close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

స్వేచ్ఛా వాయువులు అందిస్తున్నది పోలీసులే: కలెక్టర్‌

అమరవీరులకు నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు


అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న సిబ్బంది

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: దేశంలో పోలీసు వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నందునే ప్రజలు స్వేచ్ఛా వాయువులు అందుకుంటున్నారని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. సోమవారం ఖమ్మం పోలీసు పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. పండుగలు, పర్వదినాలు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ఇంకా ఎక్కువగా పనిచేస్తోందని, ప్రజలు సంతోషమే వారి సంతోషంగా భావించి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారి వల్లనే సమాజంలో అందరూ ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, ఇలా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను అందరూ స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉంటున్న పోలీసులు తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ద వహించాలన్నారు.


పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌,
ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్‌, ఇతర పోలీసు అధికారులు

మేం భరోసా ఇస్తున్నాం: సీపీ

తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి విచ్ఛిన్నకర నేరాలకు పాల్పడేవారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఖమ్మం కమిషనరేట్‌ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. అసాంఘిక శక్తులను తుదముట్టించే క్రమంలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా పోలీస్‌శాఖ విధుల్లో పునరంకితం కావాలన్నారు. ఆధునిక భద్రతా ప్రమాణాలను అందిపుచ్చుకుంటూనే, ఫ్రెండ్లీ పోలీసింగ్‌, 17 కర్టికల్‌ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పోలీసులు చొచ్చుకొని వెళ్లేలా చేశామన్నారు. జిల్లా పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు, స్పందిస్తున్న తీరును ఉన్నతాధికారులు అభినందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందివచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతో పోలీసుశాఖ మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సీపీ ఆకాంక్షించారు. అనంతరం పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్రా వెంకటవీరయ్య, రాములునాయక్‌, అదనపు డీసీపీలు మురళీధర్‌, పూజ, మాధవరావు, ఏసీపీలు విజయ్‌బాబు, జి.వెంకట్రావు, సత్యనారాయణ, రామోజీ రమేశ్‌, వెంకటేశ్‌, నామానుజం, సదానిరంజన్‌, జహంగీర్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసుల త్యాగాలు మరువలేనివి: మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: పోలీసుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణే పరమావధిగా పనిచేస్తూ ప్రాణాలర్పించిన యోధలకు ఘన నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.