కొలిక్కిరాని దుర్గగుడి దుకాణాల వేలం!
eenadu telugu news
Updated : 04/08/2021 13:08 IST

కొలిక్కిరాని దుర్గగుడి దుకాణాల వేలం!

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గగుడిలో పాలకుల పెత్తనంతో దుకాణాల వేలం మంగళవారం నిలిచిపోయింది. మల్లికార్జున మహామండపంలోని ఐదో అంతస్తులో పూజా ద్రవ్యాలు, దండలు, అమ్మవారి పటాలు విక్రయించే దుకాణాలు పది వరకు ఉన్నాయి. వీటికి సంబంధించిన అద్దెలు కొవిడ్‌ కారణంగా గత ఆరు నెలలుగా చెల్లించడం లేదు. ఈ విధంగా దేవస్థానానికి వచ్చే ఆదాయానికి గండిపడటంతో ఈ నెల 3న వేలం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈక్రమంలో పలువురు డిపాజిట్టు రుసుము రూ.2లక్షలు చెల్లించి వేలంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. కనకదుర్గానగర్‌లో దుకాణాలు కేటాయిస్తామని చెప్పి అధికార పార్టీకి చెందిన నేతలు మహామండపంలోని కొందరు దుకాణదారుల వద్ద రూ.2లక్షలు చొప్పున వసూలు చేశారు. ప్రస్తుతం అక్కడ ఉన్న క్లోక్‌ రూమ్‌, సెల్‌ఫోను భద్రపరిచే గదులను తొలిగించి దుకాణాలు ఏర్పాటు చేయిస్తామని అధికార పార్టీ నాయకులు దుకాణదారులకు వాగ్దానం చేశారు. దీంతో డబ్బులు ఇచ్చిన వారు దేవస్థానం ఇచ్చిన ప్రకటనతో అవాక్కయ్యారు. వేలం పాటను నిర్వహిస్తే తాము చెల్లించిన డబ్బును నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి వేలం జరగకుండా చూసేందుకు దేవస్థానం అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పాటపాడేందుకు రూ.2లక్షలు చెల్లిస్తామని చెప్పిన వారి వద్ద దేవస్థానం అధికారులు డిపాజిట్టు మొత్తాన్ని తీసుకోకుండా తాత్సారం చేయడంతో వాగ్వాదం జరిగింది. వేలం నిర్వహించనప్పుడు పత్రికల్లో ప్రకటన ఎందుకు ఇచ్చారని వారు అధికారులను నిలదీశారు. కొత్తవారికి అవకాశం లేకుండా పాత దుకాణదారులు అందరూ ఒక్కటై వేలంపాటలో పాల్గొన కూడదని నిర్ణయించడంతో దేవస్థానం అధికారులు దుకాణాల వేలాన్ని వాయిదా వేశారు. 

కనకదుర్గానగర్‌లో దుకాణాల ప్రతిపాదన ప్రాంతం ఇదే..

చీరల వేలం వాయిదా...

అమ్మవారికి మొక్కుబడుల నిమిత్తం భక్తులు సమర్పించిన పట్టు చీరలు, సాధారణ చీరలు సేకరించి వాటికి సంబంధించిన వేలంపాటను దేవస్థానం అధికారులు జమ్మిదొడ్డిలోని ఉద్యోగుల పరిపాలన కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. వాస్తవానికి గతంలో చీరల వేలంలో డిపాజిట్టు రూ.25లక్షలు ఉండేది. దీన్ని ఈ ఏడాది రూ.50లక్షలకు పెంచి వేలం నిర్వహించడంతో ఇద్దరు మాత్రమే డిపాజిట్టు చెల్లించి వేలంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. గతంలో చీరల వేలం ద్వారా రూ.3 కోట్లకు పైగా పాటరాగా.. ప్రస్తుతం వచ్చిన ఇద్దరు గుత్తేదారులు రూ.2.37 కోట్లకు మించి పాడక పోవడంతో వేలాన్ని వాయిదా వేసినట్లు దేవస్థానం ఏఈవో వెంకటరెడ్డి తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని