close

ప్ర‌త్యేక క‌థ‌నం

జలమేజయులం కావాలి

నీటి ముప్పు ముంచుకొచ్చేసింది 
ఇప్పటికే అత్యవసర పరిస్థితి నెలకొంది 
దక్షిణాది రాష్ట్రాల్లో సమస్య తీవ్రమవుతోంది 
నీళ్లు దొరకక బలవంతపు వలసలు 
జల సంరక్షణ పాఠ్యాంశం కావాలి 
‘ఈనాడు-ఈటీవీ’తో రాజేంద్రసింగ్‌

నాలుగున్నర దశాబ్దాల క్రితం ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లోని తీవ్ర వర్షాభావ ప్రాంతమైన ఆల్వార్‌ జిల్లాలో రాజేంద్రసింగ్‌ అడుగుపెట్టారు. అప్పటికి ఆయనో సాధారణ వ్యక్తి.. ఆయుర్వేద వైద్యుడు. వెనుకబడిన ప్రాంతంలో ఆయుర్వేద వైద్యంతో ఆ ప్రాంత ప్రజలకు తనవంతుగా తోడ్పాటు అందించాలని వైద్యం ప్రారంభించారు. జలవనరుల సంరక్షణ.. వాననీటిని ఒడిసి పట్టడం అనేది ఆయన మదిలోనే లేదు. 

రాజస్థాన్‌ గ్రామీణుడైన మంగూమీనా అనే వృద్ధుడికి రేచీకటి. రాజేంద్రసింగ్‌ అతడికి తన వైద్యంతో నయం చేశారు. రేచీకటి సమస్య తొలగిన మంగూమీనా అడిగిన మొదటి ప్రశ్న ‘నాకు చూపెందుకు తెప్పించారు?’ అని. ఇదేంటి చూపు వచ్చినందుకు సంతోషించి తనకు కృతజ్ఞతలు చెబుతాడనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడనే సంశయంలో పడ్డారు రాజేంద్రసింగ్‌. తేరుకుని ఎందుకలా అంటున్నావని మంగూమీనాను అడిగారు.. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే.. 
ఒక కుండను చూపాడు.. నాకు చూపులేదని గ్రామంలోవారు రోజూ నీటిని తెచ్చి కుండలో పోస్తుండేవారు. నాకు ఎలాంటి సమస్య ఉండేది కాదు... ఇప్పుడు చూపు వచ్చిందని తెలిస్తే నా కుండలో నీళ్లు ఎవరు పోస్తారు? నేను 15 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోగలనా? అని ప్రశ్నించాడు. 
నాకు కావాల్సింది కంటి చూపు కాదు.. గుక్కెడు నీళ్లు అంటూ మంగూమీనా చేసిన వ్యాఖ్యలు రాజేంద్రసింగ్‌ని ఆలోచింపచేశాయి. అప్పుడు అనిపించింది రాజేంద్రసింగ్‌కు.. వారికి కావాల్సింది వైద్యం కాదు. అంతకంటే ముందు మంచినీళ్లని. 
ఆ ఆలోచనే రాజేంద్రసింగ్‌ను మెగసెసె అవార్డు వరకూ తీసుకెళ్లింది. ప్రజలను సంఘటితం చేసి ‘తరుణ్‌ భరత్‌’ పేరుతో ఓ సంఘం స్థాపించి ప్రజల భాగస్వామ్యంతో ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 11,800 చెరువులు తవ్వించారు.. ఫలితంగా ఆల్వార్‌ జిల్లాలోని ప్రజలకు నీటిసమస్య తీరింది.. ఎడారి భూముల్లో సిరులు పండుతున్నాయి.. వ్యవసాయంతో పాటు పశు సంపద పెరిగింది. వలసబాట పట్టినవారు గ్రామాలకు తిరిగివచ్చారు.. వాననీటిని ఒడిసిపట్టి జలవనరుల పునరుజ్జీవంతో తరుణ్‌ భరత్‌ సంఘం చేతలు అద్భుతాన్ని సృష్టించాయి. 
తరుణ్‌ భరత్‌ సంఘ్‌ ఎలా సాధ్యమైంది 
ప్రజల భాగస్వామ్యంతో చేసే కార్యక్రమం ఏదైనా విజయవంతమవుతుంది. రాజస్థాన్‌లో ఆయుర్వేద వైద్యుడిగా అక్కడ అడుగుపెట్టినపుడే నా సతీమణి ఆలోచించుకోవాలని నాతో చెప్పారు. మా అమ్మ మాత్రం నీకు ఎలా నచ్చితే అలా ముందుకు వెళ్లు అన్నారు. అక్కడ వైద్య సేవలకంటే నీటి అవసరం తీర్చాల్సిన అవసరం ఉందని గుర్తించా. నేను ఒక్కడినే ఏం చేయగలను. ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని గుర్తించా. వారితో చర్చించా. కొంతమంది ముందుకు వచ్చారు. తర్వాత అంతా కలసి వచ్చారు. ప్రధానంగా ప్రజలతో చర్చించి వారి ద్వారానే ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం వల్ల సాధ్యమైంది. ఎక్కడ తవ్వాలి? ఎలా తవ్వాలి? అనేది అంతా ప్రజల నిర్ణయమే. స్థానికులే ఇంజినీర్లుగా మారారు. వాళ్ల ఆలోచనలు.. వాళ్ల శ్రమశక్తితో జలవనరుల్ని సృష్టించుకున్నారు. తరుణ్‌ భరత్‌ సంఘం విజయానికి ఇదే కారణం. ఫలితంగానే ఒకప్పుడు నీటికోసం అలమటించిన ప్రాంతాలు... డార్క్‌జోన్‌గా ఉన్నవి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. 

భూగర్భజలాల పరిస్థితి ఏమిటి? 
అత్యంత దారుణంగా ఉంది. భూగర్భజలాల్లో 72 శాతం ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉన్నాం. మన దేశంలో 54 శాతం ప్రాంతం తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. మనం భూగర్భజలం తోడేస్తుంటే భూమి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. భూగర్భం నీటికి బ్యాంకు లాంటిది. బ్యాంకులో డబ్బు డిపాజిట్‌ చేయకుండా ఎంతసేపూ తీసుకుంటూనే ఉంటే ఆ నిల్వలు ఎంతకాలం ఉంటాయి? భూగర్భజలాల పరిస్థితి కూడా అంతే. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మనలో కనువిప్పు కలగడంలేదు. 
రుతుపవనాలు వచ్చినా వర్షాలు లేవు.. 
కచ్చితంగా ఈ పరిస్థితులను మనం గుర్తించాలి. వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనేందుకు ఇది సంకేతం. దక్షిణ భారతం సహా దేశంలో వివిధ రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 

17 రాష్ట్రాల్లో సమస్య తీవ్రం 
మనం నీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దాని విలువను మాత్రం గుర్తించడంలేదు. నిన్న నీటి సమస్య లేదు. రేపటి గురించి కాదు ఇప్పటి గురించి మనం ఆలోచించాలి. ముందు ఇప్పుడున్న నీటి సమస్యలను మనం పరిష్కరించుకోవాలి. నేడు మన దేశంలోని 17 రాష్ట్రాల్లో 365 జిల్లాలు తీవ్రమైన నీటి సమస్యతో సతమతమవుతున్నాయి. 200 నగరాలు, పట్టణాలు నీటి సమస్య లేదా వరదలతో సతమతమవుతున్నాయి. అయినా మనకు కనువిప్పు కలగడంలేదు. 
నీటి సమస్యకు  పరిష్కారం ఎలా? 
మార్పు మనతోనే మొదలు కావాలి. నీటి సమస్య పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. వాననీటి సంరక్షణతో పాటు నదులు, జలవనరులు కాపాడుకుంటేనే మనుగడ ఉంటుంది. నిన్న లేని సమస్య నేడు తీవ్రమైన సమస్యగా మారింది. భవిష్యత్తులో అది మరింత జటిలంగా మారుతుంది. వాననీటి సంరక్షణ అత్యవసర అంశం. కనుమరుగవుతున్న జలవనరుల పునరుజ్జీవం ప్రతిఒక్కరి కర్తవ్యం. ప్రభుత్వం చేస్తుందంటేనే సరిపోదు. ప్రభుత్వం, సమాజం కలసి చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. నదులు కలుషితం కాకుండా చూసుకోవాలి. 
నదుల కాలుష్యానికి పరిష్కారం ఏమిటి? 
నేడు నదులన్నీ కాలుష్యమయంగా మారాయి. పట్టణాలు, నగరాల నుంచి కాలుష్యమంతా నదుల్లోకి చేరుతోంది. దీంతో ఉన్న జలవనరులు కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. గంగా ప్రక్షాళన వంటి కార్యక్రమాలను ప్రారంభిస్తేనే సరిపోదు.. వాటిని చిత్తశుద్ధితో పూర్తిగా అమలు చేయాలి. హైదరాబాద్‌లోని మూసీ సహా దేశంలోని అనేక నదులు మురుగునీటి కాలువల్లా మారిపోవడం దురదృష్టకరం. 

అత్యవసరంగా చేయాల్సిన అంశాలు ఏమిటి? 
ముందుగా మనం నీటి అత్యవసర పరిస్థితిని (వాటర్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించాలి. పథకాల పేర్లు మార్చినంత మాత్రాన ఫలితంలేదు. గంగా ప్రక్షాళన కావచ్చు.. కృషి సించాయ్‌ యోజన కావచ్చు.. జల్‌శక్తి అభియాన్‌ కావచ్చు వాటిని చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. కాంట్రాక్టర్లకు అప్పగిస్తే డబ్బుల కోసం తప్ప ఫలితాలు వచ్చేలా ఉండవు. నీరు భూమిలో ఇంకేలా అన్నివిధాలా చర్యలు తీసుకోవాలి. జల సంరక్షణ మన విధానం కావాలి. జల భద్రతను ప్రభుత్వం కీలక అంశంగా గుర్తించాలి. అన్ని దశల్లో పాఠ్యాంశాల్లో జలసంరక్షణ ఒక అంశం కావాలి. ఒక్కో వ్యక్తి రోజుకు 300 లీటర్లు... 400 లీటర్లు వాడితే అది ఎలా గొప్పతనమవుతుంది? అంత వృథా చేయడం ప్రగతికి సూచిక ఎలా అవుతుంది? 20 లీటర్లు లేదా 40 లీటర్లతో సరిపెట్టుకోవడమే నిజమైన ప్రగతి.

నీటి విలువ తెలిసేలా చేసిన చిన్న సంఘటన 
నీటిని వృథా చేయకూడదనేందుకు నేను చిన్నతనంలో ఉండగా జరిగిన ఒక సంఘటన కూడా కారణం.నేను బంతి ఆడుతున్నపుడు ఒక కుండకు తాకడంతో అది పగిలి నీరు వృథా అయింది. దీన్ని చూసి మా తాత కోప్పడి ఆ నీటి విలువ నీకు తెలుసా అని ప్రశ్నించారు. ఇది చిన్న ఘటనే అయినా గుర్తుండి పోయింది. జల సంరక్షణ ఆవశ్యకతను గుర్తించేలా ఇది దోహదపడింది.
నల్లాలు కాదు... వాటిలో నీళ్లు కావాలి.. 
జల్‌శక్తి అభియాన్‌తో కేంద్రం ప్రతి ఇంటికి నల్లా అంటోంది. నల్లాలు బిగించడం చాలా సులువైన పని... ఆ నల్లాల్లో    నీళ్లు వచ్చేలా చేయడమే కీలకం. కాంట్రాక్ట్‌ ఇస్తే నల్లాలను క్షణాల్లో బిగిస్తారు. ఆ నల్లాల లక్ష్యమైన నీటిని అందించడంపై దృష్టిసారించాలి. నీటిని సరఫరా చేయడానికి నీటి లభ్యతను పెంచుకోవాలి. దీనికి అనుగుణంగా జల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

 


వర్షాభావ ప్రాంతాల్లో వర్షాలు కురిసేలా చేయెచ్చా? 
కచ్చితంగా సాధ్యమే. వర్షాభావ ప్రాంతాలకు కారణం పచ్చదనం తగ్గిపోవడమే. పచ్చదనం లేనిచోట మేఘాలు ఉన్నా వేడి గాలుల   కారణంగా తేలికై తరలిపోతాయి. మేఘాలు అక్కడే కురవాలంటే దీనికి పచ్చదనం పెంచడమే పరిష్కారం.
ప్రకృతి సహజ విధానాలు కావాలి 
మన దేశంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా వాతావరణ పరంగా మన దేశాన్ని 19 జోన్‌లుగా విభజించారు. ఏ జోన్‌కు ఆ జోన్‌లో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం జలసంరక్షణకు చేపట్టే కార్యక్రమాలు ఆ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా ఉన్నపుడే ఫలితాలు వస్తాయి. దిల్లీలో కూర్చుని దేశమంతా ఇలాగే ఉండాలని చెబితే సరిపోదు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రకృతి సహజ సిద్ధమైన విధానాల ద్వారా జల సంరక్షణ చేయాలి. ప్రకృతి సహజ విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయని తరుణ్‌ భరత్‌ సంఘ్‌ (టీబీఎస్‌) రాజస్థాన్‌లో నిరూపించింది. ఎక్కడైనా ఇది సాధ్యమే.
నల్లమలలో యురేనియం తవ్వకాలపై మీ అభిప్రాయం 
శ్రీశైలం ప్రాజెక్టుకు కీలకమైన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో యురేనియం తవ్వకాలు సరికాదు. నదీపరీవాహక ప్రాంతాలను కాపాడుకోకుంటే నదుల మనుగడే ప్రమాదంలో పడుతుంది. యురేనియం తినరు కదా?... నీళ్లయితే తాగడానికి కావాలి. దీన్ని గుర్తించాలి.
ప్రపంచ యుద్ధం నీటికోసమే 
ప్రపంచ పోకడలు చూస్తుంటే అనేక అంశాలు మన కళ్లకు కడుతున్నాయి. జలవనరుల సమస్యతో సిరియా, సూడాన్‌ సహా అనేక దేశాల్లో వలసబాట పడుతున్నారు. మనం ఇంకా నీటి కోసం వలసబాట పట్టడంలేదు... ఉపాధి కోసమే పట్టణాలు, నగరాలకు వెళ్తున్నాం. మన దేశంలో ఎంతో వైవిధ్యం ఉంది. ప్రాంతాలవారీగా భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. 19 వాతావరణ జోన్‌లు ఉన్నాయి. వాటిని గుర్తించాలి. వాటికి అనుగుణంగా ఏ ప్రాంతాలకు అవసరమైనట్లు ఆ ప్రాంతాల్లో జల సంరక్షణ విధానాలు అనుసరించేలా చూడాలి.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.