close

ప్ర‌త్యేక క‌థ‌నం

రబ్బర్‌ స్టాంపులా ఉండను

గవర్నర్‌గానూ ప్రజలతో మమేకమవుతా
సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు వస్తుంటా
తెరాస పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది
తెలంగాణలో భాజపాకు చాలా మంచి భవిష్యత్తు ఉంది
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో దత్తాత్రేయ
11న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా ప్రమాణం

రాజ్యాంగబద్ధ హోదాలో కొత్త బాధ్యతలు చేపట్టనుండటం కాలానుగుణమైన మార్పుగా భావిస్తున్నానని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ముఖ్యమైన పదవులు నిర్వహించానని ఇప్పుడు గవర్నర్‌గా సంతోషంగా వెళుతున్నానని అన్నారు. 11న గవర్నర్‌గా ప్రమాణం చేయనున్న దత్తాత్రేయ ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

కొత్త పాత్రపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
గవర్నర్‌ బాధ్యతలు కీలకం. రబ్బర్‌ స్టాంప్‌లా ఉండను. ప్రభుత్వాలు ప్రజాహితం లేని చట్టాలు చేస్తే వాటిని ప్రశ్నించాలి. ప్రజా జీవితంలో చురుగ్గా ఉన్న సమయంలో ఈ పదవి వస్తుందని ఊహించలేదు. అధికారిక ప్రకటనకు రెండురోజుల ముందు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. మీకో బాధ్యత అప్పగిస్తానని చెప్పారు. పార్టీకి సంబంధించింది అనుకున్నా. గవర్నర్‌గా ప్రకటించాక పార్టీలు, వర్గాలకు అతీతంగా పెద్దసంఖ్యలో వచ్చి కలుస్తున్నారు. కేంద్ర మంత్రిని అయినప్పటికంటే ఎక్కువ స్పందన వస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌ దేవభూమి. అక్కడ పనిచేయడం సేవగా భావిస్తా. రాజ్‌భవన్‌లో ఉన్నా ఆ రాష్ట్ర జనంతో మమేకమవుతా. రాష్ట్రానికి, పార్టీకి దూరం కావడం బాధగా ఉంది. పండగలు పబ్బాలప్పుడు రాష్ట్రానికి వస్తా. ప్రజలను కలుస్తా.

తెలంగాణలో భాజపా బలాలు, బలహీనతల గురించి చెప్పమంటే..
అధికార తెరాసపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. భాజపా వైపు చూస్తున్నారు. అందుకే ఇతరపార్టీల నేతలూ వస్తున్నారు. భాజపాకు మంచి భవిష్యత్తు ఉంది. ఇన్నాళ్లూ చేసిన శ్రమకు ఫలితాలు వస్తున్నాయి.

చేయలేకపోయానని మీరనుకున్న పనులు..
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు 2003లోనే హైదరాబాద్‌కు మెట్రోరైలు తెచ్చేందుకు ప్రయత్నించా. చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో సాధ్యం కాలేదు. హైదరాబాద్‌ను మురికివాడల్లేని నగరం చేయాలనుకున్నా ఆచరణ సాధ్యం కాలేదు.

నేటి చట్టసభలు, సభ్యులపై..
ప్రమాణాలు కొంచెం తగ్గుతున్నాయి. సభా సమయం వృథా చేయవద్దు. అధికారపక్షం కూడా ప్రతిపక్షాల సూచనలు స్వీకరించాలి. పదవులు, అధికారం రావచ్చు.. పోవచ్చు. వ్యక్తిత్వాన్ని కోల్పోతే పదవికి, మనిషికి విలువ ఉండదు. అసూయ లేకుండా ఆత్మీయంగా ఉంటే నాయకులకు మంచి గుర్తింపు వస్తుంది.

భాజపా ఉన్నతిని... వ్యక్తిగతంగా మీ ఎదుగుదలను విశ్లేషించమంటే...

పార్టీ ఆవిర్భావం నుంచి భాజపాలో ఉన్నా. వాజ్‌పేయీ, అడ్వాణీ వంటి గొప్పనేతలతో కలిసి పనిచేశా. భాజపా రెండుసార్లు కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వస్తుందని, ఇంత ప్రజాదరణ వస్తుందని ఏనాడూ ఊహించలేదు. ఇక నావరకు చూసుకుంటే దాదాపు 40 ఏళ్ల పాటు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశా. ఏ పదవి వచ్చినా ప్రజల మధ్య ఉన్నా. ఎంపీగా గెలుస్తానని.. కేంద్ర మంత్రిని అవుతాననీ అనుకోలేదు.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.