Ts News: సాగు రంగానిదే 17 శాతం వాటా
logo
Updated : 16/06/2021 17:44 IST

Ts News: సాగు రంగానిదే 17 శాతం వాటా

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

వరంగల్‌: ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకే రైతు వేదికలు ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని ధర్మసాగర్‌, వేలూరు మండలాల్లో నిర్మించిన రైతు వేదికలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో కలిసి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో ఇప్పటివరకు కేవలం 65 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలకే గోదాములున్నాయని తెలిపారు. పంట దిగుబడితో పోల్చితే ఇది తక్కువని.. అందుకే ఈ ఏడాది మరో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని చెప్పారు. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సగటున 40 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులను మంజూరు చేయనున్నట్లు మంత్రి వివరించారు.

రైతు వేదికలను అన్నదాతలందరూ సద్వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతు వేదికలనే వారి కార్యాలయాలుగా చేసుకుని విధులు నిర్వహించాలని.. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రైతు సమాజాన్ని మరింత క్రియాశీలం చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించినట్లు స్పష్టం చేశారు. రైతు వేదికల ద్వారా శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. పంటల పరిశీలనకు రైతు సందర్శన యాత్రలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో సాగు రంగానిదే 17 శాతం వాటా ఉందని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని