close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దసరా అయ్యాకే.. ధాన్యం సేకరణలో వేగం

నల్గొండ జిల్లాలో లాంఛనంగా ప్రారంభం

అయినా ఎక్కడా మొదలు కాని కొనుగోళ్లు

వరుస వర్షాల వల్ల ఆలస్యం

ఈనాడు డిజిటల్‌, నల్గొండ, నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

కట్టంగూరు ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాసులు

ధాన్యం సేకరణ ప్రారంభించాలని ఆదేశాలు వెలువడినా, నిత్యం కురుస్తున్న వర్షాలతో కొనుగోళ్లకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా విభాజ్య నల్గొండ జిల్లాలోని కనగల్‌ మండలంలో సోమవారం ఆరు చోట్ల, మంగళవారం ఐదు ఐకేపీల్లో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కానీ కొనుగోళ్లు ఇంకా మొదలుపెట్టలేదు. కాంటాలు వేస్తామని ప్రకటించినా, తరచూ కురుస్తున్న జల్లులతో ఇబ్బందులు తలెత్తుతాయన్న యోచనలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనాలని ఈ నెల 12న నిర్వహించిన మూడు జిల్లాల సమీక్షలో మంత్రి స్పష్టం చేయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఐకేపీ, పీఏసీఎస్‌ లకు వస్తున్న సరకు క్రమంగా పెరుగుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో పెద్దఎత్తున ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే రాసులు పోసిన కర్షకులు నెల రోజులుగా అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. తమకున్న భూమిలో సగం కోసి ధాన్యం తెస్తుండగా, కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాగానే మిగతా పంటను తేవాలన్న ఉద్దేశంతో ఉన్నారు.

మూడు జిల్లాల్లోనూ అదే తీరు

మొన్నటి యాసంగిలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 13.82 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే కాంటాలు వేయాల్సి ఉన్నా, మూడు జిల్లాల్లోనూ ఆలస్యంగా మొదలవబోతున్నాయి. మంత్రి సమీక్ష తర్వాత ఆయా జిలాల్లో కలెక్టర్లు సైతం సమావేశాలు నిర్వహించారు. కొనుగోళ్లు ప్రారంభించాలని భావించినా, పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన ఓపీఎంఎస్‌(ఆన్లైన్‌ ప్రొక్యూర్‌ మెంట్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌) ఆలస్యమైంది. ఈ నెల 12న మంత్రి సమీక్ష నిర్వహిస్తే, 18 నాడు సాయంత్రం ఓపీఎంఎస్‌ జిల్లాలకు చేరింది. ఇక్కడే వారం రోజులు వృథా అయినట్లయింది. ఓపీఎంఎస్‌ వచ్చిన తర్వాతే కొనుగోలు కేంద్రాలు, మిల్లులకు ట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే కొనుగోళ్లు జరుగుతాయి. ఓపీఎంఎస్‌ ఆలస్యంగా రావడం కూడా కొనుగోళ్లు నిలిచిపోవడానికి కారణమైంది. ఈ సీజన్‌లో నల్గొండ జిల్లాలోనే 1,97,148 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను 3,92,602 ఎకరాల్లో వరి వేశారు. దీనికి సన్న రకాలు అదనం. మొత్తంగా 10,20,765 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులుంటాయని, అందులో 4,59,344 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. మరో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం రానుంది. అందుకు అనుగుణంగా 173 ఐకేపీ, 102 పీఏసీఎస్‌, 12 మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 287 కేంద్రాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 కేంద్రాలు తెరుస్తుండగా, వాటిలోకి 14,90,286 మెట్రిక్‌ టన్నులు వస్తుందని భావించారు.

తేమ శాతానికి ప్రతిబంధకాలు

కొనుగోలు కేంద్రాల్లోకి తెచ్చిన ధాన్యం కొనాలంటే ముందుగా తేమ శాతం పరీక్షించాలి. 17 శాతం తేమ ఉంటేనే నాణ్యమైనదిగా పరిగణించి మద్దతు ధర 1888 చెల్లిస్తారు. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ఎక్కడా ఈ స్థాయిలో తేమ శాతం వచ్చే వీలు లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాసులు తడిసిముద్దయ్యాయి. నెల రోజుల క్రితం రైతు పంటను తెస్తే ఇప్పటివరకు ఐదారు సార్లు వాన పడి, ధాన్యం నానింది. అది ఆరబెట్టుకుందామంటే ఎండ లేకపాయే. అదే ధాన్యాన్ని నేర్పడం, గాలికి ఆరబెట్టడం వంటివి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంటాలు వేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంటాలు వేశాక హడావుడి ప్రారంభమైన తరుణంలో, హఠాత్తుగా వర్షం పడితే కుప్పలన్నీ పనికిరాకుండా పోతాయన్న భావనతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ●

పండగ తర్వాతే కొనుగోళ్లు

పండగ తర్వాతే కొనుగోళ్లు మొదలుపెట్టి వేగవంతం చేయాలన్న ఆలోచన ఉన్నట్లు కనపడుతోంది. ఈ రెండు మూడ్రోజులూ వర్షాలు ఉంటాయన్న సంకేతాలతో పండగకు ముందు కొనుగోళ్లు మొదలయ్యే అవకాశాలైతే లేవనే చెప్పాలి. గత సీజన్‌లో 6,49,229 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్రంలోనే అత్యధిక సరకు కొన్న రికార్డు సాధించిన నల్గొండ జిల్లా యంత్రాంగం.. ఈసారి సైతం కొనుగోళ్లకు మిగతా జిల్లాల కంటే ముందే ఆదేశాలిచ్చినా, క్షేత్రస్థాయిలో మాత్రం సేకరణ మొదలుకాలేదు. కానీ కళ్లాల్లో పోసుకున్న సాగుదారులు మాత్రం పూర్తి నిరాశలో కూరుకుపోయారు. పంట పెట్టుబడి ఒకెత్తయితే, వాటి కోసేందుకు, రవాణా, పట్టాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. నాణ్యమైన ధాన్యాన్ని పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడులన్నా తిరిగి వస్తాయా అన్న సంశయం రైతుల్లో మొదలైంది.

రోజుల తరబడి ఎదురుచూస్తున్నాం

- గార్ల లక్ష్మమ్మ, అయిటిపాముల, కట్టంగూరు మండలం

పంట కొంటారని మూడు వారాలకు పైగా ఎదురుచూస్తున్నాం. ఆరెకరాలకు గాను రెండెకరాలు కోసి నాలుగు ట్రాక్టర్లలో ధాన్యం తెచ్చాం. వాన వల్ల కుప్పలు నేర్పడానికి అష్టకష్టాలు పడుతున్నాం.

కౌలుకు భూమి తీసుకుని పండించా

- ఎరుకల శంకర్‌, కట్టంగూరు

రెండెకరాల సొంత భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పండించా. ఐకేపీలో ధాన్యం పోసి 18 రోజులయింది. ఇప్పుడు అప్పుడు అన్న మాటే తప్ప ఎప్పుడు కొనుగోళ్లవుతాయో తెలియట్లేదు. సరకును కాపాడుకునేందుకు కిరాయికి తీసుకుంటున్న పట్టాలకే నిత్యం వెచ్చించాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.