నిరసనలు.. అడ్డగింతలు
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

నిరసనలు.. అడ్డగింతలు


ఆందోళనకారులను అరెస్టు చేస్తున్న అనకాపల్లి పోలీసులు

లక్ష్మీదేవిపేట/కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఆందోళనలకు చేపట్టేందుకు సిద్ధమైన రైతు సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనకాపల్లిలో సీపీఎం కార్యాలయం నుంచి రైతు సంఘ నాయకుడు కోరిబిల్లి శంకరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ, సీపీఐ నాయకుడు వై.ఎన్‌.భద్రం, ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ, వామపక్ష నాయకులంతా ర్యాలీగా రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. పోలీసులు వీరిని అడ్డగించే ప్రయత్నం చేశారు. కొందరు ప్లాట్‌ఫాం పట్టాలపై చేరుకుని నిరసన తెలిపారు. ట్రాక్‌పై వచ్చే రైళ్లను ఆపడానికి యత్నించారు. ఆర్‌పీఎఫ్‌ సీఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. పట్టణ సీఐ భాస్కరరావు ఎస్సై సిబ్బందితో అక్కడకు చేరుకొని వీరిని స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయినిబాబు, కర్రిఅప్పారావు, గంటా శ్రీరామ్‌ పాల్గొన్నారు.

ఎలమంచిలి, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ఎలమంచిలిలో రైల్‌రోకో చేయడానికి ప్రయత్నించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, కార్యదర్శి రొంగలి రాము, జి.దేముడునాయుడు తదితరులను పట్టణ ఎస్సై నీలకంఠరావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో తొమ్మిదిమందిని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. నర్సీపట్నం రోడ్‌ రైల్వేస్టేషన్‌కు బయల్దేరిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.రాజేష్‌లను ఎస్సై శ్రీనివాస్‌, సిబ్బంది అడ్డుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని