ఆక్సిజన్‌ లేకుండానే మనస్లు పర్వతం అధిరోహణ
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

ఆక్సిజన్‌ లేకుండానే మనస్లు పర్వతం అధిరోహణ

నగర యువకుడి సాహసం

పర్వతంపై త్రివర్ణ పతాకంతో అనురాగ్‌

కర్మన్‌ఘాట్‌, న్యూస్‌టుడే: ఆక్సిజన్‌ సాయం లేకుండానే నేపాల్‌లోని గోరాఖ్‌ జిల్లాలో ఉన్న మనస్లు పర్వతాన్ని అధిరోహించాడు నగర యువకుడు. ప్రపంచంలోనే ఎనిమిదో ఎత్తైన ఈ పర్వతం.. సముద్ర మట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉంది. భవిష్యత్‌లోనూ ఎలాంటి ఆక్సిజన్‌ లేకుండానే ఎవరెస్టు శిఖరాన్ని సైతం అధిరోహించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నట్లు శనివారమిక్కడ తన నివాసంలో ఆయన తెలిపారు. ఎల్బీనగర్‌ పరిధి కర్మన్‌ఘాట్‌లోని జానకీ ఎన్‌క్లేవ్‌ కాలనీకు చెందిన నల్లవెల్లి సతీష్‌రెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు అనురాగ్‌(29). హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తిచేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఐటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు చిన్నతనం నుంచే స్నేహితులతో కలిసి చిన్నస్థాయి పర్వతాలను అధిరోహించారు.. అమెరికా వెళ్లాక స్నేహితులతో కలిసి పర్వతోరోహణకు సంబంధించి సాధన ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికాలోని ఎతైన శిఖరం మౌంట్‌ రైనర్‌ను మూడు సార్లు అధిరోహించారు. అదే ప్రాంతంలోని మౌంట్‌ఉడ్‌, సాస్టా సహా టికోటి ఒరిజాబా పర్వతాలనూ పలుమార్లు ఎక్కారు. ఇదే సాహసంతో.. సెప్టెంబరు 28న.. అదనపు ఆక్సిజన్‌, వ్యక్తిగత షెర్పా లేకుండానే నేపాల్‌లోని మనస్లు పర్వతాన్ని అధిరోహించారు. ప్రాణవాయువు సాయం లేకుండానే ప్రపంచంలో ఎనిమిదో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడిగా తనకు గుర్తింపు దక్కిందన్నారు. దీన్ని అధిరోహించే క్రమంలో.. సెప్టెంబరు 2వ తేదీన కాఠ్‌మండూ నుంచి బయలుదేరిన ఆయన 9వ తేదీన అక్కడి బేస్‌ క్యాంపునకు చేరుకున్నాడు. అనంతరం 28వ తేదీన పర్వత శిఖరానికి చేరుకున్నాడు. మొత్తం 20 రోజుల్లో మనస్లు పర్వాతాన్ని అధిరోహించినట్లు అనురాగ్‌ వెల్లడించారు.

ఎవరెస్టునూ ఎక్కుతా..

నేపాల్‌లోని మనస్లు పర్వతాన్ని ఆక్సిజన్‌ లేకండానే ప్రస్తుతం అధిరోహించాను. భవిష్యత్‌లోనూ ప్రపంచదేశాల్లోని ప్రతి పర్వతాన్ని అధిరోహించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాను. దీనిలోభాగంగా 2022లో 8,481 ఎత్తులో ఉన్న మకాలు, 8,188 ఎత్తులో ఉన్న ధౌలగిరి, 8,091 ఎత్తులోని అన్నపూర్ణతో పాటు 2023లో ఆక్సిజన్‌ లేకుండానే 8,586 ఎత్తులోని కాంచన్‌జంగ్‌, 8,849 ఎత్తులోని ఎవరెస్టు శిఖరాన్ని సైతం అధిరోహిస్తాను. ఇందుకోసం ఇప్పటి నుంచే సాధన మొదలు పెట్టానని అనురాగ్‌ తెలిపారు. తన సాధనకు ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని