close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

ఆన్‌లైన్‌లో అర్జీలు!

కసరత్తు చేస్తున్న జేఎన్‌టీయూ
ప్రతి అర్జీకి ప్రత్యేక ట్రాకింగ్‌ నంబరు
జవాబుదారీతనం పెంచే దిశగా చర్యలు
ఈనాడు, హైదరాబాద్‌

ఏదైనా సమస్యకు సంబంధించి అర్జీ సమర్పిస్తే.. పరిష్కారమైందో.. లేదో తెలియక దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతుంటారు. వెంటనే పరిష్కారం కావాల్సిన సమస్యలైతే ఎప్పటికప్పుడు అనుశీలన చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీలకు ప్రత్యేక రశీదు ఇస్తారు. విశ్వవిద్యాలయాల్లో ఈ తరహా వ్యవస్థ ఉండదు. ఈ సమస్యలకు చెక్‌పెడుతూ జేఎన్‌టీయూ వినూత్న కార్యాచరణకు సిద్ధమైంది. వర్సిటీ పరీక్షల విభాగానికి వచ్చే అర్జీలను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించింది. ‘‘విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల ఇబ్బందులు పరిష్కరించే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ గ్రీవెన్సెస్‌ వ్యవస్థను తీసుకువస్తున్నాం. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. విద్యార్థులకు తమ అర్జీల గురించి తెలుసుకునే వీలు ఏర్పడుతుంది.’’ అని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొ.ఎన్‌.యాదయ్య ‘ఈనాడు’కు వివరించారు.  జేఎన్‌టీయూ పరిధిలో 240 అనుబంధ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో విద్యార్థులు, కళాశాల అధ్యాపకుల నుంచి జేఎన్‌టీయూ పరీక్షల విభాగానికి ఏటా 10 వేల వరకు దరఖాస్తులు వస్తుంటాయి. ఇవన్నీ నేరుగా ఆయా కళాశాల ప్రిన్సిపల్స్‌ నుంచి వర్సిటీకి చేరుతుంటాయి. కళాశాలల నుంచి ప్రిన్సిపల్స్‌ మార్కులు అప్‌లోడ్‌ చేయడంలో తప్పు చేయడం, గ్రేస్‌ మార్కుల్లో తేడాలు దొర్లడం, తత్కాల్‌ దరఖాస్తులు.. ఇలా వివిధ సందర్భాల్లో తప్పు జరిగిందని విద్యార్థుల తరఫున ప్రిన్సిపల్స్‌ లేఖలు రాసేవారు. ఇవి పోస్టు ద్వారా, లేదా వ్యక్తిగతంగా ఆయా అర్జీలను తీసుకువచ్చి సమర్పించేవారు. ఆ తర్వాత దరఖాస్తులు పురోగతి తెలిసేది కాదు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తాము పెట్టుకున్న అర్జీలు పరిష్కారమయ్యాయో.. లేదో తెలియక అయోమయానికి గురయ్యేవారు.

ఇదీ ప్రక్రియ
సాంకేతికతను వినియోగించుకుని ఆన్‌లైన్‌లో అర్జీలు స్వీకరించాలని జేఎన్‌టీయూ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఇకపై అనుబంధ కళాశాలలకు సంబంధించి విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌.. తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా అర్జీ రాయడంతోపాటు దానికి సంబంధించి అవసరమైన ధ్రువీకరణపత్రాలను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇందుకు వర్సిటీ తరఫున త్వరలో ప్రత్యేక లింక్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. అలా అప్‌లోడ్‌ చేయడం ద్వారా ప్రత్యేకంగా ట్రాకింగ్‌ నంబరు వస్తుంది. దరఖాస్తుదారులు ఆ నంబరు దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్‌లైన్‌లో ట్రాకింగ్‌ నంబరు కొడితే దరఖాస్తు ఏ స్థాయిలో ఉంది..? ఎక్కడ పెండింగ్‌ ఉంది..? తిరస్కారానికి గురైందా.. లేదా పరిష్కారం జరిగిందా.. ఇలా అన్ని వివరాలు తెలుసుకునే వీలు చిక్కుతుంది. ఆన్‌లైన్‌ గ్రీవెన్సెస్‌ పరిష్కార వ్యవస్థను జనవరి రెండో వారంలో ప్రారంభించేందుకు జేఎన్‌టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగిత రహితంగా..
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కారణంగా జవాబుదారీతనంతోపాటు కాగితాలు రక్షించే వీలుంటుంది. ఆన్‌లైన్‌ వ్యవస్థతో ఎక్కువగా కాగితాలతో పని ఉండదని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే కాగిత రహిత పాలన దిశగా అన్ని చోట్ల అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయ స్థాయిలో పూర్తిస్థాయిలో కాగిత రహిత పాలన సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ వీలున్నచోట కాగితాలు వాడకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కసరత్తు చేస్తున్నాం: వి.కామాక్షిప్రసాద్‌, పరీక్షల నియంత్రణాధికారి, జేఎన్‌టీయూ
ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించి ట్రాకింగ్‌ చేసే వ్యవస్థపై కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కళాశాలల నుంచి వచ్చిన అర్జీలు ఎక్కడ ఉన్నాయో.. తెలుసుకునేందుకు వీలుపడుతుంది. దీనివల్ల తమ దరఖాస్తులు పరిష్కారం కాలేదని అర్జీదారులు నేరుగా వర్సిటీకి రాకుండా వీలవుతుంది

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.