close

ప్రధానాంశాలు

Updated : 16/04/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్తి కోసం... ఏడేళ్ల బావమరిది హత్య

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ఆస్తికోసం బావమరిదిని బావ హతమార్చిన ఉదంతం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అర్బన్‌ సీఐ శ్రీధర్‌ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం... కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చీగలపల్లె గ్రామానికి చెందిన వెంకటప్ప, పాపమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు వెంకటాచలపతి(7) రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉగాది కావడంతో గ్రామదేవతల పూజల కోసం వెంకటాచలపతి తోటివారితో కలిసి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకులాడుతుండగా సమీపంలోని మొక్కజొన్న చేను దగ్గర మృతదేహం కనిపించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బాలుడి అక్క భర్త అయిన రాఘవేంద్రది కర్ణాటక రాష్ట్రంలోని పాతరామగళ్లు గ్రామం. ఆయన తన భూమిలో ఏడుసార్లు బోర్లు వేసి రూ.5 లక్షల దాకా అప్పులపాలయ్యాడు. ఉగాదికి చీగలపల్లె వచ్చాడు. పొలం రాసిస్తే అమ్మి అప్పు తీర్చుకుంటానని మామ వెంకటప్పను అడిగాడు. ఆస్తి మీకిచ్చేస్తే తన కొడుకు భవిష్యత్తు ఎలా? అని ఆయన నిరాకరించాడు. బావమరిదిని చంపితే ఆస్తి మొత్తం తన భార్యకు దక్కుతుందన్న దురాశతో రాఘవేంద్ర కుట్రపన్నాడు. మంగళవారం రాత్రి వెంకటాచలపతిని మొక్కజొన్న తోటలోకి తీసుకెళ్లి, బండరాయితో తలపై మోది చంపాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇంటికి వచ్చాడు. బాలుడి మరణంపై కుటుంబసభ్యులను పోలీసులు వివరాలడిగే సరికి రాఘవేంద్ర పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చి విచారించగా హత్య విషయం బయటపడింది. నిందితుడిని రిమాండుకు తరలించనున్నట్లు సీఐ చెప్పారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన