కరోనా సోకిన తల్లి తన పాలు బిడ్డకు పట్టవచ్చా? - interview with childrens doctor chakrapani corona second wave effects on children
close
Published : 14/05/2021 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా సోకిన తల్లి తన పాలు బిడ్డకు పట్టవచ్చా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో పిల్లల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొదటి వేవ్‌ కంటే 20 రెట్లు ఇది ఎక్కువగా ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మూడో దశలో ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్యుల అంచనా. ఈ తరుణంలో పిల్లలలో కరోనా పెరుగుదలకు కారణాలు, నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న వైద్యం వంటి అంశాల గురించి ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణి వివరణ ఇచ్చారు.

కరోనా మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. మూడో దశలో వీళ్లపై మరింత ఎక్కువ ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీనికి గల కారణం?

కరోనా మొదటి దశలో ప్రతి వందమందికి టెస్టు చేస్తే ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే కరోనా నిర్ధారణ అయ్యేది. కానీ ఇప్పుడు వందమందిలో ఇరవై మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కొత్త రకం స్ట్రెయిన్‌ పిల్లలకు కరోనా సోకడానికి కారణం.

పిల్లలకు కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

పెద్దల్లో మాదిరిగానే పిల్లలలో కూడా కరోనా లక్షణాలు కనిపించే వారు ఉంటారు. ఏ లక్షణాలు కనిపించకుండా కరోనా సోకిన వాళ్ళూ ఉంటారు. పిల్లలలో ఒకటి నుంచి రెండు రోజులు జలుబు ఉంటుంది. నీళ్ల విరేచనాలు, వాంతులతో బాధపడతారు. 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలో తలనొప్పి కూడా ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా ఉన్న పిల్లలు నీరసంగా కనిపిస్తారు. డీహైడ్రేషన్‌ బారిన పడతారు.  మగతగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సదుపాయాలు అందించాలి.

పిల్లల్లో దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలుంటే కరోనా వచ్చిందనుకోవచ్చా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించినా అది కరోనా వల్లనే అనుకోవాలి. వెంటనే టెస్టు చేయించి నిర్ధారణ చేసుకోవాలి. ఈ లక్షణాలు ఉండి పిల్లలు బాగా నీరసంగా అయిపోతే అది తప్పకుండా కరోనా ప్రభావమే.

పిల్లలకు కరోనా నిర్థారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?

కరోనా సోకిందా? లేదా? అని వెంటనే తెలుసుకోవాలంటే ఎవరికైనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులే చేస్తాము. ప్రస్తుతం పెద్దలకు ఏ టెస్టులు చేస్తామో పిల్లలకు కూడా అవే టెస్టులు చేస్తున్నాము. పిల్లల్లో వైరస్‌ తీవ్రతను తెలుసుకోవడానికి అదనంగా సీఆర్‌పి, డీడైమర్‌ పరీక్షలు మాత్రమే చేయమని ఎయిమ్స్‌ సూచించింది.

కరోనా సోకిన తల్లి తన పాలు బిడ్డకు పట్టవచ్చా?

ఇప్పుడందరిలోనూ ఇదే అనుమానం. కచ్చితంగా బిడ్డకు తల్లి పాలు ఇవ్వాల్సిందే. మాస్కు ధరించి, చేతులు శుభ్రం చేసుకుని పాలు పట్టొచ్చు. చిన్న పిల్లలను ఐసోలేషన్‌ ఉంచడం అంత మంచిది కాదు.

చిన్న పిల్లల్లో ఆక్సిజన్‌ లెవెల్స్‌ ఎలా పరీక్షించాలి?

ఇప్పుడున్న పల్స్‌ ఆక్సిమీటర్‌ నాలుగు సంవత్సరాల పిల్లల వరకూ మాత్రమే ఉపయోగపడుతుంది. ఆస్పత్రిలో ప్రోబ్స్‌ కాళ్లకు లేదా చేతులకు చుట్టి ఆ రీడింగు ద్వారా ఆక్సిజన్‌ లెవెల్స్‌ తెలుసుకుంటాము. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్‌ ఆక్సిమీర్‌ కాలి బొటన వేలికి పెట్టి రీడింగ్‌ తెలుసుకోవచ్చు. పిల్లల్లో ఆక్సిన్‌ స్థాయి 94 కన్నా తక్కువగా ఉంటే వెంటే వైద్యులను సంప్రదించాలి.

పిల్లలు ఎక్కువ సేపు మాస్క్‌ పెట్టుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? తరచుగా శానిటైజర్‌ చేతులకు రాసుకోవడం మంచిదేనా?

కరోనా ఫస్ట్‌ వేవ్‌లో 5 సంవత్సరాల లోపు పిల్లలకు మాస్క్‌ పెట్టకపోవడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం వల్ల చర్మానికి మేలు చేసే బాక్టీరియా చనిపోతుంది. అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లినప్పడు శానిటైజర్‌ రాసుకోవాలి.

పిల్లలు లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ల మానసిక స్థితి మెరుగుపడాలంటే ఏం చేయాలి?

పిల్లలను ఇంట్లోనే ఉంచడం వల్ల ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఈ విషయాలు మనకు వెంటనే తెలియవు. ఒక జనరేషన్‌ దాటితే దాని ప్రభావం కనిపిస్తుంది. వీటి మీద ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని