ఈయన మన దేవుడు: సెహ్వాగ్‌  - sehwag posts funny video with sachin tendulkar and yuvraj singh
close
Updated : 09/03/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈయన మన దేవుడు: సెహ్వాగ్‌ 

సచిన్‌ను ఉద్దేశిస్తూ వీరూ సరదా వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో ఆట్‌టైమ్‌ అత్యుత్తమ ఓపెనర్లలో టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ జోడీ ఒకటి. వీరిద్దరూ బరిలోకి దిగారంటే పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. అలాంటి బ్యాట్స్‌మెన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలమైనా ఇంకా పరుగుల దాహం తీరలేదు. రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌ తరఫున ఆడుతూ సత్తా చాటుతున్నారు. దాంతో తమ అభిమానులకు మునుపటి రోజుల్ని గుర్తుకు తెస్తున్నారు.

ఈ క్రమంలోనే మొన్న బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ను చిత్తు చేసిన సెహ్వాగ్‌(80*; 35 బంతుల్లో 10x4, 5x6), సచిన్‌(33*; 26 బంతుల్లో 5x4).. ఇప్పుడు తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్‌ తలపడనున్నారు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌ ప్రక్రియలో భాగంగా సచిన్‌ తాజాగా తన ఎడమ మోచేతికి సూదులు గుచ్చుకొని ఫిజియో పర్యవేక్షణలో సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న సెహ్వాగ్‌.. సచిన్‌, యువీతో కలిసి సరదాగా జోకులు పేల్చాడు. ‘ఈయన మన దేవుడు. క్రికెట్‌ ఆడీ ఆడీ చేతులమీద వెంట్రుకలు కూడా రాలేదు. ఇప్పుడు సూదులు గుచ్చుకొని తర్వాతి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు’ అని హాస్యం పండించాడు.

తర్వాత పక్కనే కూర్చున్న యువరాజ్‌ సింగ్‌ను పలకరిస్తూ ‘మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడో లేదో తెలుసుకుందాం’ అని అన్నాడు. దానికి యువీ దీటైన జవాబిచ్చాడు. ‘భాయ్‌ నువ్వు ఒక సింహం. ఆయన(సచిన్‌) ఒక కొదమ సింహం’ అని దిగ్గజాలను కీర్తించాడు. ఆపై సెహ్వాగ్‌ మళ్లీ సచిన్‌ను ఉద్దేశించి.. ‘సర్‌ మీ సన్నద్ధత ఎలా ఉంది’ అని అడిగాడు. సచిన్‌ స్పందిస్తూ..‘నువ్వుండగా ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందా?’ అని సరదాగా అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మళ్లీ వీరూ అందుకొని. ‘మీరు ఎక్స్‌పర్ట్‌ కదా.. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మ్యాచ్‌కు సిద్ధమయ్యారా’ అని ప్రశ్నించాడు. సచిన్‌ సమాధానమిస్తూ ‘అందుకోసమే ప్రయత్నిస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని