close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్వహణ లేక కొరవడిన ‘నిఘా’..!

గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలు

పెరుగుతున్న చోరీలు..

లోకేశ్వరం, నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

* జిల్లాలోని మండలాలు : 19

* మొత్తం గ్రామాలు : 396

* సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గ్రామాలు : దాదాపు 200కి పైగా

* కమ్యూనిటీ పోలీసింగ్‌ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు : 1294

* నేను సైతంలో భాగంగా ఏర్పాటు చేసిన కెమెరాలు : 1518

* లోకేశ్వరం గ్రామానికి చెందిన సుమంత అనే మహిళ ఇంట్లో దాదాపు ఎనిమిది నెలల కిందట దొంగతనం జరిగింది. దుండగులు ఇంట్లోంచి 5.6 తులాల బంగారం, మరికొన్ని వస్తువులను అపహరించుకొని పోయారు. అయిదు నెలల కిందట మళ్లీ అదే గ్రామంలో పెద్ద చిన్నయ్య ఇంట్లో మరొక చోరీ జరిగింది. కొద్ది మొత్తంలో నగదు, బంగారం అపహరణకు గురైంది. తాజాగా మండలంలోని గడ్‌చాందా గ్రామంలోని ప్రవీణ్‌రావు ఇంట్లో దొంగలు పడి, ఇంట్లోని 5.6 తులాల బంగారంతో పాటు రూ.5 వేలు నగదు దోచుకెళ్లారు.

ఈ ఘటనల్లో దొంగతనం జరిగిన గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినా నిందితులెవరు.? ఎంతమంది వచ్చారనే.. వివరాలపై కనీస స్పష్టత లేదు. కారణం.. అక్కడి కెమెరాలు నిర్వహణ లేక పనిచేయకపోవడమే. స్థానికంగా నిఘా, భద్రత కోసం ఏర్పాటుచేసిన కెమెరాలు పనిచేయకపోవడంతో ఎలాంటి వివరాలు నమోదు కాలేదు. ఒకవేళ కెమెరాలు సక్రమంగా పనిచేసుంటే నిందితుల గుర్తింపు విషయంలో, పోలీసుల దర్యాప్తులోనూ ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఇది కేవలం ఈ ఒక్క మండల సమస్యే కాదు. జిల్లావ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి.


రాజురాలో 16 కెమెరాలకు రెండు మాత్రమే పనిచేస్తున్న దృశ్యం

గ్రామాల్లోనూ నిఘా పెంచాలని..

పట్టణ ప్రాంతాల్లో అధికంగా వినియోగిస్తున్న సీసీ కెమెరాలను జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న లక్ష్యంతో పోలీసులు చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయి. జిల్లాలోనే మొదటగా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్‌లో మూడేళ్ల కిందట అప్పటి ఐజీ నాగిరెడ్డి చేతులమీదుగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేయించారు పోలీసులు. అబ్దుల్లాపూర్‌ను జిల్లాలోని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకుని నిఘా కెమెరాలు ఏర్పాటు చేయించుకోవాలని సూచించారు. స్పందించిన లోకేశ్వరం, మన్మద్‌, రాజురా, కిష్టాపూర్‌, హవర్గా, రాయపూర్‌కాండ్లి, బాగాపూర్‌ గ్రామాల సర్పంచులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇతర మండలాలలోనూ ఇదే స్ఫూర్తితో మొత్తం 2,812 నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకొన్నారు.

‘నేను సైతం’ పేరిట..

నిఘా కెమెరాలను పల్లెల్లోనూ ఏర్పాటు చేయిస్తే నేరాల శాతం తగ్గిపోతుందని భావించిన పోలీసు యంత్రాంగం ‘నేను సైతం’ అనే కార్యక్రమాన్ని కొనసాగించింది. ఒక సీసీ కెమెరా 100 మందితో సమానమని, నిందితులను గుర్తించడం సులభం అవుతుందంటూ గ్రామాల్లో చైతన్య సదస్సులు నిర్వహించారు. ఈమేరకు పలువురు దాతల సహకారం, విరాళాల సేకరణ రూపంలో తమతమ ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయించుకున్నారు. అయితే ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తర్వాత లేకపోవడంతో పరిస్థితి మళ్లీ సమస్య మొదటికొచ్చింది.


లోకేశ్వరంలో స్తంభానికి నిరుపయోగంగా ఉన్న నిఘా కెమెరా

పనితీరుతోనే సత్ఫలితాలు..

కొన్ని నెలల కిందట దిలావర్‌పూర్‌ మండల పరిధిలో ఓ గుర్తు తెలియని వాహనం పాదచారులను ఢీకొట్టి పారిపోయిన ఘటనలో సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగానే పోలీసులు కేసును ఛేదించి నిందితులను గుర్తించగలిగారు. లక్ష్మణచాంద మండలానికి చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్‌ కొద్దిరోజుల కిందట అపహరణకు గురైంది. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నిందితులు అపహరణ చేసినట్లు గుర్తించారు. బాధితుడికి వాహనం అప్పగించగలిగారు. ఇలా పలు కేసుల్లో కెమెరాల పనితీరే దర్యాప్తులో కీలకంగా మారుతోంది. వాటి పనితీరు బాగుంటే సత్ఫలితాలు వస్తున్నాయి. పనిచేయకపోతే విచారణలో జాప్యం జరుగుతోంది.

చాలాచోట్ల నిరుపయోగం..

జిల్లాలో పోలీసు శాఖ ఉత్సాహంగా ఏర్పాటు చేయించిన నిఘా కెమెరాలు నిర్వహణ లోపం, పర్యవేక్షణ కొరవడటంతో ప్రస్తుతం చాలావరకు నిరుపయోగమయ్యాయి. ఏర్పాటుచేసి ఏడాది గడవకముందే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్‌లో... ఏర్పాటుచేసిన 12 కెమెరాలకు గాను ఒక్కటీ పనిచేయడం లేదు. రాజురాలో.. 16 కెమెరాలకు గాను 4, లోకేశ్వరంలో 12 కెమెరాల్లో 4 చెడిపోయాయి. మిగతా గ్రామాల్లోనూ ఎక్కడా నిఘా కెమెరాలు పనిచేయడం లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.