ఇక సత్వరమే ఫలితాలు!
eenadu telugu news
Published : 22/09/2021 06:02 IST

ఇక సత్వరమే ఫలితాలు!

 రేడియాలజీ పరీక్షల కోసం నిమ్స్‌తో ఒప్పందం

వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రతిపాదనలు
ఈనాడు, హైదరాబాద్‌

పేద రోగులకు తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ద్వారా అందిస్తున్న పరీక్షల్లో జాప్యాన్ని నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. కొన్ని రకాల పరీక్షల కోసం నిమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. తద్వారా పలు రేడియాలజీ పరీక్షల నివేదికలను అనుకున్న సమయానికి అందించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ద్వారా దాదాపు వంద రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్న సంగతి తెలిసిందే. నారాయణగూడ ఐపీఎం వద్ద ఉన్న ల్యాబ్‌తో పాటు నగరంలోని 8 ప్రాంతాల్లోనూ ప్రత్యేక ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు.. ఇలా దాదాపు 123 కేంద్రాల నుంచి శాంపిళ్లు సేకరించి ఆయా ల్యాబ్‌లకు పంపుతున్నారు. వివిధ రకాల కారణాలతో ఈ పరీక్షల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని పరీక్షల నివేదికలు మూడు రోజులయినా ప్రజలకు అందడం లేదు. ఎక్స్‌రే, ఈసీజీ, ఎంఆర్‌ఐ, సిటీస్కాన్‌, అల్ట్రా సౌండ్‌ లాంటి పరీక్షల్లో ఎక్కువగా ఆలస్యం జరుగుతోంది. సరిపడా రేడియాలజిస్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముగ్గురే సిబ్బంది అన్ని కేంద్రాలు తిరుగుతూ పరీక్షలు చేయాల్సి రావడంతో వారిపై ఒత్తిడి అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’లో ‘ప్చ్‌...ఫలితం లేదు’ అన్న శీర్షికతో వచ్చిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. లాలాపేట్‌, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట్‌, బార్కాస్‌, జంగంమెట్‌, పన్నీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండి తదితర కేంద్రాల్లో జరుగుతున్న 57 రకాల పరీక్షలకు సంబంధించి వీలైనంత త్వరగా నివేదికలు అందించాలని నిర్ణయించారు. నిమ్స్‌లోని రేడియాలజీ విభాగంతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. ఆయా కేంద్రాల్లో చేసిన పరీక్షల నివేదికలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా నిమ్స్‌కు చేరుతాయి. అక్కడ ఉన్న సిబ్బంది వాటిని విశ్లేషించి నివేదిక రూపొందించి మళ్లీ ఆన్‌లైన్‌ ద్వారా ఆయా కేంద్రాలకు.. అక్కడి నుంచి రోగులకు నివేదికలు అందించనున్నారు. ఇందుకు అవసరమైన అదనపు సిబ్బంది, ఇతర సరంజామాను నిమ్స్‌ సమకూర్చుకోనుంది. ఐపీఎం ల్యాబ్‌ వద్ద జరుగుతున్న పరీక్షల నివేదికలు కూడా వీలైనంత త్వరగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షలు 24 గంటల్లోనే అందించనున్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని