క్రికెట్‌ బెట్టింగ్‌ నిందితుడి అరెస్టు
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

క్రికెట్‌ బెట్టింగ్‌ నిందితుడి అరెస్టు

వివరాలు తెలుపుతున్న నగరంపాలెం సీఐ హైమారావు

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే : ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న నిందితుడిని నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీసుస్టేషన్‌లో నిందితుల వివరాలను సీఐ హైమారావు తెలిపారు. ఐపీడీ కాలనీకి చెందిన తొండేపు శరణ్‌ ఇంటర్‌ వరకు చదువుకొని మిఠాయిలు, నూనెల తయారీ కంపెనీల్లో పదేళ్లు పనిచేశాడు. చెడు వ్యసనాలకు బానిసై అడ్డ దారిలో డబ్బులు సంపాదించడానికి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులైన శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాచర్లకు చెందిన శ్రీను, త్రిలోక్‌లు, నరసరావుపేటకు చెందిన రామిరెడ్డి ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్‌లో యాప్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. నగరంపాలెంలో ఓ గదిని మిర్చి కమీషన్‌ కార్యాలయానికి అద్దెకు తీసుకొని అందులో ఏడాదిగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీఐ హైమారావు, ఎస్సై షరీఫ్‌, హెచ్‌సీలు జానయ్య, ఖాన్‌, చంద్రశేఖర్‌రెడ్డి అర్ధరాత్రి సమయంలో ఆ గదిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తేలడంతో అక్కడ ఉన్న ప్రధాన నిందితుడు శరణ్‌ను అరెస్టు చేసి రూ.60 వేల నగదు, కంప్యూటర్లు, చరవాణిలు జప్తు చేశారు. మిగిలిన ఐదుగురి పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని