Updated : 11/06/2021 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటలతో భాజపా ముఖ్యనేతల కీలక భేటీ

హైదరాబాద్‌: తెలంగాణలో అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య యుద్ధం జరుగుతోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. భాజపా ముఖ్యనేతల సమావేశం ముగిసిన వెంటనే తరుణ్‌ చుగ్‌ శామీర్‌పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నివాసానికి వెళ్లారు. తరుణ్‌చుగ్‌తో పాటు భాజపా నేతలు లక్ష్మణ్‌, డీకే ఆరుణ, రఘునందన్‌రావు, రాజాసింగ్‌, ఎంపీ సోయం బాపురావు, రామచంద్రరావు, ఏ.చంద్రశేఖర్‌, వివేక్‌ తదితరులు ఈటల నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. తన గన్‌మెన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ రావటంతో బండి సంజయ్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఆయన ఈటల నివాసానికి వెళ్లలేకపోయారు. 

ఈటలతో భేటీ అనంతరం తరుణ్‌చుగ్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రగతి కోసం గత 20 ఏళ్లుగా ఈటల రాజేందర్‌ కొట్లాడుతున్నారు. రాష్ట్ర  ప్రభుత్వం తన విధి మర్చిపోయింది. కేసీఆర్‌, ఆయన కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్టుంది. తెలంగాణ లక్ష్యం వెనక్కి పోయింది. ఈటల పోరాటం తెలంగాణ సమాజం కోసం. ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. తెలంగాణ వికాసమే భారతీయ జనతాపార్టీ లక్ష్యం. మాతో కలిసి పోరాటం చేయడానికి ఎంత మంది వస్తే వారందరినీ కలుపుకొని పోతాం. ఉద్యమ కారుడు ఈటలకి భారతీయ జనతాపార్టీ స్వాగతం పలుకుతోంది’’ అని తరుణ్‌ చుగ్‌ అన్నారు.

 మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ నెల 14న  కాషాయం గూటికి చేరనున్నారు. దిల్లీలో భాజపా సభ్యత్వం తీసుకుంటారని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ మరికొందరు నేతలు భాజపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనకు ముందే ఈటల రాజీనామా చేస్తారని సమాచారం. కొవిడ్‌ పరిస్థితులు, స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకని నేపథ్యంలో ఈమెయిల్‌ ద్వారా రాజీనామా లేఖ పంపే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని