10మంది ఎక్కడ?
eenadu telugu news
Published : 26/10/2021 04:50 IST

10మంది ఎక్కడ?

పటాన్‌చెరు అర్బన్‌, పహాడీషరీఫ్‌, రాజేంద్రనగర్‌, మల్కాజిగిరి, కాప్రా, బోడుప్పల్‌ బాలానగర్‌, న్యూస్‌టుడే: నగరంలో వేర్వేరు ఘటనల్లో పదిమంది అదృశ్యమయ్యారు. కొందరు కుటుంబ గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోగా మరికొందరు వివిధ పనులపై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయా ఘటనలపై కుటుంబసభ్యుల ఫిర్యాదు కేసులు నమోదయ్యాయి. పటాన్‌చెరు ఠాణా పరిధిలో అంబేడ్కర్‌కాలనీకి చెందిన చింతారావు(70) పింఛను డబ్బులకు బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో ఉంటున్న మహిళ ఈనెల 23న భర్తతో గొడవ పడింది. భర్త మెదక్‌ జిల్లా శంకరంపేట మండలంలోని స్వగ్రామానికి వెళ్లి తర్వాత భార్యను అక్కడకి రమ్మని చెప్పాడు. ఆమె వెళ్తున్నానని చెప్పినా అక్కడకు చేరలేదు.  పహాడీషరీఫ్‌కు చెందిన అబు ఫైసల్‌(16)ను మదర్సా పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈనెల 24న కిరాణాకొట్టుకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు.  రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని ఎంఎం పహడీకి చెందిన అమ్రీన్‌, అబ్రార్‌ భార్య భర్తలు. వీరికి అక్సాబేగం(5), అజాబేగం(2) ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆదివారం అమ్రీన్‌ కుమార్తెలను తీసుకొని బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. మల్కాజిగిరి ఠాణా పరిధి తాళ్లబస్తీలో నివసించే యువతి(20) తరచూ ఫోనులో మాట్లాడుతుండటంతో సోదరుడు మందలించాడు. మనస్తాపానికి గురై సోమవారం ఉదయం ఇంట్లోంచి వెళ్లిపోయింది. బాలానగర్‌ ఠాణా పరిధి ఇంద్రానగర్‌ గుడిసెల్లో నివాసముంటున్న వివాహిత (27) ఈనెల 23న కంపెనీకని వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.  బోడుప్పల్‌ ఇందిరానగర్‌కు చెందిన పొన్నాల ప్రదీప్‌రెడ్డి(32) కాప్రా మున్సిపల్‌ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగి. ఆదివారం నుంచి కనిపించకుండాపోయాడు. కాప్రాలోని గాంధీనగర్‌కు చెందిన బండి రాములమ్మ (55) ఈనెల 20న నేత్ర చికిత్స కోసం మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స తర్వాత 22న బస్సులో పయనమైనా ఇంటికి చేరుకోలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని