close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఒళ్లంత.. పులకింత .. ఎంతెంత?

ఒళ్లంత.. పులకింత .. ఎంతెంత?

మనకు అనుకూలంగా ఒక పని జరిగితే... సంతోషం! ఒకవేళ అది మనకు వ్యతిరేకమైనదైతే... దుఃఖం!! 
ఇలా రోజూ ఎన్నో పనులు, సంఘటనలు మనకు రకరకాల భావోద్వేగాలను మిగులుస్తుంటాయి. వీటిలో కొన్ని సానుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా ఉండటం అత్యంత సహజం. ఒకప్పుడు కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తదితర ప్రతికూలాంశాల గురించే ఎక్కువగా పరిశోధించిన మనస్తత్వ శాస్త్రవేత్తలంతా ఇప్పుడు సంతోషం, సంతృప్తి వంటి సానుకూల స్పందనలపై దృష్టి సారిస్తున్నారు. మరి ఎలాంటి అంశాలు మనకు సంతోషం కలిగిస్తాయో, వాటి గురించి పరిశోధకులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దామా...

ఒళ్లంత.. పులకింత .. ఎంతెంత?

‘‘సంతోషంగా ఉంటే మనం నవ్వం. నవ్వితేనే మనకు సంతోషం కలుగుతుంది.’’

- విలియం జేమ్స్‌

‘‘కొత్త సంవత్సరం సంతోషంగా గడుస్తుందన్న భావనే ఆశలను చిగురింపజేస్తుంది’’

- ఆల్‌ఫ్రెడ్‌ టెన్నిసన్‌

సంతోషమనేది ఒక అనిర్వచనీయ భావన. బ్రహ్మపదార్థం లాంటిది. సంతోషమంటే ఇదీ.. ఇలా ఉంటుంది.. ఫలానా పని చేస్తే అందరికీ కచ్చితంగా లభిస్తుంది అని చెప్పలేం. అలాగని ఇది లేకుండా మనిషి ఎంతో కాలం మనుగడ సాగించలేడు. సాగించినా దానికి అసలు అర్థమే ఉండదు. అంత ముఖ్యమైనది కాబట్టే... ‘జీవితం సంతోషంగా గడిచిపోతే చాలు’ అని అంటుంటారు కుబేరులు కూడా! పాజిటివ్‌ సైకాలజీ ఒళ్లంత.. పులకింత .. ఎంతెంత?రంగం ఇప్పుడు సంతోషం చుట్టూ తిరుగుతూ, దానికి దారులను వెతికే పనిలో పడింది. 
కొలబద్ధలు మారుతున్నాయి... 
చాలామంది సంతోషాన్ని డబ్బుతో కొలిచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, నిజంగా డబ్బు వల్ల మనిషికి ఆనందం కలుగుతుందా? ఎంత ఎక్కువగా సంపాదిస్తే మనిషి జీవితం కూడా అంత అధికంగా సంతోషభరితం అవుతుందా? కానే కాదంటున్నాయి తాజా పరిశోధనలు. పేదరికం, అవినీతి, హింస వేధిస్తున్నా కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోనే ఎక్కువమంది సంతోషంగా ఉన్న దేశంగా నైజీరియా నిలిచింది! ఇప్పటికీ ఆనందపు స్థాయిలో భారత్‌ 133 స్థానానికే పరిమితం కాగా, నైజీరియా 91వ స్థానంలో ఉండటం గమనార్హం. ఆఫ్రికా దేశాలవారు చాలా ఆనందంగా జీవనం సాగిస్తుండటానికి కారణం: ఒకటి-సంగీతం. రెండోది- దైవం. రెండూ మనసును ఆహ్లాదపరిచేవే. బాహ్య పరిస్థితులేవీ వారిని ఇసుమంత కూడా ప్రభావితం చేయలేకపోతుండటం పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకే... ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి ఆర్థిక పరిస్థితులతో పాటు వారి సుఖ జీవన పరిస్థితులనూ లెక్కగట్టాలని ప్రముఖ మనస్తత్వ పరిశోధకుడు, నోబెల్‌ పురస్కార గ్రహీత డేనియెల్‌ కహ్నెమాన్‌ సూచించారు. 
‘సంతోషం’ కలుగుతుందిలా... 
మెదడులోని ఆనందమయ కేంద్రాలు ఉత్తేజితమైనప్పుడు కలిగే సానుకూల భావనే... సంతోషం! నుదుటి వెనుక భాగాన కార్టెక్స్‌ ఉంటుంది. మనకు ఆనందం కలగాలంటే, ఇందులోని ఎడమవైపు భాగం ఉత్తేజితమవ్వాలి. ఇందులోని కొన్ని హార్మోన్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఒడుదొడుకుల్లేకుండా, ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితం గడిపేసేవారిలో ఈ మెదడు భాగం చాలా చైతన్యంగా ఉంటుందని ఇప్పటికే చాలా పరిశోధనల్లో రూఢి అయింది. చిత్రకారులు, సంగీత విద్వాంసులు, గాయకులు తదితర కళాకారులు, క్రీడాకారుల్లో తరచూ ఈ భాగం చాలా ఉత్తేజంగా ఉంటుందని తేలింది కూడా. 
మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కృత్రిమంగా కొంతసేపు కార్టెక్స్‌ ఉత్తేజితమై, తాత్కాలికంగా ఆనందం అనిపించినా... ఆ ప్రభావం తగ్గిపోగానే మళ్లీ ప్రతికూల భావనలు ముసురుకుంటున్నట్లు పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు. 
పనిలో... ప్రేమలో... 
సంతోషంగా ఎప్పుడుంటామన్న ప్రశ్నకు- మనస్తత్వశాస్త్ర పితామహుడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ మంచి సమాధానమిచ్చి వెళ్లారీ ప్రపంచానికి. ఒకటి- పని. రెండు- ప్రేమ. ఈ రెండూ దండిగా ఉన్నవాళ్లు సంతోషంగా జీవించగలరని చెప్పారాయన. ఆ ప్రేమంతా పనిపైనే ఉంటే ఇంకెంత ఆనందంగా ఉండొచ్చో తెలియదుగానీ... ‘భవిష్యత్తుపై ఆశ’ కూడా తోడైతే జీవితం పండగేనంటున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు. జీవనశైలిని మార్చుకోవడం ద్వారా సంతోష స్థాయుల్ని పెంచుకోవచ్చని కొందరు పరిశోధకులు అంటుంటే... అబ్బబ్బే, అది పూర్తిగా జన్యుసంబంధ విషయం, దాన్ని పెద్దగా మార్చేదేమీ ఉండదన్నది మరికొందరి వాదన. అయితే, ఆమోదయోగ్య సిద్ధాంతం మాత్రం ఒకటుంది. దాని ప్రకారం- ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ‘సంతోష స్థాయి’ అనేది ఉంటుంది. ఏదైనా సాధించినప్పుడు, లాటరీ వంటిది తగిలినప్పుడు ఆ స్థాయి అమాంతం పెరిగిపోతుంది. అదే అనూహ్యంగా, అనుకున్నదానికి విరుద్ధంగా పరీక్షల్లో ఫెయిలవ్వడం వంటివి సంభవిస్తే... సంతోష స్థాయి అమాంతం పడిపోయి, విషాదం చుట్టుముడుతుంది. ఇలాంటి అధిక సంతోషమైనా, బాధయినా... 6-10 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ సంతోష స్థాయి పూర్వ స్థితికి చేరుతుంది. అందుకే... జీతం పెరగడం, పదోన్నతి, పెళ్లి వంటి ఘట్టాలు ఎంతోకాలం ఆనందాన్ని ఇవ్వలేవట. విడాకులు, ఉద్యోగం పోవడం, సన్నిహితుల మరణం వంటివి కూడా ఎంతోకాలం కుంగిపోయేలా చేయలేవట. వీటికి జనం త్వరగానే అలవాటు పడతారట.

సంతోషం ఎలా సాధ్యం?

షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై చక్కటి పరిశోధనలు సాగించారు. కుటుంబ సభ్యులు కాకుండా, కనీసం ఐదుగురు వ్యక్తులతో అత్యంత ఆత్మీయ సంబంధాలు ఉండేవారు మిగతా వారికంటే 50% ఎక్కువ ఆనందంగా ఉంటారని తేల్చారు! జీవితం పూర్తిగా తమ కోసమేనని అనుకోకుండా, ఎంతోకొంత సామాజిక సేవ చేయడం ద్వారా ఆనందాన్ని ఆస్వాదించవచ్చని రూఢిపరిచారు. అయితే... ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆనందం తగ్గిపోయే ముప్పుందని స్వీడన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సంతోషం పొందే విషయమై ప్రపంచ వ్యాప్తంగా పలువురు మానసిక-ఆర్థిక శాస్త్రవేత్తలు కలిసి చేసిన పరిశోధనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కటే చెబుతున్నాయంటున్నారు సింగపూర్‌కు చెందిన పరిశోధకుడు మాల్కం చోలింగ్‌. 
‘‘కొద్దిమంది ఆత్మీయులు ఉండటం + సంపాదన కోసం విపరీతమైన తాపత్రయం లేకపోవడం + ఇతరుల పట్ల దయతో మెలగడం + జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని చేరేందుకు ప్రయత్నించడం = సంతోషం’’ అని దీన్ని సూత్రీకరించారాయన! 
సాధన సంతోషం 
మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం. దాన్ని చేరుకోవడానికి తపిస్తాం. చివరకు సాధిస్తాం. దీంతో అద్వితీయమైన అనుభూతి మన సొంతమవుతుంది. కానీ, ఆ విజయోత్సాహం కొన్నాళ్లే ఉంటుంది. మళ్లీ బోర్‌ కొట్టిందంటే, దానర్థం- మళ్లీ మనకో విజయం కావాలన్న మాట! ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఏదోకటి సాధిస్తూ ఉంటే జీవితం పండగలా ఉంటుందంటున్నారు పరిశోధకుడు డెస్మండ్‌ మోరిస్‌. 
సమర సంతోషం 
ప్రత్యర్థులను ఓడించి సంపాదించిన సంతోషం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా క్రీడా పోటీలో తలపడి విజయం సాధించిన విజేతల మొహాల్లో ఇది అత్యంత స్పష్టంగా కనిపిస్తుంటుంది. అది అక్కడితే ఆగిపోదు. అభిమానుల్లోకి కూడా ఆ సంతోషం ప్రకంపనలు సృష్టిస్తుంది. కేరింతలు కొట్టిస్తుంది. మరెందరికో స్ఫూర్తిని రగిలిస్తుంది. 
శృంగార సంతోషం 
శృంగారంలో లభించే భావప్రాప్తి.. మనిషి అనుభవించే అత్యంత సున్నితమైన సంతోషానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. పునరుత్పత్తి ప్రక్రియలో ఇంతటి ఉక్కిరిబిక్కిరి చేసే అనూహ్య అనందమే లేకపోతే- అసలు జీవజాతులు ఇంతగా వర్ధిల్లేవా అని విశ్లేషకులు చెబుతుంటారు. కేవలం అండాలు విడుదలయ్యే సమయంలోనే కాకుండా, మిగతా సమయాల్లో కూడా స్త్రీలు అంతే సౌందర్యంతో, సుకుమారంతో ఉండటమనేది స్త్రీ-పురుష బంధం విడువకుండా నిలబడేందుకు ఉపకరిస్తుందట. అందుకే మనుషులకు శృంగారపరమైన సంతోషం పొందమన్నది శారీరకంగా కూడా ఎంతో పరిణతి చెందిందని వ్యాఖ్యానిస్తున్నారు. 
వాత్సల్య సంతోషం 
శృంగారంలో పొందిన అత్యున్నత ఆనందానికి కొనసాగింపుగా... బిడ్డలపై తల్లిదండ్రులకు అత్యంత సహజంగా పొంగుకొచ్చేదే వాత్సల్యం. దాని ద్వారా లభించే సంతోషం అద్వితీయమైనది. పండంటి బిడ్డను ఈ లోకంలోకి ఆహ్వానించి, పెంచి పోషించి, రక్షించడం వంటి స్పందనలన్నీ తల్లిదండ్రులకు జన్యుపరంగానే సంక్రమిస్తాయనీ, వాత్సల్యపూరిత సంతోషానికి ఇదే మూలమని విశ్లేషకులు భావిస్తున్నారు. 
ఆధ్యాత్మిక సంతోషం 
మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా దైవాన్ని విశ్వసించడం, ఈ దైహిక-ప్రాపంచిక భారాన్నంతా దేవుడి మీదే ఉంచడం వల్ల... మనిషికి చాలా భారం తగ్గిపోతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక భావన మనిషికి ఎంతో సంతోషం కలిగిస్తుందంటున్నారు డెస్మంట్‌ మోరిస్‌. పసిబిడ్డ- తన దృష్టిలో అత్యంత ప్రేమాస్పదమైన తన తల్లిదండ్రుల కౌగిట ఎంత నిశ్చింతగా విశ్రాంతి పొందుతాడో... భక్తుడు కూడా దైవ సన్నిధిలో అంతటి ప్రశాంతతను పొందుతాడు.

‘లయా’త్మక సంతోషం

మన దినచర్యలో ఎక్కడ ‘లయ’ తారసిల్లినా మనం అనిర్వచనీయ తన్మయ లోకానికి వెళ్లిపోతుంటాం. ఒళ్లంత.. పులకింత .. ఎంతెంత?సంగీతం, నృత్యం, గానం, ఏరోబిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, సైనిక కవాతు... ఇలా వీటన్నింటిలోనూ లయ ఉంటుంది. ఆ ధ్వనుల్లో, కదలికల్లో, ఎక్కడ లయ ఉన్నా- ప్రధానంగా మన మెదడులోని ‘హయ్యర్‌ సెంటర్స్‌’ క్రమేపీ నిద్రావస్థలోకి వెళ్లి, కండరాలన్నీ విశ్రాంతి దశలోకి వస్తాయి. ఈ దశలో మనకు ఏ బాధా తెలియకుండాచేసే సహజమైన బాధానివారిణులైన ఎండార్పిన్లు విడుదలవుతాయి. అందుకే... లయ వెంట అంతటి సంతోష భావన!

హాస్య సంతోషం

ఒళ్లంత.. పులకింత .. ఎంతెంత?హాస్యంలో ఒక రకమైన సురక్షిత భావన ఉంటుంది. ఎవరైనా జోక్స్‌ వేసినా, హాస్య ప్రదర్శనల్లోనూ వారు చేసే వ్యాఖ్యలను మనం అంతగా పట్టించుకోకపోవడానికి కారణమదే. కేవలం వాటిని మనం హాస్యంగానే చూస్తాం. అందుకే నవ్వులో మనకు అంతటి నిశ్చింత, సంతోషం ఉంటాయంటున్నారు పరిశోధకుడు మోరిస్‌.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.