close

ప్ర‌త్యేక క‌థ‌నం

పట్టుపట్టి పట్టణం కట్టి 

సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న పట్టణం 
భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులు 
700 ఎకరాల్లో మగర్‌పట్టా  పట్టణం ఆవిర్భావం 
అక్కడి ప్రత్యేకతలు పరిశీలించిన హెచ్‌ఎండీఏ కమిషనర్‌ 
ఇదే తరహాలో హైదరాబాద్‌ చుట్టుపక్కల పట్టణాలు 
నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక 
ఇక్కడి రైతుల పొలాలు ఇచ్చేందుకు సంసిద్ధత

పట్టుపట్టి పట్టణం కట్టి 

ఏదైనా సాధించాలంటే సంకల్పం అవసరం.. 
ఒక వ్యక్తి ఆలోచన, పలువురు కర్షకుల సహకారంతో ఆ సంకల్పం సాకారమైంది. వీరి కృషికి ప్రతిరూపంగా ఒక పట్టణమే నిర్మితమైంది. ఇందుకు ఏకంగా 400 మంది రైతులు తమ భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. భూసేకరణ కోసం పైసా ఖర్చు చేయకుండా 700 ఎకరాల్లో సకల సౌకర్యాలతో పట్టణం ఏర్పడింది. పుణె సమీపంలో ఏర్పడిన మగర్‌పట్టాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే తరహా చిన్న పట్టణాలను రైతుల తోడ్పాటుతో హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. ఇలాంటి 
పట్టణాలను హైదరాబాద్‌ సమీపంలో నిర్మించాలని మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఒకచోట కొందరు రైతులు పట్టణ నిర్మాణం కోసం తమ పొలాలను ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అసలు మగర్‌పట్టా ఎలా 
ఏర్పడిందో తెలుసుకుంటే పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

నిర్మాణానికి బీజం 
పుణె నగరానికి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని సతీష్‌ మగర్‌ అనే వ్యక్తికి దాదాపు వంద ఎకరాల పొలం ఉంది. దీనిపక్కనే మరో 600 ఎకరాలను సేకరించి మొత్తం 700 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద పట్టణాన్ని నిర్మించాలని పదిహేనేళ్ల కిందట సతీష్‌ మగర్‌ తలపెట్టారు. ఇందుకు రైతుల నుంచి భూమిని కొనుగోలు చేయడం భారమైన పని. అందుకే అక్కడి రైతులతో మాట్లాడి ఒప్పించారు. భూ సమీకరణ అంటే ఏమిటో తెలియని రోజుల్లో 400 మంది రైతులు తమ భూములను ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తొలుత తన 100 ఎకరాలను కలిపి 400 ఎకరాల్లో ఈ మగర్‌పట్టా పేరుతో పట్టణాన్ని నిర్మించడానికి సిద్ధపడ్డారు. మొదట రైతుల భూమికి కొంతమేర పరిహారం ఇచ్చారు. తరువాత వారందరినీ సిటీ యజమానులుగా మార్చారు.

పట్టుపట్టి పట్టణం కట్టి 

హైదరాబాద్‌ సమీపంలో పట్టణాల నిర్మాణం 
ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్‌ బి.జనార్దనరెడ్డి మగర్‌పట్టాను పరిశీలించి వచ్చారు. ఆయన ఈ తరహా పట్టణాలను హైదరాబాద్‌ నగర పరిసరాల్లో బాహ్యవలయ రహదారికి ఆనుకుని నిర్మించాలని భావిస్తున్నారు. ‘‘మగర్‌పట్టా వాతావారణం చాలా బాగుంది. ఇదే తరహాలో రైతులను భాగస్వాములను చేసి మన దగ్గర కూడా చిన్న చిన్న పట్టణాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. రైతుల నుంచి భూసమీకరణ చేసి ఇక్కడ బాహ్యవలయ రహదారికి ఆనుకుని 13 చిన్న పట్టణాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. హెచ్‌ఎండీఏ నగరానికి చుట్టుపక్కల రైతుల దగ్గర భూసమీకరణ చేసి బెంగళూరు తరహాలో చిన్న పట్టణాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులతో అధికారులు మాట్లాడారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని ప్రతాపసింగారంలో 400 ఎకరాలను భూసమీకరణ ద్వారా హెచ్‌ఎండీఏకు ఇచ్చేందుకు దాదాపు 300 మంది రైతులు ముందుకు వచ్చారు. ఈమేరకు హెచ్‌ఎండీఏకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇక్కడే కాకుండా మేడిపల్లి, దుండిగల్‌ వద్ద చిన్న పట్టణాలను నిర్మించాలని నిర్ణయించాం. వీటికోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ ప్రాజెక్టులో వచ్చే లాభాల్లో వాటాలను ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నాం. పుణె సమీపంలోని మగర్‌పట్టా తరహా పట్టణాల నిర్మాణాలపై దృష్టి సారించబోతున్నాం’’ అని జనార్దనరెడ్డి తెలిపారు.

పట్టుపట్టి పట్టణం కట్టి 

పట్టణం ఏర్పడిందిలా.. 
మగర్‌పట్టా  నిర్మాణం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ఆలోచన రేకెత్తిస్తుంది. ఇక్కడ మొత్తం 400 ఎకరాలకు గాను 100 ఎకరాల్లో ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో నాలుగు వలయాలను ఏర్పాటు చేశారు. పార్కు చుట్టూ ఉన్న మొదటి వలయంలో ఐటీ హబ్‌ కోసం 87,11,300 చదరపు అడుగుల టవర్లను నిర్మించారు. వీటన్నింటినీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలకు లీజు ప్రాతిపదికన ఇచ్చారు. 1.40 లక్షల మంది ఇక్కడ ఉద్యోగాలను చేస్తున్నట్లు చెబుతున్నారు. తరువాత వలయంలో విద్యాసంస్థలు.. మూడో వలయంలో మల్టీఫ్లెక్సులు, వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, వినోదం తదితర సౌకర్యాలను కల్పించారు. చివరి వలయంలో నివాసం ఉండేందుకు అపార్టుమెంట్లను నిర్మించారు. ఈ పట్టణం మొత్తంలో ఇప్పుడు 290 టవర్లలో 17,500 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి.

మరో 800 ఎకరాల్లో విస్తరణ 
  మరో 800 ఎకరాల్లో ఈ పట్టణాన్ని విస్తరించబోతున్నారు. దీనికి తమ పొలాలను ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. వీరి భూమికి పరిహారం దక్కింది. దీనికితోడు పట్టణంలో నిర్మితమైన వాణిజ్య భవనాల నుంచి లీజు రూపంలో వస్తున్న నిధుల్లో కర్షకులకు కూడా వాటా కింద ఏటా కొంత మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. పట్టణంలో సకల సౌకర్యాలు ఉండటంతో ఇక్కడి ప్రజలకు బయటకు వెళ్లాల్సిన పనే ఉండదు. అందువల్ల దాదాపుగా అంతా సైకిళ్లనే ఉపయోగిస్తారు. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు కూడా కార్యాలయాలకు వెళ్లేందుకు సైకిళ్లనే వాడుతున్నారు. పచ్చని చెట్లతో, ఉద్యానవనాలతో కాలుష్య రహిత నగరంగా ఇది రూపుదిద్దుకుందని స్థానికులు చెబుతున్నారు.

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.