close

ప్ర‌త్యేక క‌థ‌నం

వన్యప్రాణోదయం

జన్నారం డివిజన్‌లో నాలుగేళ్లలో 40శాతం వన్యప్రాణుల వృద్ధి
వేగంగా పెరుగుతున్నశాకాహార, మాంసాహార జంతువులు
గడ్డిక్షేత్రాల అభివృద్ధితో సత్ఫలితాలు
మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్దపులి
మరో ఐదారు వస్తాయంటున్న అటవీశాఖ
ఈనాడు - హైదరాబాద్‌

న్నారం.. కవ్వాల్‌ పెద్దపులుల అభయారణ్యంలో కీలక (కోర్‌ఏరియా) ప్రాంతం. జింకలు, కొండగొర్రెలు, మనుబోతులు వంటి శాకాహార జంతువులు.. చిరుతపులి, ఎలుగుబంటి వంటి మాంసాహార జంతువుల సంఖ్య ఇక్కడ వేగంగా పెరుగుతోంది. ఇటీవల జరిగిన జంతుగణనలో గణాంకాల్ని పరిశీలిస్తే నాలుగేళ్ల క్రితం కంటే 40శాతంపైగా వీటి సంఖ్య పెరిగినట్లు అటవీశాఖ గుర్తించింది. పొలాల్లోకి వచ్చి పంట నష్టం చేసిన, మనుషులపై దాడులు చేసిన అడవి పందులు ఇప్పుడు దాదాపు అటవీప్రాంతాన్ని దాటి బయటకు రావడంలేదు. చిరుతలు, ఇతర మాంసాహార జంతువుల కారణంగా పశువుల మరణాలు దాదాపుగా లేవని చెబుతోంది. గడ్డిక్షేత్రాల అభివృద్ధితో శాకాహార జంతువుల సంఖ్య పెరిగిందని, వాటిపై ఆధారపడే మాంసాహార జంతువుల సంఖ్య పెరుగుతోందని చెబుతోంది. ఈ సానుకూల పరిస్థితుల కారణంగానే ఇటీవల ఓ పెద్దపులి మహారాష్ట్ర నుంచి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దేశంలో పెద్దపులుల అభయారణ్యాల్లో గడ్డిక్షేత్రాల అభివృద్ధి సలహాదారుగా ఉన్న మహారాష్ట్రకు చెందిన డాక్టర్‌ మురత్కర్‌ సలహాలు సైతం తీసుకున్నారు.

* కవ్వాల్‌ను పెద్దపులులకు ఆవాస ప్రాంతంగా చేసేందుకు అటవీశాఖ ఐదారేళ్లుగా ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడు ఒకట్రెండు పెద్దపులులు వచ్చినా అనుకూల పరిస్థితుల్లేక వెనుతిరిగిపోయేవి. అడవి లోపలి గ్రామాల తరలింపు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో అటవీశాఖ ఇతర అంశాలపై దృష్టిపెట్టింది.
* పెద్దపులులు ఓ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకోవాలంటే వాటి ఆహారానికి తగినన్ని శాకాహార జంతువులుండాలి. వాటికి ఆహారంగా నీళ్లు, గడ్డి తగినంత ఉండాలి. ఈ సమస్య పరిష్కారానికి గడ్డిక్షేత్రాల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఒక్కోగ్రామం పక్కనే 50-100 హెక్టార్ల చొప్పున మొత్తంగా 5535 హెక్టార్ల అటవీభూమిని పశువుల మేతకు కేటాయించారు. ఈ పరిధి దాటి అడవి లోపలకు పశువుల్ని తీసుకొస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆరు నెలల్లో మార్పు

ప్రత్యేక ప్రణాళికతో జన్నారం అటవీ డివిజన్‌లో ఆరునెలల్లో మార్పు తీసుకొచ్చాం. అడవి లోపలే సరిపడా ఆహారం దొరికేలా చేస్తున్నాం. ఫలితంగా జింకలు, అడవిపందుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. పెద్దపులి ఓ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకోవాలంటే తగినన్ని శాకాహార జంతువులుండాలి. జన్నారంలో శాకాహార జంతువుల పెరుగుదల ఇప్పుడు అందుకు అనుగుణంగా ఉంది. ఆరేడు పెద్దపులులు వస్తాయని భావిస్తున్నాం.
- రవీందర్‌, జన్నారం డివిజనల్‌ అటవీ అధికారి

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.