close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

అభినయం.. విజ్ఞానం

పలు సమస్యలపై చైతన్యాన్ని నింపిన నాటకాలు
అబ్బురపర్చిన చిన్నారుల సృజన
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

రగతి గదుల్లో చదువులకే పరిమితమవుతున్న విద్యార్థులు నటనలో అబ్బుర ప్రతిభ కనబర్చారు. పలు సామాజిక   సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలను రూపొందించి అభినయంతో నిరూపించారు. జిల్లా విద్యాశాఖ  ఆధ్వర్యంలో కరీంనగర్‌లో సోమవారం జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సౌతిండియా డ్రామా ఫెస్టివల్‌ పోటీల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు పలు అంశాలపై ప్రదర్శించిన నాటికలు పలు సమస్యలపై అందరినీ
చైతన్యవంతం చేశాయి..

పరిసరాల పరిశుభ్రతపై చైతన్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం పరిసరాల పరిశుభ్రతపై ప్రదర్శించిన డ్రామా అందరిలో చైతన్యం నింపేలా నిల్చింది. గ్రామాల్లోని నిరక్షరాస్యులు పరిసరాలను అపరిశుభ్రంగా నిలపడంతో ఎదుర్కొనే పలు రకాల అనారోగ్య సమస్యలు, పరిశుభ్రతతో జరిగే మేలు వంటి వాటిని విద్యార్థులు పలు పాత్రలను వేసి తమ నటనా కౌశలంతో అందరినీ ఆలోచింపజేశారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల ఎదురయ్యే అనర్థాలు ఎలా ఉంటాయో ప్రదర్శనలో ఒక అంశంగా చూపించారు. ఇంగ్లిష్‌ టీచర్‌ తిరుపతి ఆధ్వర్యంలో అయిదారు రోజులు నాటికను ప్రాక్టీసు చేసినట్లు 8వ తరగతి విద్యార్థి వై.శృతి పేర్కొంది. నిరక్షరాస్యత, భూత వైద్యాన్ని నమ్మే తల్లిగా తాను ఇందులో పాత్ర వేసినట్లు చెప్పారు.

జీవిత విలువలను నేర్పిన డ్రామా..
పెద్దపల్లి జిల్లాలోని గట్టెపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రదర్శించిన జీవిత విలువలు డ్రామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. సహజసిద్ధంగా పెరుగుతున్న వన సంపదను కొట్టి వేయడం ద్వారా నేడు ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల ఇక్కట్లను నాటికలో విద్యార్థులు పలు పాత్రల్లో కళ్లముందు ఆవిష్కరింపజేశారు. చెట్లను కొట్టివేయడంతో ఎదుర్కొంటున్న అనర్థాలను వివరిస్తూనే వాటిని కాపాడటం ద్వారా జరిగే మేలును ఈ నాటికలో ప్రధానంగా వివరించిన తీరు ఆకట్టుకుంది. పరిసరాలు అపరిశుభ్రతతో ఎదుర్కొనే ఇక్కట్లు, ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ప్రదర్శిస్తూనే మధ్య మధ్యలో వివిధ పాత్రల్లోని విద్యార్థులు కామెడీతో అందరినీ నవ్వించారు. తెలుగు ఉపాధ్యాయుడు రాజమల్లు అందించిన ఈ నాటకాన్ని విద్యార్థులు వారం పాటు ప్రాక్టీసు చేశారు. నాటకాల్లో నటించడం ఇదే తొలిసారి అని, చదువుతున్న విషయాలను వివిధ పాత్రల్లో నటించి చూపించడం కొంత కష్టమే అయినా, తాము చేసి చూపించామని పదో తరగతి విద్యార్థి అభినయ్‌వర్మ చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోజనం
కరీంనగర్‌ శివారులోని పద్మనగర్‌లోని మానేరు పాఠశాల విద్యార్థుల బృందం గ్రీన్‌ విజన్‌ పేరుతో ప్రదర్శించిన డ్రామా అందరినీ ఆలోచింపజేసింది. ఉపాధ్యాయులు రామాంజన్‌రెడ్డి, జహెరా, రీఠాల నేతృత్వంలో వారం రోజులు నాటిక ప్రదర్శనను విద్యార్థులు ప్రాక్టీస్‌ చేశారు. 1970 నుంచి 2018 వరకు విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానం, అపరిజ్ఞానంతో ప్రకృతికి జరుగుతున్న నష్టాన్ని విద్యార్థులు పలు పాత్రల్లో నటించి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకుంటున్నా దానివల్ల సహజ సిద్ధమైన ప్రకృతి, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ప్లాస్టిక్‌ వాడకం, అడవుల నరికివేత, పర్యావరణ, నీటి కాలుష్యం వంటి సమస్యలు, వాటికి పరిష్కారాన్ని చూపించే మార్గాలను ప్రదర్శించారు. పాఠ్యాంశాల్లోని అంశాల ఆధారంగా ఈ నాటకాన్ని వేసి, ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న ఈ సమస్యలను పరిష్కారాన్ని చూపించాలని దీన్ని ప్రదర్శించినట్లు 9వ తరగతి చదువుతున్న అభినయ శ్రీ పేర్కొంది.

ఆరోగ్యంపై ఆకట్టుకున్న డ్రామా
జగిత్యాల జిల్లా తాటిపెల్లిలోని టీఎస్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థుల బృందం పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రదర్శించిన నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ధన్‌రాజ్‌ వద్ద నటనలో శిక్షణ పొందినవారు పాత్రల్లో లీనమై నటనతో మెప్పించారు. ప్లాస్టిక్‌ అవగాహన లేని గ్రామాల్లోని నిరక్షరాస్యుల నిర్లక్ష్యం, అపరిశుభ్రతతో వచ్చే వ్యాధులపై అవగాహన లేమితో ఎదుర్కొంటున్న ప్రాణ నష్టాలను వివరిస్తూనే వీటిని అధిగమించే పరిష్కార మార్గాలను నాటికలో చూపించారు. ప్లాస్టిక్‌ వినియోగం ద్వారా ప్రాణనష్టం జరిగాక ఒక తల్లి ఈ విషయంలో కళ్లుతెరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తమదాక వచ్చే వరకు ఏ విషయాన్ని ప్రజలు పట్టించుకోరనే విషయాలను వివిధ పాత్రల రూపంలో వివరిస్తూనే ఇల్లు బాగుంటే.. అందరి ఇల్లు బాగుంటాయి.. మన గ్రామం బాగుంటే అన్ని గ్రామాలు బాగుంటాయనే సందేశాన్నిస్తూ నాటికను ముగించారు. ప్రయోగాల ద్వారానే కాదు సామాన్యులను ఆకట్టుకునే నాటకాల రూపంలో ఇలాంటివి ప్రదర్శిస్తే అందరూ బాగుపడుతారని 10వ తరగతి విద్యార్థి రోషిణి చెప్పారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.