close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాతృభాషలో గిరిజన విద్య

ఆదివాసీ విద్యార్థుల్లో డ్రాపవుట్లు తగ్గించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు

త్వరలో విద్యాలయాలకు చేరనున్న పుస్తకాలు

భద్రాచలం, న్యూస్‌టుడే

కోయవాచకం ముఖ చిత్రం

మన్యంలో బడిలో చేరిన విద్యార్థి మధ్యలో మానేయకుండా ఉంటేనే నాణ్యమైన బోధన అందుకొనేందుకు వీలుంటుంది. అప్పుడే గిరిజన కూనలకు సరస్వతీ కటాక్షం అందుతుంది. మిగతా ప్రాంతంతో పోల్చితే అడవి బిడ్డలు నివాసం ఉండే చోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివాసీ విద్యార్థుల్లో డ్రాపవుట్లు తగ్గించేందుకు మాతృభాషలోనే వారికి ప్రాథమిక విద్య అందేలా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రణాళిక అవసరం

మైదాన ప్రాంతంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రాథమిక నుంచి హైస్కూల్‌ స్థాయి వరకు వందల సంఖ్యలో బడి మానేస్తున్నట్లు గతంలో చేసిన సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. రెండేళ్ల కిందట 1400 మంది డ్రాపవుట్లు ఉన్నట్లు ఒక విభాగం చెప్పగా ఈ సంఖ్య అంతకుమించే ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. గతేడాది కొన్ని గిరిజన విద్యాలయాలను సర్దుబాటు చేయడంతో విద్యాసంవత్సరం మధ్యలోనే అప్పటివరకు చదివిన పాఠశాల నుంచి మరో పాఠశాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మానేసిన వారిని గుర్తించి తిరిగి బడి బాటపట్టించడానికి ఉపాధ్యాయులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా కొన్ని చోట్ల మౌలిక సదుపాయాలు లేవు. ఇంకొన్ని చోట్ల అన్ని వసతులు ఉన్నప్పటికీ చాలినంత మంది విద్యార్థులు చేరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్దుబాటు విషయంలో ఈసారి ఇలాంటి చిక్కులు రాకుండా చూడాల్సి ఉంది.

మాతృభాష ఉంటే బడి మానేయరని..!

మన్యంలోని 219 గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో 4,782 మంది చదువుతుండగా ఇందులో బాలికలు 2,395 మంది బాలురు 2,387 మంది ఉన్నారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి కొన్ని చోట్ల ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నారు. అయితే డ్రాపవుట్లు తగ్గించేందుకు మాతృభాషలో బోధిస్తేనే ఫలితం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా గిరిజన విద్యార్థులను చిన్నప్పటి నుంచే చైతన్యం చేస్తున్నారు. ఇందుకోసం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కోయభాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఈ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. బంజారా భాషను కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు. ఈ భాషలకు సంబంధించి 1, 2 తరగతులకు కలిపి సుమారు 3 వేల పుస్తకాలను అందించాలనుకుంటున్నారు. మిగతా జిల్లాల్లో ఉన్న కొలామి, గోండులకూ ఆయా భాషల పుస్తకాలను అందిస్తున్నారు.

నిరంతరం పర్యవేక్షణ ఉండాలి

పునాది బాగుండాలనే ఉద్దేశంతో గతంలో ప్రాథమిక స్థాయిలోనే పునాది పుస్తకాలను తయారు చేసి బోధన చేశారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఈసారి పునాది-2 పుస్తకాలను 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఇవ్వనున్నారు. ప్రైవేటుకు దీటుగా ఇందులో అంశాలను పొందుపర్చారు. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోయినా చదువుకు ఆటంకం కలగకుండా హైస్కూల్‌ విద్యార్థులకు వర్క్‌ పుస్తకాల రూపకల్పన చేపట్టారు. తద్వారా ఆదివాసీ విద్యార్థులకు బడి మానేసే ఆలోచన రాదని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో విద్యా సంవత్సరాన్ని ఆరంభించే వీలున్నప్పటికీ ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కొవిడ్‌ తరుణంలో విద్యార్థులు బెంబేలెత్తకుండా చూడగలిగితేనే డ్రాపవుట్లు లేకుండా చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్‌ సూచనలను పాటిస్తూ మన్యం విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీటీడీవో జహీరుద్దీన్‌ తెలిపారు. డ్రాపవుట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అకడమిక్‌ కమ్యూనిటీ మొబలైజింగ్‌ అధికారి రమణయ్య వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.