close

తాజావార్తలు

కథ కోసం అందరికీ ఫోన్లు చేసేవాడిని..

చిత్రాన్ని నిర్మించొద్దని దిల్‌రాజు చెప్పారు!..

హైదరాబాద్‌: సినిమా కథ కోసం అందరికీ ఫోన్లు చేసేవాడినని ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ హీరో, నిర్మాత రాకేశ్ వర్రె అన్నారు. ‘జోష్’, ‘వేదం’, ‘బద్రీనాథ్’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘జై లవకుశ’, ‘గూఢచారి’ వంటి సినిమాల్లో నటించిన ఆయన ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్. బసవ శంకర్‌ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌ పతాకంపై అక్టోబర్‌ 8న దిల్‌రాజు ఈ సినిమా విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి సినిమాకు చక్కటి స్పందన లభిస్తోందని రాకేశ్ వర్రె తాజా ఇంటర్వ్యూలో అన్నారు.

ప్రేక్షకుల స్పందన బాగుంది
‘మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పండగ రోజున సినిమాను విడుదల చేశాం.. ప్రేక్షకులు వస్తారో? రారో? అనుకున్నాను. నేనైతే పండగ రోజున బయటకి వెళ్ళను. థియేటర్లు హౌస్ ఫుల్‌ అయ్యాయి. ఇది నిజమా? అని నేనే నమ్మలేకపోయాను. ఇప్పటికీ మల్టీప్లెక్స్‌లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. శనివారం శివ పార్వతి థియేటర్‌కు వెళ్లాను. థియేటర్ కెపాసిటీ 1000.. 800 మంది వరకూ వచ్చారు‌‌. చాలా సంతోషంగా ఉంది’.  ‌

దిల్‌రాజు ఏమన్నారంటే..

‘జోష్ సినిమాతో దిల్‌రాజు నన్ను నటుడిగా పరిచయం చేశారు. తర్వాత నేను సినిమాలు చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో అప్ డేట్స్ ఇస్తూ ఉండేవాడిని‌‌. తర్వాత ‘బాహుబలి’లో చేశాను. తర్వాత ‘ఎవరికీ చెప్పొద్దు’ కథ విన్నాను‌.  ఈ స్క్రిప్టు వినమని దిల్‌రాజు దగ్గరికి వెళ్లాను. ఆయనకు వినడానికి సమయం సరిపోలేదు.. వేరేవాళ్లను వినమన్నారు‌. కథ కుదిరినా.. సినిమా ప్రారంభం కాలేదు. ‘నువ్వు ఈ చిత్రాన్ని నిర్మించొద్దు’ అని దిల్‌రాజు నా మంచి కోరి చెప్పారు. నేను చాలా మంది నిర్మాతల దగ్గరకు వెళ్లాను. నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. బహుశా... ఈ స్క్రిప్టులో కులం గురించి ఉండటంతో ముందుకు రాలేదేమో. దాంతో నేనే నిర్మించాను. మళ్లీ దిల్‌రాజు దగ్గరికి వెళ్లాను. సినిమా చూపించాను‌. ‘ఎందుకు నిర్మించావు?’ అని ముందు రెండు, మూడు తిట్లు తిట్టారు‌. తర్వాత ‘మంచి సినిమా ఒక ప్లాన్ ప్రకారం విడుదల చేయాలి’ అన్నారు. అలా థియేటర్లలోకి వచ్చింది.‌

చాలా మందికి ఫోన్లు చేశా
‘పలు సినిమాల్లో నటుడిగా చేయడంతో దర్శకత్వ శాఖలో చాలామంది నాకు తెలుసు. అందరికీ నేను ఫోన్లు చేసేవాడిని.. మీ దగ్గర ఏమైనా స్క్రిప్టు ఉంటే నాకు చెప్పండి అని అడిగేవాడిని‌‌. 47 కథలు విన్నాను. ప్రతి కథ విన్న తర్వాత ఏది బాగుంది, ఏది బాగులేదో రాసుకునే వాడిని. అప్పటికే శంకర్ కథను ఒక ప్రొడక్షన్ హౌస్ ఓకే చేసింది. నటించేందుకు ఇద్దరు ముగ్గురు హీరోలు రెడీగా ఉన్నారు. శంకర్‌ నైపుణ్యం గురించి విన్నాను. దాంతో అతని వెనకపడ్డాను. కొన్ని నెలల తర్వాత తనే ఫోన్ చేశారు. కథ చెబుతాను నచ్చితే చేయమని అన్నారు‌. అలా ‘ఎవరికీ చెప్పొద్దు’ కథ నచ్చింది... వెంటనే చేశా’‌.
చిరు ప్రభావం
‘చిన్నతనం నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. చిరు ప్రభావం నాపై చాలా ఉంది. నేను చూసిన ఫస్ట్ సినిమా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ చిత్రాన్ని 50, 60 సార్లు చూసుంటాను. నాపై ఆ సినిమా బలమైన ప్రభావం చూపించింది. నాకు తెలియకుండా హీరో కావాలనే కోరిక బలపడింది’.

 

 

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.