ఆత్మలకు పింఛన్‌ధర్మాన్ని ముంచెన్‌ - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

ఆత్మలకు పింఛన్‌ధర్మాన్ని ముంచెన్‌

పంపిణీలో సిబ్బంది  చేతివాటం

రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్ము స్వాహా

పింఛన్ల పంపిణీలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు అక్రమార్కులకు అదనపు ఆదాయ వనరుగా మారాయి. అవకాశాన్ని బట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. అడిగేవారు లేరని మృతుల పింఛన్లు స్వాహా చేస్తున్నారు. దొరికినప్పుడు దొంగ లేదంటే దొరల్లా సాగిపోతున్నారు. ఆత్మకూరు మండల పరిధిలోని కురుకుంద గ్రామంలో పదుల సంఖ్యలో పింఛన్లు నెలనెలా స్వాహా చేస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రోద్బలం, సిబ్బంది చేతివాటంతో ప్రభుత్వ ధనం రూ. లక్షల్లో స్వాహా అవుతోంది. 

- న్యూస్‌టుడే, ఆత్మకూరు:

* నీరుకట్లు మౌలాలి(తండ్రి ముర్తుజా)(ఐడీ 113129405) గత ఏడాది ఆగస్టు 8న, చాకలి సుబ్బమ్మ (భర్త లింగస్వామి) (113129368) నాలుగు నెలల క్రితం, జి.సరస్వతి (భర్త కొండయ్య) (113381967) 2017, ఏప్రిల్‌ 11న, చాకలి సుబ్మమ్మ(భర్త నాగలింగన్న) (113593199) రెండేళ్ల క్రితం, రాముడు (తండ్రి చెన్నయ్య) (113381960) మూడు నెలల క్రితం, మాసుంవలి షేక్షావలి (113381974) గత ఏడాది ఆగస్టు 8న, హాజీ నన్నెమాబున్ని(భర్త నన్నెసాహెబ్‌) (113209811), గత ఏడాది సెప్టెంబరు 26న, బి.రమిజాబీ (113510306) మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి చెందిన పింఛను సొమ్ము ఒక్కొక్కరివి రూ.7 వేల నుంచి రూ.34 వేల వరకు వారి కుటుంబ సభ్యులకు తెలియకుండానే సిబ్బంది స్వాహా చేశారు. 

* ఆత్మకూరు మండలంలోని కురుకుంద మజరా గ్రామం కొట్టాల చెరువు గూడెంలో నలుగురు చెంచులు మృతి చెందినా వారి పేర్ల మీద పింఛన్లు నేటికీ¨ బయటి వ్యక్తులు స్వాహా చేస్తున్నారు. 

* జెల్లి పెద్దమ్మ(భర్త గువ్వన్న)(ఐడీ 1133822178) 2017, ఆగస్టు 15న, అచ్చమ్మ(భర్త చిన్నమార్కు)(ఐడీ 1131294551)  తొమ్మిది నెలల క్రితం, ఉత్తలూరి వెంకటమ్మ(భర్త చిన్న లింగన్న)(ఐడీ 113209908) నాలుగు నెలల క్రితం, భూమని కమ్మ(మూగన్న)(ఐడీ 113530886) రెండేళ్ల క్రితం మృతి చెందారు. వీళ్లవి ఒక్కొక్కరివి రూ.17 వేల నుంచి రూ.29 వేల వరకు ఇప్పటి  వరకు పింఛను సొమ్మును అక్రమార్కులు మింగేశారు.

* కురుకుంద గ్రామంలో 583 మంది పింఛనర్లు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య 303, వితంతు 212, దివ్యాంగులు 53, ఒంటరి మహిళలు 5, మిగిలినవి ఇతరులు ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి స్థానంలో కొత్త కార్యదర్శి నియమితులయ్యారు. ఈ నెల పింఛన్ల పంపిణీ సమయంలో ఊళ్లలో లేనివారు, చనిపోయినవారి పింఛన్లు ఇవ్వనంటూ చెప్పడంతో కొందరు అటువైపుగా వెళ్లలేదు. ఇంకా దాదాపు 60 మంది పింఛన్లు తీసుకోడానికి రాలేదు. 

* ప్రభుత్వం పేదల బతుకులకు భరోసానిస్తూ వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు అందిస్తోంది. గత ప్రభుత్వాలు రూ.100, రూ.200 పింఛన్‌గా ఇచ్చేవి. చంద్రబాబు రూ.2 వేలకు పెంచగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 వేలకు నాలుగేళ్లలో పెంచనున్నారు. తెదేపా ప్రభుత్వం నాలుగున్నరేళ్లపాటు రూ.1000 పింఛన్‌ ఇవ్వగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రూ.2 వేలు చేశారు. దీన్ని జగన్‌ మరింత పెంచుతూ ప్రస్తుతం రూ.2,250 ఇస్తున్నారు.

* మరణ ధ్రువీకరణ పత్రాలు చూపుతున్న ఈ దంపతులు కొట్టాల చెరువు గూడేనికి చెందిన నిమ్మల లింగమ్మ, మూగన్నలు. వీరు జెల్లి పెద్దమ్మ కుమార్తె, అల్లుడు. పెద్దమ్మ 2017, ఆగస్టులో చనిపోయింది. ఇప్పటికి మా అమ్మ పేరు మీద పింఛన్‌ వస్తున్నట్లు తెలిసింది. మాకు ఒక్క పైసా ముట్టలేదని వారు తెలిపారు.

మొక్కుబడిగా సామాజిక తనిఖీలు

సామాజిక తనిఖీల్లో అక్రమాలు గుర్తించినా సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. కేవలం రికవరీతో సరిపుచ్చుతున్నారు. సామాజిక తనిఖీలు మొక్కుబడిగా మారటంతో అక్రమార్కులకు అడ్డులేకుండా పోయింది. గతంలో ఇదే గ్రామంలో పింఛన్‌ అక్రమాలు గుర్తించి రికవరీ చేశారు. అక్రమాలు ఉన్నత స్థాయి అధికారుల వద్దకు వెళ్లకుండా కింది స్థాయిలోనే మాఫీ చేసేస్తుండటం వీరికి కలిస్తోంది. 

మామ చనిపోయి ఏడాదైంది

- కోడళ్లు మంచాలకట్ట హమీమ్, అక్తరూన్‌

మా మామ నీరుకట్ల మౌలాలి 8.8.2018న మృతి చెందారు. మామ చనిపోయిన నెల పింఛన్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఇంతవరకు పింఛన్‌ ఇవ్వట్లేదు. ఎవరు తింటున్నారో మాకు తెలియదు. 

నా పేరు మీదకు మార్చమన్నా పట్టించుకోలేదు

- ముర్తుజాబి, కురకుంద గ్రామం

నా భర్త ఆరు నెలల క్రితం చనిపోయారు. మార్చి నుంచి పింఛన్‌ ఇవ్వట్లేదు. నా భర్త పింఛన్‌ నా పేరు మీదకు మార్చమని అడిగాను. అదిగోఇదిగో అంటున్నారే తప్ప పట్టించుకోలేదు. ఇప్పుడు నా కుటుంబానికి ఆదరవు లేదు.  

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.