కోహ్లీసేన.. వన్డేల్లో విజయంతోనే బోణీ - india won the first one day against england
close
Updated : 23/03/2021 21:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీసేన.. వన్డేల్లో విజయంతోనే బోణీ

అన్నింటా టీమ్‌ఇండియా అదుర్స్‌

66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తు

పుణె: టెస్టుల్లో ఓటమితోనే.. టీ20ల్లో ఓటమితోనే.. వన్డేల్లోనూ ఓటమితోనేనా అనిపించింది! కానీ కోహ్లీసేన ఆ పరంపరను అడ్డుకొంది. 50 ఓవర్ల ఫార్మాట్‌ను విజయంతోనే ఆరంభించింది. తొలి పోరులో ఇంగ్లాండ్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను 42.1 ఓవర్లకు 251కే కుప్పకూల్చింది.

జానీ బెయిర్‌ స్టో (94; 66 బంతుల్లో 6×4, 7×6), జేసన్‌ రాయ్‌ (46; 35 బంతుల్లో 7×4, 1×6) విధ్వంసాలకు శార్దూల్‌ (3) ప్రసిధ్‌ (2) అడ్డుకట్ట వేశారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (98; 106 బంతుల్లో 11×4, 2×6) శతకం చేజార్చుకున్నాడు. సారథి విరాట్‌ కోహ్లీ (56; 60 బంతుల్లో 6×4), కేఎల్‌ రాహుల్‌ (62*; 43 బంతుల్లో 3×4, 4×6), కృనాల్‌ పాండ్య (58*; 31 బంతుల్లో 7×4, 2×6) అర్ధశతకాలతో చెలరేగారు.

భయపెట్టిన బెయిర్‌ స్టో

ఫ్లాట్‌ పిచ్‌పై ఇంగ్లాండ్‌ ఛేదనను అడ్డుకోవడం కోహ్లీసేనకు అంత తేలిగ్గా కుదర్లేదు. మొదటి వికెట్‌ కోసం 15వ ఓవర్‌ దాకా ఎదురుచూసింది. కానీ అంతలోపే ఇంగ్లిష్‌ ఓపెనర్లు బెయిర్‌ స్టో, జేసన్‌ రాయ్‌ చేయాల్సినంత నష్టం చేసేశారు. తొలి వికెట్‌కు 89 బంతుల్లోనే 135 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అరంగేట్రం బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, కృనాల్‌ పాండ్య, సీనియర్‌ శార్దూల్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. 7 ఓవర్లకు 51, 10 ఓవర్లకు 89, 14 ఓవర్లకు 131 బాదేశారు. ముఖ్యంగా బెయిర్‌ స్టో మైదానం చుట్టూ సిక్సర్లు బాదేశాడు. 40 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

‘ప్రసిధ్‌’ బ్రేక్‌

ఈ క్రమంలో 14.2వ బంతికి రాయ్‌ను ఔట్‌ చేయడం ద్వారా ప్రసిధ్‌ ఈ జోడీని విడదీశాడు. సరిగ్గా తన తర్వాతి ఓవర్లోనే స్టోక్స్‌ (1)ను అతడే పెవిలియన్‌ పంపించాడు. మరో వైపు బెయిర్‌ స్టో విజృంభించి సెంచరీకి చేరువైనా.. 22.1వ బంతికి శార్దూల్‌ అతడిని ఔట్‌ చేశాడు. 25వ ఓవర్లో ఇయాన్‌ మోర్గాన్‌ (22; 30 బంతుల్లో 1×4, 1×6), జోస్‌ బట్లర్‌ (2; 4 బంతుల్లో)నూ అతడే పెవిలియన్‌ పంపడంతో టీమ్‌ఇండియా పని సులువైంది. కాసేపు మొయిన్‌ అలీ (30; 37 బంతుల్లో 2×4, 1×6) నిలిచే ప్రయత్నం చేసినా భువీ అతడిని ఔట్‌ చేసి గెలుపు ఖాయం చేశాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రసిధ్‌ రికార్డు సృష్టించాడు. శార్దూ్‌ల్‌ 3, భువి 2 వికెట్లు తీశారు.   

జోరందుకున్న గబ్బర్‌

తొలుత టీమ్‌ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (28; 42 బంతుల్లో 4×4), శిఖర్‌ ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చెత్త బంతుల్నే వేటాడి 10 ఓవర్లకు 39/0తో జట్టును నిలిపారు. స్టోక్స్‌ వేసిన 16 ఓవర్లో దేహాని దూరంగా వెళ్తున్న బంతిని ఆడి హిట్‌మ్యాన్‌ వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోహ్లీతో కలిసి గబ్బర్‌ చెలరేగాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 102 బంతుల్లో 105 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. గబ్బర్‌ 68 బంతుల్లో, కోహ్లీ సైతం 50 బంతుల్లో అర్ధశతకాలు అందుకొన్నారు. జట్టు స్కోరు 169 వద్ద మార్క్‌వుడ్‌.. కోహ్లీని పెవిలియన్‌ పంపగా.. మరికాసేపటికే శ్రేయస్‌ అయ్యర్‌ (6; 9 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. శతకానికి చేరువైన గబ్బర్‌  నెమ్మదిగా ఆడాడు. సెంచరీకి 2 పరుగుల దూరంలో.. స్టోక్స్‌ షార్ట్‌పిచ్‌లో వేసిన 38.1వ బంతిని పుల్‌ చేయబోయి మోర్గాన్‌కు చిక్కాడు. నిరాశగా మైదానం వీడాడు. అప్పటికి జట్టు స్కోరు 197.

రాహుల్‌, కృనాల్‌ మెరుపుల్‌

ఇంగ్లాండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు వేయడం.. హార్దిక్‌ (1; 9 బంతుల్లో) ఔటవ్వడం.. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడంతో టీమ్‌ఇండియా 270 మార్క్‌ దాటుతుందా అనిపించింది! కానీ.. నిలదొక్కుకోవడానికి ఆచితూచి ఆడిన రాహుల్‌ కాసేపయ్యాక విజృంభించాడు. సొగసైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. ఫామ్‌లోకి రావాలన్న ఆత్మవిశ్వాసంతో మెరుపు షాట్లు కొట్టాడు. అతడికి తోడుగా అరంగేట్రం ఆటగాడు కృనాల్‌పాండ్య బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయమైన 112 (61 బంతుల్లో) పరుగుల సాధికారిక భాగస్వామ్యం అందించారు. ఆఖరి 5 ఓవర్లలో 67 పరుగులు సాధించారు. జట్టును 317/5తో నిలిపారు. మార్క్‌వుడ్‌ 3, బెన్‌స్టోక్స్‌ 2 వికెట్లు తీశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని