close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

తప్పిదాలు.. అగ్నిప్రమాదాలు..

 నిబంధనలు తుంగలో తొక్కుతున్న వైనం
 ఆసుపత్రులు, బహుళ అంతస్తుల్లో ఇష్టారాజ్యం

ఈనాడు, హైదరాబాద్‌: కొన్నిరోజులుగా నగరంలో ఏదో ఒకచోట అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో గ్యాస్‌ గోదాంలో ప్రమాదం వల్ల రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. పరిశ్రమలు, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు.. ఇలా తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మానవ నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. చిన్నచిన్న అజాగ్రత్తలే పెను ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విద్యుత్తు వైర్లు కరిగిపోయి షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నిబంధనలు బేఖాతరు చేయడం, నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడం కూడా కారణాలే. 15 అంతస్తుల దాటిన భవనాలకు ఎన్‌వోసీలు అగ్నిమాపక శాఖ జారీ చేస్తుంది. మిగతా వాటిని జీహెచ్‌ఎంసీ పరిశీలిస్తుంది. అయితే ఇవేవీ పకడ్బందీగా సాగడం లేదనే విమర్శలున్నాయి. ఇందులో రాజకీయ ఒత్తిడిలు కూడా ఉంటున్నాయి. తీరా ప్రమాదం జరిగాక తీరగ్గా చర్యలకు ఆదేశించడం షరామామూలైంది.

సిబ్బంది కొరత.. నిబంధనలు గాలికి..
మహానగరంలో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వేసవిలో 3 నెలలపాటు ఒక్కో కేంద్రానికి 30-40 వరకు అగ్నిప్రమాద సమాచారం అందుతుంటుంది. ఒక్కో కేంద్రంలో 16 మంది సిబ్బంది ఉంటారు. చాలా కేంద్రాల్లో ఇద్దరు డ్రైవర్లతోనే నెట్టుకొస్తున్నారు. నగరం చుట్టూ అనేక పరిశ్రమలు, వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తు భవనాలున్నాయి. వీటిలో చాలావరకు నిబంధనలకు విరుద్ధమే. అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అనుమతులు తెచ్చుకుంటున్నారు. అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలను తీసుకోవడంలో చాలామంది నిర్లక్ష్యం చూపుతున్నారు. చివరికి చేతులు కాలాక లబోదిబోమంటున్నారు. 15 మీటర్లు ఎత్తు (5 అంతస్తులకంటే ఎక్కువ) దాటిన వాణిజ్య భవనాలు, 18 మీటర్లు దాటిన (6 అంతస్తులు, ఆపైన) దాటిన బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లుండాలి. ఇప్పటికే 600-700 భవనాలకు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. ఒక్క కూకట్‌పల్లి ప్రాంతంలోనే గతంలో 40 భవనాలకు నోటీసులిచ్చారు. 20 కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఇందులో ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో నిబంధనలేవీ?
నగరంలో దాదాపు 4 వేల ఆసుపత్రులున్నాయి. పాఠశాలలకు లెక్క లేదు. చిన్నచిన్న గల్లీల్లో కూడా ఆసుపత్రులున్నాయి. వీటిలో సగానికిపైగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసినవే. ప్రధాన ద్వారం తప్ప వెనుక నుంచి గేటు కూడా లేని ఆసుపత్రులకు కూడా ఎన్నో. రిజిస్ట్రేషన్‌ సమయంలో పక్కాగా తనిఖీలు చేసి అనుమతివ్వాలి. తొలుత 90 రోజులకు తాత్కాలిక అనుమతి, నిబంధన ప్రకారం నడిస్తే భావిస్తే అయిదేళ్లకు పొడిగిస్తారు.

వాహనం రావాలంటే గంటపైనే..
నగరంలో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఫైర్‌ ఇంజన్లు రావాలంటే ట్రాఫిక్‌ కారణంగా గంటకంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇటీవలి మాదాపూర్‌లో గుడిసెలు కాలిన సమయంలో ఎక్కువ ఫైర్‌ ఇంజన్లు అవసరం అయ్యాయి. అయితే నగరం నుంచి అక్కడకు చేరుకునే సరికి 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంది.

ఈ జాగ్రత్తలు అవసరం..
* ఆసుపత్రులు, హోటళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సుల చుట్టూ అగ్నిమాపక యంత్రం తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి.
* ప్రతి భవనంలో 10 వేల లీటర్ల సామర్థ్యం నీటి ట్యాంకులు లేదా సంపులు, మోటార్లు, స్ప్రింక్లర్లు, స్మోక్‌ డిటెక్టర్లు, అలారం ఉండాలి.
* ఒకే మెట్ల మార్గం కాకుండా అత్యవసర దారులుండాలి.
* అధిక విద్యుత్తు సరఫరా సమయాల్లో సరఫరా నిలిచిపోయేలా సర్క్యూట్‌ బ్రేకర్లు అమర్చుకోవాలి.
* కనీసం ప్రతి 3, 6 నెలలకోసారి సిబ్బందికి మాక్‌డ్రిల్‌ తప్పనిసరి. అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రతి శుక్రవారం ఎక్కడో ఒకచోట మాక్‌ డ్రిల్‌ చేయాలి. అత్యవసరం సమయంలో తమను తాము కాపాడుకోవడంతోపాటు రోగులను, విద్యార్థులను ఎలా తప్పించాలనే విషయంపై వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.