
అధికారులు లేకుండా సీఎంల చర్చలా?:పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరు గంటలకుపైగా సుదీర్ఘ ఏకాంత చర్చలు చేయడంలో పారదర్శకత ఎక్కడ ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. అధికారులెవరూ లేకుండా ముఖ్యమంత్రులు మాత్రమే చర్చలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటని పొన్నాల నిలదీశారు. తెలంగాణలో పురపాలిక ఎన్నికల నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు, అభిమానులను తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నంలోనే ఏపీ సీఎం జగన్తో ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా మూడేళ్లుగా అధిక మొత్తంలో నీటిని ఏపీకి తరలిస్తున్నారని ఆరోపించారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచిపోవద్దని వైకాపా అభిమానులు, కార్యకర్తలను విజ్ఞప్తి చేశారు. వారిద్దరు కృష్ణ, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించి ఉంటే వారితో నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఎందుకు లేరని పొన్నాల ప్రశ్నించారు.