పెట్రో ధరలు పెంచారంటూ బస్సుకు నిప్పంటించిన యువకుడు

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:06 IST

పెట్రో ధరలు పెంచారంటూ బస్సుకు నిప్పంటించిన యువకుడు

కనిగిరి, న్యూస్‌టుడే: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారంటూ ఓ యువకుడు ఆగ్రహంతో ఆర్టీసీ బస్సుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది. సీఐ బి.పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. వెలిగండ్ల మండలం మొగుళ్లూరు గ్రామానికి చెందిన రామగిరి మాలకొండయ్య కుమారుడు ఏడుకొండలు(21) గురువారం ఉదయాన్నే కనిగిరిలోని పామూరు బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడ బయలుదేరేందుకు నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సు వద్దకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న లీటరు పెట్రోల్‌ను ముందుభాగంలో పోసి నిప్పంటించాడు. మంటలు రావడంతో లోపలున్న ప్రయాణికులు కేకలు వేశారు. యువకుడు బస్సులోకి ప్రవేశించి వారిని దుర్భాషలాడుతూ.. ప్రభుత్వాలు ధరలు పెంచితే మీరు ఎందుకు అడగడం లేదంటూ ప్రశ్నించాడు. దారినపోయేవారిపై కేకలు వేస్తూ చుట్టుపక్కల సైతం నిప్పు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. తాను పవన్‌కల్యాణ్‌ అభిమానినని, 2024లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరిక అని.. పెట్రో ధరలు తగ్గించాలని ఏడుకొండలు అన్నాడు. తాను ధరించిన పవన్‌కల్యాణ్‌ బొమ్మతో కూడిన టీషర్టును అందరికీ చూపించాడు. బస్సును కావాలనే తగలబెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. డ్రైవర్‌, కండక్టర్‌తో సహా స్థానికులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. పోలీసులకు సమాచారమందించడంతో యువకుడిని అరెస్టు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన