close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

అనధికార ఆసుపత్రులు..!

 నగరంలో పీసీబీ అనుమతులు లేనివి వందల్లో...
 హెచ్చరించినా ముందుకు రాని నిర్వాహకులు
 రోగులు ఇబ్బంది పడతారంటూ వదిలేస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: చిన్న అనారోగ్య సమస్యతో అడుగు పెడితే చాలు.. రకరకాల పరీక్షలంటూ జేబుల్ని గుల్ల చేసే ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) అనుమతి తీసుకోమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. నోటీసులను బేఖాతరు చేస్తున్నారు. సాక్షాత్తూ ఉన్నతాధికారులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందలాది ఆసుపత్రులు నగరంలో కొనసాగుతుండడంపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కొరఢా ఝుళిపించాల్సిన టీఎస్‌పీసీబీ అధికారులు అప్పుడప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత అటువైపు చూడటం లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు.

నిబంధనలేం చెబుతున్నాయ్‌..!
50.. అంతకంటే మించి పడకలున్న ఆసుపత్రులు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీఎఫ్‌ఈ), కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌(సీఎఫ్‌వో) తదితర అనుమతులు తీసుకోవాలి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించడంతో పాటు ప్రాజెక్టు వ్యయాన్ని బట్టి తగిన రుసుము కూడా చెల్లించాలి. ఆసుపత్రి పనులను ప్రారంభించే ముందు సీఎఫ్‌ఈ తీసుకోవాలి. పూర్తయిన తర్వాత సీఎఫ్‌వోను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మురుగు శుద్ధి కేంద్రం పక్కాగా ఉండాలి. నిబంధనల ప్రకారం జీవ వ్యర్థాలను వేరు చేసి సంబంధిత రంగు సంచిలో వేసి నిర్వీర్య కేంద్రాల నిర్వాహకులకు అందజేయాలి.

25 నుంచి 30 శాతమే..!
చిన్నా, చితకా ఆసుపత్రులు, డెంటల్‌ క్లినిక్‌లు తదితరాలు వెయ్యి వరకు ఉంటాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. 25 నుంచి 30 శాతం ఆసుపత్రులకు మాత్రమే సీఎఫ్‌ఈ, సీఎఫ్‌వో ఉన్నట్లుగా వివరిస్తున్నారు. కొందరు నిర్వాహకులు కాస్త తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఇతర శాఖల నుంచి అనుమతి లభించేందుకు గాను టీఎస్‌పీసీబీ నుంచి సీఎఫ్‌ఈ తీసుకుంటున్నారు. ఆ తర్వాత సీఎఫ్‌వో తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మరికొందరైతే ఎవరేం చేస్తారులే అంటూ అనుమతులు తీసుకోకుండానే నడిపించేస్తున్నారు. ఇంకొందరేమో సీఎఫ్‌వోను తీసుకుని ఆ తర్వాత పునరుద్ధరించుకోవడం లేదు. ఎస్టీపీలు ఉన్న ఆసుపత్రుల సంఖ్య 5 శాతం కూడా లేదు. జీవ వ్యర్థాల నిర్వహణ గాడి తప్పింది. ఒక్కొక్క వంద పడకల ఆసుపత్రి నుంచి ప్రతి రోజు కనీసం 20వేల లీటర్ల మురుగు పక్కనే ఉన్న నాలాలో కలుస్తోంది. ఒక్కో పడకకు 400 గ్రాముల చొప్పున వెలువడే జీవ వ్యర్థాలను మున్సిపల్‌ చెత్తలో కలిపేసి మమ అనిపించేస్తున్నారు.

ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ..!
శస్త్ర చిక్సితలు, ఇతర పనుల నిమిత్తం వినియోగించిన నీటిని ఎస్టీపీ కేంద్రంలో శుద్ధి చేసిన తర్వాతే మురుగు కాల్వల్లోకి వదలాలి. ఎస్టీపీ నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వాడి పారేసిన సిరంజిలు, దూది, శరీర భాగాలు, శస్త్ర చికిత్సలో వినియోగించిన పరికరాలు తదితర జీవ వ్యర్థాలను 48 గంటల్లోపు తరలించకపోతే ప్రమాదకర వైరస్‌లు గాల్లోకి చేరే ప్రమాదముంది. ఈ వ్యర్థాలను సేకరించినందుకు గాను ఒక్కో పడకకు ఒక్కో రోజుకి రూ.3 నుంచి రూ.5 వరకు నిర్వీర్య కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఎప్పటికప్పుడు పీసీబీకి అందుతాయి. అప్పుడప్పుడు తనిఖీలు కూడా ఉంటాయి. ఇదంతా ఎందుకొచ్చిన వ్యవహారం.. అసలు అనుమతులు తీసుకోకపోతే ఈ నిబంధనల్ని పాటించాల్సిన అవసరమే ఉండదు కదా అని నిర్వాహకులు వెనుకడుగేస్తున్నారు.

అప్పుడప్పుడు హడావుడి.. నోటీసులు..!
చాలా కాలం కిందట నగరంలోని వంద కంటే ఎక్కువ పడకలు ఉన్న 50 ప్రైవేట్‌ ఆసుపత్రులను పీసీబీ అధికారులు తనిఖీ చేశారు. పదిహేను మినహా మిగిలినవి నిబంధనలను పాటించడం లేదని గుర్తించారు. లక్డీకాపూల్‌, కేపీహెచ్‌బీ, ఆల్విన్‌ కాలనీ, ఎల్బీనగర్‌, పీర్జాదిగూడ, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, పేట్‌ బషీరాబాద్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లి, గాజుల రామారం, డా.ఏఎస్‌రావు నగర్‌, ఈసీఐఎల్‌ తదితర ప్రాంతాల్లోని పలు 100 పడకల ప్రైవేట్‌ ఆసుపత్రులు అనుమతులు లేకుండానే కొనసాగుతున్నట్లుగా తేలింది. ఉప్పల్‌, రామాంతపూర్‌, కొత్తపేట్‌, కింగ్‌ కోఠి, చిరాగ్‌ అలీ లేన్‌, మియాపూర్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఎస్టీపీ లేదని గుర్తించారు. నోటీసుల పేరిట హడావుడి చేసి వదిలేశారు. ఆ తర్వాత 15 రోజుల్లోపు సీఎఫ్‌వో తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ మరోసారి హెచ్చరించారు. నిర్వాహకులు స్పందించలేదు. తమను లోపలికి కూడా రానివ్వడం లేదని, రోగులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే చర్యలు తీసుకోవడం లేదంటూ టీఎస్‌పీసీబీ అధికారులు చెబుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.