
బండ బాదుడు
● రాయితీ సిలిండర్‌పై రూ.50 పెంపు
*జిల్లాలో 68 గ్యాస్ ఏజెన్సీలకు గానూ, మొత్తం 11.48 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా ఎంత లేదన్నా... జిల్లాలో 6.90 లక్షల వాయుబండల వినియోగిస్తున్నారు. పెరిగిన రూ.50తో జిల్లావాసులపై ప్రతి నెలా రూ.3.45 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ లెక్కన ఏటా రూ.41.40 కోట్ల వడ్డన సామాన్యులకు తప్పదు. ఇప్పటి వరకు రూ.649 ఉన్న సిలిండర్‌పై రాయితీ రూ.40.21 వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. పెరిగిన ధరతో ఎంత జమ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
వినియోగదారుడికి తప్పని మోత
కేంద్ర ప్రభుత్వం ఒక్కో వినియోగదారుడికి ఏడాదికి పన్నెండు చొప్పున రాయితీ వాయుబండలను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో సిలిండర్ రూ.593.50 ఉండగా, సెప్టెంబర్ నాటికి రూ.649కి చేరింది. ప్రస్తుతం పెరిగిన రూ.50తో ఒక్కో వినియోగదారుడు పన్నెండు వాయుబండలు ఉపయోగించినా ఏటా రూ.600 వరకు మోత తప్పడం లేదు.
ఇంతలోనే...
2019 డిసెంబరులో వాయుబండ రూ.753 ధర పలికింది. 2020 జనవరిలో రూ.772కు చేరగా, ఫిబ్రవరి మధ్యలో అమాంతం రూ.918కి చేరింది. ఆ తర్వాత మెల్లగా ధరలు తగ్గిస్తూ వస్తున్న చమురు సంస్థలు మేలో సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఆరు నెలలు తిరగకుండా మళ్లీ ధర పెంచేయడంతో మధ్య తరగతి వినియోగదారులకు భారం కానుంది. రాయితీ ఎంత వచ్చినా, ముందు సిలిండర్ తీసుకోవడానికి పెట్టుబడి పెట్టాలంటే ఇబ్బందేనని గృహ వినియోగదారులు చెబుతున్నారు.