రప్ఫాడించిన రాహుల్‌: భారత్‌ 336/6 - india set 337 target to england
close
Updated : 26/03/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రప్ఫాడించిన రాహుల్‌: భారత్‌ 336/6

సిక్సర్లతో చెలరేగిన రిషభ్‌ పంత్‌

పుణె: టీమ్‌ఇండియా అదరగొట్టింది. రెండో వన్డేలోనూ సాధికారికంగా ఆడింది. మొదట్లో ఆచితూచి ఆడుతూనే తర్వాత విధ్వంసం సృష్టించింది. 6 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు 337 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (4), రోహిత్‌ శర్మ (25) విఫలమైన వేళ.. కేఎల్‌ రాహుల్‌ (108; 114 బంతుల్లో 7×4, 2×6) అద్భుతమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడికి తోడుగా విరాట్‌ కోహ్లీ (66; 79 బంతుల్లో 3×4, 1×6) అర్ధశతకం సాధించాడు. ఆఖర్లో రిషభ్ పంత్‌ (77; 40 బంతుల్లో 3×4, 7×6), హార్దిక్‌ పాండ్య (35; 16 బంతుల్లో 1×4, 4×6) తమ ఫైర్‌ పవర్‌ ప్రదర్శించారు. ఇంగ్లిష్‌ పేసర్లకు చుక్కలు చూపించారు. పుణెలో సిక్సర్ల వర్షం కురిపించారు.

సొగసరి ‘రాహుల్‌’

రెండో వన్డేలోనూ కెప్టెన్‌ కోహ్లీని టాస్‌ వరించలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 4 వద్దే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (4; 17 బంతుల్లో) టాప్లే బౌలింగ్‌లో ఔటయ్యాడు. బౌండరీలు బాదుతున్న రోహిత్‌ శర్మ (25; 25 బంతుల్లో 5×4)ను సామ్‌ కరన్‌ పెవిలియన్‌ పంపించాడు. అప్పుడు స్కోరు 37. వికెట్‌పై లభిస్తున్న అదనపు బౌన్స్‌ను ఆసరాగా చేసుకొని ఇంగ్లిష్‌ పేసర్లు కట్టుదిట్టమైన ప్రాంతాల్లో బంతులేశారు. ఈ క్రమంలో రాహుల్‌, విరాట్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మూడో వికెట్‌కు 121 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని బౌండరీకి తరలించారు. సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు. 22.1 ఓవర్లకు జట్టు స్కోరును 100కు చేర్చారు. 62 బంతుల్లో కోహ్లీ, 66 బంతుల్లో రాహుల్‌ అర్ధశతకాలు చేశారు. పరుగుల వేగం పెరిగే క్రమంలో జట్టు స్కోరు 158 వద్ద కోహ్లీని ఆదిల్‌ రషీద్‌ పెవిలియన్‌ పంపించాడు.

దంచికొట్టిన పంత్‌

ఇంగ్లాండ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ దొరికిన ప్రతి బంతిని రాహుల్‌ బౌండరీకి పంపించాడు. అతడికి రిషభ్ పంత్‌ తోడయ్యాడు. వీరిద్దరూ 39 ఓవర్లకు స్కోరును 200 దాటించారు. ఆ తర్వాత స్టోక్స్‌ వేసిన 41వ ఓవర్లో పంత్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 28 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. జోరందుకున్న రాహుల్‌ సైతం కళ్లు చెదిరే సిక్సర్లు బాదేసి కెరీర్లో ఐదో శతకం అందుకున్నాడు. వీరి ధాటికి 38.6 ఓవర్లకు 200గా ఉన్న స్కోరు 42.4 ఓవర్లకే 250కు చేరుకుంది.

భారీ షాట్లు ఆడే క్రమంలో 44.5వ బంతికి రాహుల్‌ను టామ్‌ కరన్‌ ఔట్‌ చేశాడు. దాంతో నాలుగో వికెట్‌కు 113 (80 బంతుల్లో) పరుగుల సాధికారిక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత బౌండరీలు, సిక్సర్లు బాదడంలో హార్దిక్ పాండ్యతో పోటీపడే క్రమంలో టామ్‌ కరన్‌ వేసిన 46.5వ బంతికి పంత్‌ ఔటయ్యాడు. ఆఖర్లో సోదరుడు కృనాల్‌ (12*; 9 బంతుల్లో 1×4)తో కలిసి హార్దిక్‌ జట్టు స్కోరును 336కు చేర్చాడు. టాప్లే, టామ్‌ కరన్‌ చెరో 2 వికెట్లు తీశారు. రషీద్‌, సామ్‌ కరన్‌ చెరో వికెట్‌ పడగొట్టాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని