలాంటి విశ్వక్‌సేన్‌లు చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ నాని అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు నన్ను అడిగినప్పుడు నా అవతారం ఈ పాత్రకు సూట్‌ అవుతుందో లేదో అనుకున్నా. కానీ డీఓపీ మణికందన్‌ బాగా చూపించారు. ఆయనతో చచ్చేలోపు కనీసం ఓ డజన్‌ సినిమాలైనా చేస్తా. వివేక్‌సాగర్‌తో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. అతడి కెరీర్‌లో అన్నింటికంటే నా సినిమాలకే మంచి సంగీతం అందించారు. ఇక హీరోయిన్‌ గురించి చెప్పాలంటే మొదట్లో హీరోయిన్‌ను చూసి తక్కువ అంచనా వేశాను. కానీ, నా అంచనా తప్పని తేలింది. ఆమె చాలా బాగా నటించింది. ఇప్పటి వరకూ తెలుగులో ఇలాంటి సినిమా చూడలేదు. సినిమా థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన అభిమానులకు నిజంగా మాటలు రావు. ఇది నేను ఇప్పటికే అనుభవించాను. ‘ఫలక్‌నుమాదాస్‌’లో లాగా ఈ సినిమాలో డైలాగ్‌లు లేవు. అభిమానులు క్షమించాలి. ఈ సినిమాలో డైరెక్ట్‌ బుల్లెట్‌ దించడమే. ఎక్కువ వాటర్‌ తాగి సినిమాకు రావద్దు. ఎందుకంటే సినిమా మధ్యలో మీరు బయటికి వెళ్లలేరు. కార్యక్రమంలో దిల్‌రాజు, కీరవాణి, బానుచందర్‌, తరుణ్‌భాస్కర్‌, అల్లరి నరేశ్‌, సునీల్‌, మంచులక్ష్మి, నవదీప్‌, సందీప్‌కిషన్‌, కార్తికేయ పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

రాజమౌళిపై రెండు కేసులు పెట్టారట!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని