పట్టాలపై పండిన పాపం
eenadu telugu news
Updated : 17/09/2021 13:13 IST

పట్టాలపై పండిన పాపం

కలకలం సృష్టించిన రాజు ఆత్మహత్య
ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, స్టేషన్‌ఘన్‌పూర్‌
ప్రమాదం జరిగిన తీరుపై ఊహ చిత్రం

ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనలో నిందితుడైన పల్లకొండ రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారం రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన రాజు చివరకు రైలు పట్టాలపై శవమై తేలాడు. ఘటనా స్థలాన్ని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి, జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఘన్‌పూర్‌ ఏసీపీ రఘునాథ్‌ వైభవ్‌లు పరిశీలించారు. ఎంజీఎంలో పోస్టుమార్టం అనంతరం వరంగల్‌ శ్మశానవాటికలోనే దహన సంస్కారాలు నిర్వహించారు.

మృతదేహం పట్టాలపైనే ఉండగానే వెళ్తున్న రైలు


ఇలా జరిగింది..

* ఉదయం గూడ్సు రైలు వస్తుండగా పట్టాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజును కీమెన్‌ సారంగం చూసి తప్పుకోవాలని హెచ్చరించడంతో పక్కనున్న చెట్ల పొదల్లో దాక్కున్నాడు.

* కీమెన్‌ పక్కనే పొలాల్లో ఉన్న గేమ్‌సింగ్‌ సోదరులను పిలవడంతో వారు వచ్చారు.

* కీమెన్‌తోపాటు, రైతు సోదరులు వద్దని అంటున్నా రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

* కీమెన్‌ సారంగం రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.

* డయల్‌ 100 ద్వారా పోలీసులకు కాల్‌ వెళ్లడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

* నష్కల్‌ వద్ద పట్టాలపై మృతిచెందింది హత్యాచార నిందితుడు రాజేనని పోలీసులు నిర్ధారించారు.

* పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి, ఏసీపీ రఘునాథ్‌వైభవ్‌, జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు.

* రాజు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

* కుటుంబసభ్యులు గుర్తించిన తర్వాత శవపరీక్షలు పూర్తయ్యాయి.

* పోతన శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఈ పొదల్లోనుంచే రైలు పట్టాల పైకి వచ్చాడు


గోడపత్రిక సమాచారంతో..

కాజీపేట, న్యూస్‌టుడే: నిందితుడు రాజును గుర్తించడానికి గోడపత్రికలు కొంత వరకు మేలు చేశాయి. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ మహేందర్‌రెడ్డి పలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మద్యం దుకాణాల సమీపంలో అతికించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లోనూ ఈ గోడపత్రికలు వెలిశాయి. నష్కల్‌ వద్ద పని చేయడానికి వెళ్లిన కీమెన్లు సారంగపాణి కాజీపేట రైల్వే స్టేషన్లో అంటించిన పోస్టర్లు చూశారు. ఈ నేపథ్యంలో పట్టాల మీద తిరుగుతున్న రాజును గుర్తుపట్టారు. ఈ విషయాన్ని సారంగపాణి స్వయంగా తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీ తరుణ్‌జోషి, తదితరులు


పరిసర ప్రాంతాల సీసీ కెమెరాల పరిశీలన..

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ఈనెల 9న సింగరేణికాలనీలో ఘటన జరిగిన తర్వాత రాజు అక్కడ నుంచి తప్పించుకుంటూ నష్కల్‌ వరకు ఎలా వచ్చేడనేది మిస్టరీగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. హైవేలపై నిఘాను పెంచారు. ఉప్పల్‌ వరకు వచ్చిన రాజు అక్కడ నుంచి ఎటూ వెళ్లాడని పోలీసులకు స్పష్టత లేకపోవడంతో వరంగల్‌ హైవే వైపు దృష్టి పెట్టారు. మరోవైపు వాహనాల చోరీ కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. దీంతో పోలీసుల కదలిక కొంత తెలిసి ఉంటుంది. అందుకే తమకు చిక్కకుండా వారం రోజుల పాటు తిరిగాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.


అంత్యక్రియలు పూర్తి

వరంగల్‌ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రాజు మృతదేహానికి వరంగల్‌లోని శ్మశానవాటికలో గురువారం రాత్రి అంత్యక్రియలు జరిగాయి. వరంగల్‌ మట్టెవాడ పోలీసుల సూచనతో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగం ఉద్యోగులు వరంగల్‌ పోతననగర్‌ శ్మశానవాటికలో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఎంజీఎంలో పోస్టుమార్టం పూర్తవ్వగానే పోలీసుల పహరాతో రాజు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చారు. మృతదేహానికి రాజు తల్లి వీరమ్మ నిప్పంటించారు. ఇద్దరు, ముగ్గురు కుటుంబసభ్యులను మాత్రమే పోలీసులు అనుమతించారు. పోతననగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించే విషయాన్ని పోలీసులు చివరి వరకు గోప్యంగా ఉంచారు.


అంబులెన్స్‌పై చెప్పు విసిరిన వ్యక్తి

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: మార్చురీకి తీసుకొచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అంబులెన్స్‌పై చెప్పు విసిరాడు. పోలీసులు అతన్ని పక్కకు లాగేయడంతో వెళ్లిపోయాడు. స్థానికులు తరలిరావడంతో మార్చురీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీఆర్పీ డీఎస్పీ మల్లారెడ్డి, మట్టెవాడ ఏసీపీ గిరికుమార్‌, సీఐ గణేశ్‌ పర్యవేక్షించారు.


ఎంజీఎంలో ఉత్కంఠ

రోదించిన తల్లి, భార్య పిల్లలు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చూరీకి మధ్యాహ్నం 1.41 గంటలకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు గుర్తించకుండా, పంచనామా చేయకుండా, శవపరీక్ష చేయడం సాధ్యం కాదని వైద్యులు తేల్చిచెప్పారు. కుటంబసభ్యులను రప్పించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని పంపించారు. ముందుగా మృతుడి బావమరుదులు కేదారి సురేశ్‌, మహేశ్‌ వచ్చారు. చేతిపై తెలుగు, ఆంగ్లంలో మౌనిక అని, ఐదు స్టార్‌ గుర్తులతో ఉన్న టాటు ఆధారంగా మృతుడు రాజు అని వారు గుర్తించారు. సాయంత్రం 6.30 గంటలకు పోస్టుమార్టం చేశారు. రాత్రి 7 గంటలకు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు నుంచి మృతుడి తల్లి వీరమ్మ, భార్య మౌనిక, సోదరి వచ్చారు. నేరుగా పోస్టుమార్టం గదిలోకి తీసుకెళ్లారు. మృతదేహాన్ని చూసిన భార్య, తల్లి, కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్వగ్రామానికి తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో రాత్రి 8.30 గంటలకు పోతన శ్మశానవాటికలో అంత్యక్రియలు చేయించారు.

పోలీసుల బందోబస్తు


మాకు చెడ్డ పేరు తెచ్చాడు

- పి.కృష్ణ, (రాజు బాబాయి), కొడకండ్ల, జనగామ జిల్లా

హైదరాబాద్‌లో చిన్నారిని హత్య చేసిన రాజు మా అన్న కొడుకేనని తెలిసినప్పటి నుంచి మాది తలెత్తుకోలేని పరిస్థితి. మా కుటుంబాలకు సంబంధాలు తెగిపోయి ఇరవై ఐదేళ్లు. మాకు సంబంధం లేకున్నా చెడ్డ పేరు తెచ్చాడు. మా నాన్న చిన్నతనంలోనే మృతి చెందగా అన్న వెంకన్న, తల్లి రామక్కతో కలిసి కొడకండ్లలో కూలీ పనులు చేస్తూ జీవించే వాళ్లం. 25 ఏళ్ల క్రితం వెంకన్న (రాజు తండ్రి) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు చెందిన వీరమ్మను వివాహం చేసుకొని.. మూడు నెలలకే మాతో గొడవ పడి వెళ్లిపోయాడు. నాటి నుంచి మా అన్న కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. చివరకు మా అన్న పదిహేనేళ్ల కిందట చనిపోయిన విషయం.. ఆయనకు ఒక బిడ్డ, కొడుకు ఉన్నారని ఆలస్యంగా బంధువులతో తెలిసింది. ఈ ఘటన తర్వాత టీవీల్లో, పత్రికల్లో వాడి ఫొటో చూశా. నాలుగు రోజులుగా పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ప్రశ్నించారు.

- న్యూస్‌టుడే, కొడకండ్ల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని