మంట పుట్టించిన మన్యం ఘటన
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

మంట పుట్టించిన మన్యం ఘటన


భీమరాజు

చింతపల్లి గ్రామీణం/ నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: నర్సీపట్నం-లంబసింగి రహదారిపై తురబాల గెడ్డకు సమీపంలో గాలిపాడు గ్రామానికి చెందిన గిరిజనులపై నల్గొండ జిల్లా పోలీసులు కాల్పులు జరిపిన ఘటన జిల్లాని ఉలిక్కిపడేలా చేసింది. నవంబరు మొదటి వారం నుంచి మన్యంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేయాలని జిల్లాలో వివిధ శాఖల అధికారులు నిర్ణయించారు. ఈలోగా కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని యోచిస్తున్నారు. సోమవారం గాలిపాడు గ్రామస్థులు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సంబంధం లేని భీమరాజును మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకెళ్లడం వల్లనే వెంబడించి అడ్డుకున్నామని, తాము ఎలాంటి బలప్రయోగం చేయకపోయినా పోలీసులు కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. తామంతా గంజాయి స్మగర్లు అన్నట్టుగా పోలీసులు ప్రకటనలు ఇస్తున్నారని, కత్తులు, గొడ్డళ్లు, రాళ్లు, పదునైన ఆయుధాలతో వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. చింతపల్లి ఏఎస్పీ, సీఐ, అన్నవరం ఎస్సైలకు తెలియకుండా నల్గొండ పోలీసులు గ్రామంలోకి వచ్చారని వివరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని, గాయపడిన వారికి న్యాయం చేయాలని, బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ తామంతా పాడేరులో ఆందోళన చేపట్టి సబ్‌కలెక్టర్‌, ఐటీడీఎ పీఓకి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.

గిరిజనుడిని విడిచిపెట్టిన నల్గొండ పోలీసులు:

గంజాయి కేసుతో సంబంధముందని తెలంగాణలోని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్న అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో భీమరాజును సోమవారం విడిచిపెట్టారు. ఈనెల 15న నల్గొండ పోలీసులు గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో బాలకృష్ణ, పనసలపాడు గ్రామానికి చెందిన నార లోవరాజుతో పాటు కిల్లో భీమరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు తమ అదుపులో ఉంచి విచారించిన అనంతరం ఆయన్ను విడిచిపెట్టారు. అన్నవరం ఎస్సై ప్రశాంత్‌కుమార్‌ భీమరాజును గాలిపాడుకు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మూడు రోజుల పాటు నర్సీపట్నంలోని లాడ్జీలో తనను ఉంచారని భీమరాజు తెలిపారు. గ్రామానికి వచ్చి ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకోవడం, ఆదివారం పోలీసులు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో ఇద్దరు గిరిజనులు గాయాలపాలవడంతో గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. చింతపల్లి ఎంపీపీ వంతల బాబూరావు, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, తెదేపా నాయకుడు చల్లంగి లక్ష్మణరావు సోమవారం గాలిపాడు గ్రామాన్ని సందర్శించారు. సంఘటనపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.

కోలుకుంటున్న గిరిజనులు

విశాఖపట్నం: గాలిపాడుకు చెందిన గిరిజనులు కిల్లో కామరాజు, కిల్లో రాంబాబు కోలుకుంటున్నారు. వారి ఎముకలు విరిగిపోవడంతో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత తదుపరి వైద్యం కోసం కేజీహెచ్‌ ఎముకల వార్డులో చేర్చారు. వీరికి ప్రాణాపాయం లేదని, శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని