అమ్మాయిలు చిత్ర పరిశ్రమకి రావాలి
close
Published : 28/10/2021 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాయిలు చిత్ర పరిశ్రమకి రావాలి

- అల్లు అర్జున్‌

‘‘చిత్ర పరిశ్రమల్లో అన్ని సమస్యలూ తొలగిపోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే ఉత్సాహం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ‘వరుడు కావలెను’ ముందస్తు విడుదల వేడుక జరిగింది. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. వేడుకని ఉద్దేశించి అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘ఇందులోని ‘దిగుదిగు..’ పాట మా ఇంట్లో వినిపిస్తూనే ఉంది. నాగశౌర్య సినిమాలన్నీ చూశా. చాలా అందగాడు. తనలో ఒక అమాయకత్వం ఉంటుంది. తను మంచి మనిషి. చాలా పెద్ద హీరో అవుతాడు. తనలా స్వతంత్య్రంగా ఎదిగినవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి నేపథ్యం లేకపోయినా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. ‘పెళ్లిచూపులు’ చూసిన వెంటనే రీతూవర్మ గురించి కనుక్కున్నా. తను ఇందులో చాలా బాగుంది. లక్ష్మీసౌజన్య దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలు చిత్ర పరిశ్రమకి రావాలి. ముంబయిలో సినిమా చేసేటప్పుడు సెట్లో యాభై శాతం అమ్మాయిలు కనిపిస్తుంటారు. మన దగ్గర ఇలా ఎప్పుడు కనిపిస్తారా అనుకుంటుంటాం. ఆ రోజుల వచ్చాయని నమ్ముతున్నా. గీతాఆర్ట్స్‌ తర్వాత మా సొంత సంస్థల్లా అనిపించేది  హారిక హాసిని, సితార సంస్థలే. చిత్ర పరిశ్రమకి ఈ సీజన్‌ చాలా కీలకం. అన్ని భాషల్లోనూ సినిమాలు విజయవంతంగా ఆడాలి.

ఈ ఏడాది ముగిసే సమయంలో మేం కూడా ‘పుష్ప’తో వస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటాను’’ అన్నారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని నేను చూశాను. సినిమా చూశాక మనతో పాటే ఇంటికొస్తాయి కొన్ని పాత్రలు. మన ఇళ్లల్లో జరిగే, మనకి తెలిసిన ఆడపిల్లల తాలూకు కథ ఇది. మన గుండెలకి దగ్గరగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో నాగశౌర్య చాలా బాగా చేశాడు. రీతూ పెళ్లి నేపథ్యంలో సాగే కథల్లోనే నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చీర కట్టుకున్న ఓ హీరోయిన్‌ని చూశా’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘రెండేళ్ల తర్వాత ఒక వేడుకలో ఇంత మందిని చూడటం చాలా సంతోషంగా ఉంది. దర్శకురాలు సౌజన్య 15 ఏళ్లు కష్టపడింది. ఈ చిత్రంతో తను తప్పక విజయం అందుకుంటుంది. అల్లు అర్జున్‌ ఈ తరానికి ఓ స్ఫూర్తి. ఆయన వేడుకకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 29న ‘రొమాంటిక్‌’ సినిమా కూడా వస్తుంది. రెండూ విభిన్నమైన సినిమాలు. ఆకాష్‌కి ఆల్‌ ది బెస్ట్‌. కలిసి గెలుద్దాం’’ అన్నారు. రీతూవర్మ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా నుంచి చాలా ప్రోత్సహించారు అల్లు అర్జున్‌. ఆయనతో కలిసి పనిచేయడం గురించి ఎదురు చూస్తున్నా’’ అన్నారు. లక్ష్మీసౌజన్య మాట్లాడుతూ ‘‘మాటకీ మనిషికీ చాలా విలువనిచ్చే నిర్మాత చినబాబు. నాగశౌర్య కెమెరా ముందు మాత్రమే నటిస్తారు. తనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనిపించే కథానాయకుడు’’అన్నారు. కార్యక్రమంలో నదియా, తమన్‌, విశాల్‌ చంద్రశేఖర్‌, ప్రవీణ్‌, శరత్‌ చంద్ర, నవీన్‌ నూలి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని