తెరిపివ్వని వర్షం
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

తెరిపివ్వని వర్షం

జిల్లాపై ‘గులాబ్‌’ ప్రభావం

క్రోసూరు: బయ్యవరం వద్ద వరద నీటిలో పత్తి పైరు    

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: గులాబ్‌ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున మొదలైన వర్షం మధ్యాహ్నం వరకు తెరిపివ్వలేదు. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలో ఇప్పటికే అధ్వానంగా ఉన్న రోడ్లలో గుంతల్లో వర్షం నీరు నిలిచి రాకపోకలకు ఆటంకంగా మారాయి. ఇటీవల తాగునీటి పైపులైను మరమ్మతుల కోసం తవ్విన గుంతలు తటాకాలుగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు పనులపై బయటకు వెళ్లేందుకు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇటీవల నారు నాటిన పొలాలకు ప్రస్తుతం వర్షం కొంత మేలు చేసినట్లయింది. వేమూరు, చుండూరు, మంగళగిరి, దుగ్గిరాల, మాచవరం, భట్టిప్రోలు, బెల్లంకొండ, కొల్లిపర, బపట్ల, పెదకూరపాడు, యడ్లపాడు, వినుకొండ, తుళ్లూరు, దాచేపల్లి, పెదనందిపాడు, పీవీపాలెం, రేపల్లె, గురజాల, కారంపూడి, దుర్గి, సత్తెనపల్లి, నిజాంపట్నం, వట్టిచెరుకూరు, మాచర్ల, అమృతలూరు, అచ్చంపేట, చేబ్రోలు, పెదకూరపాడు మండలాల్లో వర్షం మధ్యాహ్నం వరకు తెరిపివ్వకుంండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
సగటున 8.7 మి.మీ వర్షపాతం
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 8.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అమరావతి మండలంలో అత్యధికంగా 42.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పెదకూరపాడు 26.6, మాచవరం 25.4, చుండూరు 23.4, తెనాలి 19.8, తాడికొండ 19.4, మంగళగిరి 15.8, క్రోసూరు 14.8, గుంటూరు 13.6, పెదకాకాని 13, అచ్చంపేట 12.8, దుగ్గిరాల 12.6, పిడుగురాళ్ల 12.6, కారంపూడి 12.4, కొల్లూరు 11.4, అమృతలూరు 10.8, తుళ్లూరు 10.6, తాడేపల్లి 9.8, మేడికొండూరు 9.6, వట్టిచెరుకూరు 9.6, సత్తెనపల్లి 9.2, చేబ్రోలు 9, భట్టిప్రోలు 8.8, వేమూరు 8.8, నకరికల్లు 8.6, ఫిరంగిపురం 8.4, దాచేపల్లి 7.8, రేపల్లె 7.6, రాజుపాలెం 7.4, చెరుకుపల్లి 7.2, నాదెండ్ల 6.2, కర్లపాలెం 5.8, పెదనందిపాడు 5.8, బాపట్ల 5.6, కొల్లిపర 5.6, ముప్పాళ్ల 5.4, నగరం 5.4, పొన్నూరు 5.2, ప్రత్తిపాడు 5, చిలకలూరిపేట 4.6, బెల్లంకొండ 4.2, కాకుమాను 4.2, రెంటచింతల 4.2, పిట్టలవానిపాలెం 4, నిజాంపట్నం 3.6, నరసరావుపేట 3.4, నూజెండ్ల 2.4, బొల్లాపల్లి 1.2, ఈపూరు 1.2, యడ్లపాడు 1, వినుకొండ 1, శావల్యాపురం 0.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
తుపానుపై అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్‌
కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: గులాబ్‌ తుపాన్‌ నేపథ్యంలో జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. తుపాను ప్రభావంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సోమవారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గులాబ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో గడిచిన 24 గంటల్లో 8.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వర్షాలతో ఎటువంటి నష్టం జరగలేదని, ఒక గేదె పిడుగుపాటుకు మరణించిందని తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు అనుమతించలేదని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని