‘అరణ్య’.. ఏనుగుల గళం వినిపించేందుకు - prabhu solomon interview
close
Published : 22/03/2021 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అరణ్య’.. ఏనుగుల గళం వినిపించేందుకు

దర్శకుడు ప్రభు సాల్మన్‌

‘ఫిల్మ్‌ మేకర్స్‌గా మేము ప్రేమ కోసం, రైతుల కోసం, సమాజం కోసం, రకరకాల సమస్యల కోసం పోరాడుతుంటాం. అలా ఏనుగుల కోసం చేసిన పోరాటమే అరణ్య’ అని అన్నారు దర్శకుడు ప్రభు సాల్మన్‌. రానా ప్రధాన పాత్రలో ప్రభు తెరకెక్కించిన చిత్రమిది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు ప్రభు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

అక్కడ మొదలైంది..

గతంలో ‘కుంకి’ (తెలుగులో గజరాజు) చిత్రం షూటింగ్‌ కోసం ముదుముళై అనే ప్రాంతానికి వెళ్లాను. అక్కడే దాదాపు 15 రోజులు ఉండి ఆ సినిమాకి కావాల్సిన సమాచారం సేకరించా. ఈ క్రమంలో భారత్‌లో ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలుసుకున్నాను. ఎందుకలా జరుగుతుందో అన్వేషించాలనుకున్నా. అసోంలోని కాజీరంగా పార్కులో జరిగిన ఎలిఫెంట్‌ వార్‌ కూడా నన్ను కథ రాసేలా చేసింది. అయితే అప్పుడు ఇలాంటి అంశాలన్నింటినీ ‘కుంకి’లో చెప్పడానికి స్కోప్‌ లేదు. మంచి ప్లాట్‌ఫామ్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇరోస్‌ సంస్థ ఇలాంటి ఓ కథ కోసమే వెతుకుతుందని తెలిసి, నా ఆలోచన పంచుకున్నా.

అదో పెద్ద సవాలు..

స్ర్కిప్టు పూర్తయ్యాక ఆడిషన్‌ మొదలుపెట్టాం. ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేయడం పెద్ద ఛాలెంజ్‌గా అనిపించింది. ఎందుకంటే ఈ పాత్ర పోషించే నటుడు అంత ఎత్తు ఉండాలి, ఇలాంటి లుక్స్‌ కావాలని ఊహించుకున్నాను. ‘కుంకి’ చిత్రం చేస్తున్నపుడు రానాని ఓ సారి కలిశాను. తనైతే బావుంటుందని ఈ కథ స్ర్కిప్టు వినిపించా, విన్న వెంటనే నచ్చిందన్నారు రానా. మాటల్లో చెప్పినంత తేలికగా అవలేదు ఈ ప్రాజెక్టు. సుమారు నాలుగేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాను. ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా జాదవ్‌ గారిని నేను కలవలేదు. అందరూ అనుకుంటున్నట్టు ఇది ఆయన కథ కాదు. ఆయన స్ఫూర్తిని తీసుకున్నా అంతే. ఏనుగులు, ఏనుగులు గోడను కూల్చడం (ఎలిఫెంట్‌ వార్‌) ఆధారంగా రాసుకున్న స్ర్కిప్టు ఇది. ఏనుగుల కోసం పోరాడటం, ఏనుగుల గళం వినిపించడమే ఈ ‘అరణ్య’ ఇతివృత్తం. దర్శకులుగా, హీరోలుగా మేము ప్రేమ కోసం, సమాజం కోసం, రైతుల కోసం, రకరకాల సమస్యలపై పోరాడతాం. ప్రకృతి గురించి చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. కరోనా నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. ప్రకృతిని మనం ఎలా ఇబ్బంది పెట్టామో ఇప్పటికైనా తెలుసుకోవాలి. 

థాయ్‌లాండ్‌ పార్కులో..

నటుడినే కాదు లొకేషన్‌ వెతకడమూ చాలా కష్టతరమైంది. ఏనుగులతో షూటింగ్‌ చేయాలంటే అనుమతి ఉండాలి. వియత్నాం, బర్మాలో కొంతమేర చిత్రీకరించాం. శ్రీలంకలో చేద్దామనుకున్నా కుదరలేదు. దాంతో అధిక భాగం థాయ్‌లాండ్‌లో షూట్‌ చేశాం. అక్కడ వందల సంఖ్యలో ఏనుగుల పార్కులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 100 నుంచి 150 వరకు ఏనుగులు ఉంటాయి. వాటిల్లో ప్రధాన పాత్రధారి (ఏనుగు)ని వెతకడం కష్టమైంది. చిత్రీకరణ కోసం 20 ఏనుగుల్ని ఎంపిక చేసి వాటికి 15 రోజుల శిక్షణ ఇచ్చాం.

అడవులో సీసీ కెమెరా..

థాయ్‌లాండ్‌లో షూటింగ్‌ ప్రారంభించిన తొలిరోజు వింత అనుభవం ఎదురైంది. కెమెరా యాంగిల్స్‌ సెట్‌ అయ్యేందుకు కొన్ని కొమ్మల్ని నరికేశాం. వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి మా పాస్‌పోర్టు తీసుకున్నారు. అడవులోని సీసీ ఫుటేజీ చూసి వాళ్లు వచ్చారని తెలిసి ఆశ్చర్యమేసింది. రెండోరోజు షూట్‌లో వాళ్లు మాతోనే ఉన్నారు. కొమ్మల్ని నరక్కుండా ప్లాస్టిక్‌ బెండ్‌ సాయంతో చిత్రీకరణ చేసుకునేలా ఏర్పాటు చేశారు. అక్కడ మొక్కల్ని అంతగా ప్రేమిస్తారు. మన దగ్గర మనిషినే రోడ్డుపై నరికేస్తున్నారు. మొక్కల్ని నరికితే పట్టించుకుంటారా?

మంచి అనుభూతి..

ఇటీవల కాలంలో ఏనుగులపై జరిగిన ఘటనలపై మీడియా వేదికగా స్పందించాను. ఇలాంటి పరిణామాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ సినిమాలో మావోయిస్టులు, నక్సలైట్ల గురించి అంతగా ప్రస్తావించలేదు. ఫోన్‌ సిగ్నల్‌ కూడా రాని ఓ ప్రాంతంలో 30 రోజులు ఉన్నాం. కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉండటం మంచి అనుభూతినిచ్చింది. ‘బాహుబలి’ చిత్రాన్ని చైనాలో పంపిణీ చేసిన సంస్థే ఈ చిత్రాన్నీ అక్కడ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  మార్చి 26 తర్వాతే తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని