వడివడిగా.. వైద్య కళాశాల
eenadu telugu news
Published : 20/10/2021 03:22 IST

వడివడిగా.. వైద్య కళాశాల

పోస్టుల భర్తీకి నియామక ప్రకటన
జాతీయ కమిషన్‌కు దరఖాస్తులు

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

గోదావరిఖనిలో వైద్య కళాశాల భవనం నిర్మించాల్సిన స్థలం

గోదావరిఖనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడు వైద్య కళాశాలల ఏర్పాటు పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఖనితో పాటు ఆయా నగరాల్లో వైద్య కళాశాలల భవన నిర్మాణానికి స్థల సేకరణ పూర్తికాగా వైద్య విధాన పరిషత్తు, వైద్య ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న అర్హులైన పీజీ వైద్యులను కౌన్సెలింగ్‌ ద్వారా వైద్య కళాశాలల్లో పనిచేసేందుకు తీసుకున్నారు. వీరు పోను ఇంకా 200 మంది ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయక ఆచార్యులను తాత్కాలిక ప్రతిపాదికన నియమించేందుకు తెలంగాణ వైద్య, విద్య సంచాలకులు ప్రకటన జారీ చేశారు. ఔత్సాహికులు ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే ఈనెల 31న ఎంపిక జాబితాలను ప్రకటించనుండగా నవంబరు ఏడో తేదీలోగా వారు ఆయా కళాశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 2022-23 విద్యా సంవత్సరంలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించడంతో పాటు జూన్‌లో ఎం.బి.బి.ఎస్‌. మొదటి సంవత్సరం ప్రవేశాలు తీసుకోవాలంటున్న తెలంగాణ వైద్య విద్య సంచాలకులు ఆ మేరకు చర్యలను వేగవంతం చేశారు. తాత్కాలిక విధానంలో ఆచార్యుల నియామకం ప్రకటన జారీ చేసిన ఆయన త్వరలోనే శాశ్వత ప్రతిపాదికన ఆచార్యుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాలల్లో పనిచేసే వారికి వేతనాలు మెరుగ్గా ఉండడంతో పనిచేసేందుకు చాలామంది ముందుకు వచ్చే అవకాశముంది. వైద్య విధాన పరిషత్తు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్య కళాశాలల్లో అచార్యుల నియామకం కోసం ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్‌పై కొందరు కోర్టును ఆశ్రయించడంతో బుధవారం విచారణ జరుగనున్నట్లు సమాచారం. బుధవారం కోర్టులో జరిగే విచారణ, ఆదేశాల ప్రకారం నియామక ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఒక్కో వైద్య కళాశాలలో 146 మంది బోధనా సిబ్బంది, 554 మంది పారామెడికల్‌, బోధనేతô, నర్సింగ్‌ సిబ్బంది అవసరం.

పూర్తయిన స్థల సేకరణ..
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల పక్కనున్న సుమారు 21 ఎకరాల స్థలంలో వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ముందున్న మరో 7 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల అవసరాలకు వినియోగించుకోనుండగా మరో 4 ఎకరాల స్థలాన్ని సింగరేణి మరోచోట కేటాయించింది. గోదావరిఖనిలో వైద్య కళాశాలకు అవసరమైన భవనాల నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం రూ.510 కోట్లు సమకూర్చనుంది. భవన నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. సంబంధిత అధికారులు స్థలాన్ని క్షేత్రస్థాయిలో స్థలాన్ని, దస్త్రాలను పరిశీలించారు. టీచింగ్‌ ఆస్పత్రిగా ప్రకటించిన గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో సుమారు మరో 40 పడకల సామర్థ్యంతో అదనంగా నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున వైద్య విభాగానికి సంబంధించిన ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రామగుండం ఎన్టీపీసీ నిధులతో ఆస్పత్రి భవనంపైన చేపట్టిన రెండో అంతస్థు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. సమగ్ర వివరాలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కళాశాల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. జాతీయ వైద్య విద్య కమిషన్‌ నుంచి అనుమతి తప్పనిసరి కావడంతో ఇప్పటివరకు కళాశాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు, వేగవంతమైన పనులు, సదుపాయాలు తదితర అంశాలపై ఈ నెలాఖరులోగా నిర్ణీత రుసుం చెల్లించి జాతీయ వైద్య విద్య కమిషన్‌కు తెలంగాణ వైద్య విద్య సంచాలకులు దరఖాస్తు చేయనున్నారు. నవంబరులో ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి, వైద్య కళాశాల నిబంధనల ప్రకారంగా సదుపాయాలుంటే అనుమతులు మంజూరు చేయనున్నారు.


వైద్య కళాశాలలో పోస్టుల వివరాలు
ఆచార్యులు :   23
సహ ఆచార్యులు : 42
సహాయక ఆచార్యులు : 81
పారామెడికల్‌, బోధనేతర సిబ్బంది : 182
నర్సింగ్‌ సిబ్బంది : 372 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని