close

ప్ర‌త్యేక క‌థ‌నం

సాధికారిణి స్వరం..! 

తెలంగాణ మహిళా కలెక్టర్ల మనోగతం

అతివలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారని.. స్వీయనిర్ణయాధికారంలోనూ వారికి స్వేచ్ఛ ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొంటున్నారు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కలెక్టర్లుగా సేవలందిస్తున్న ఐఏఎస్‌ అధికారిణిలు. యువతుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలని, సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు జిల్లాల కలెక్టర్లతో ‘ఈనాడు’ ప్రత్యేకంగా మాట్లాడగా.. మహిళా అభ్యున్నతికి సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.

నిర్ణయాధికారం లేని సాధికారత వృథా!

మహిళా సాధికారత కల సాకారం కావాలంటే ముందుగా వారికి స్వాతంత్య్రం కావాలి. స్వయం సమృద్ధి సాధించాలి. అప్పుడే ఆత్మస్థైర్యంపెరుగుతుంది. ఆ దిశగా పథకాలు అమలు కావాలి.

హిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారు. సమానత్వం దిశగా అడుగులు వేస్తున్నారు. సామాజిక స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయి. స్వీయ నిర్ణయాధికారానికి మాత్రం అవకాశం ఇవ్వటం లేదు. కనీసం అందులో భాగస్వాములను చేయడం లేదు. ఆర్థిక స్వాతంత్య్రమూ ఇవ్వడం లేదు. స్వీయ నిర్ణయాధికారం, ఆర్థిక స్వాతంత్య్రం అనే దారులు మూసేసినంత కాలం మహిళా సాధికారత సాధ్యం కాదు. అసలు అవిలేని సాధికారతకు అర్థం ఉండదు. 
ఇంట గెలిస్తేనే.. రచ్చ గెలిచేది: చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్యం వంటి విషయాలను మహిళల సొంత నిర్ణయాలకు వదిలేయాలి. అప్పుడే ‘ఇంటికి వెలుగు ఇల్లాలు’ అన్న నినాదం నిజమవుతుంది. ఇల్లాలు బాగుంటేనే కుటుంబం సాఫీగా సాగుతుంది. తద్వారా సమాజం బాగుంటుంది. నిర్ణయాధికారం ఇంట్లో మొదలైతేనే సమాజంలోని ఇతర విషయాల్లోనూ చొరవ చూపేందుకు వారికి వీలుంటుంది. ఎన్నుకున్న రంగంలో రాణించేందుకు మార్గం సుగమం అవుతుంది. 
* నేరాలు..వివక్ష వెనక్కి లాగుతున్నాయి: పకడ్బందీ చట్టాలు వచ్చినా సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. నేరాలు జరుగుతూనే ఉన్నాయి. సఖి, గృహహింస చట్టాలతోపాటు షీం టీంలతో నిఘా పెరిగింది. చట్టాలను ఇంకా సమర్థంగా అమలు చేయాలి. అత్యాచారాల ఘటనల్లో నిర్ణీత కాలంలో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే మహిళలు ధైర్యంగా బయటికి వచ్చేందుకు వీలుంటుంది. 
స్వాతంత్య్రం..స్వయం ఉపాధి ఉంటేనే: ఇంటి పనులు చూసుకుంటూనే ఉపాధి వైపు దృష్టిపెట్టేలా మహిళల్ని ప్రోత్సహించాలి. అందుకనుగుణంగా కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారి అభీష్టం మేరకు ఔత్సాహిక రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు విరివిగా రుణాలు ఇప్పించాలి. వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌, విక్రయావకాశాలు కల్పించాలి. 
విద్యతో మార్పు: అన్ని సమస్యలకు చక్కని పరిష్కారం విద్య. అది తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తుంది. వికాసాన్ని ఇస్తుంది. బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, అమ్మాయిలను బడికి పంపేలా ప్రోత్సహించాలి.

- న్యూస్‌టుడే, భువనగిరి

చదువుతోనే అతివల వికాసం

దువు, ఉపాధి... ఈ రెండింటితోనే మహిళ వికాసం సాధ్యమవుతుంది. ఆడపిల్ల అనగానే పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు ఎప్పుడూ భావించొద్దు. కుమారులతో సమానంగా కుమార్తెలనూ చదువుకోవాలని ప్రోత్సహించాలి. ఆడపిల్లలు చదువులో రాణించి తమ భవితకు బాటలు వేసుకోవాలి. శక్తియుక్తులను ఉపయోగించి ఏదో ఒక రంగంలో స్థిరపడాలి. ఆర్థిక స్థిరత్వం ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. సమాజంతో పాటు చుట్టుపక్కల ఉన్న చాలా మందిలో మహిళలంటే కొంత చులకన బావన ఉంది. ఆ భావనను మనోబలంతో అధిగమించాలి. ఎవరేమన్నా నిరాశ చెందకుండా నిర్దేశించిన లక్ష్యం సాధించేందుకు ముందడుగు వేయాలి. ఇపుడు చదువులోనూ, రాజకీయ రంగంలోనూ మహిళలకు అవకాశాలు వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని మహిళశక్తి చాటాల్సిన అవసరముంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. మళ్లీ భర్తకో.. తండ్రికో.. మరొకరికో ఆ అధికారం అప్పజెప్పకుండా.. అతివలే పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి. మహిళలు అనగానే కరుణ, సున్నితత్వం గుర్తుకొస్తాయి. వాటినే బలాలుగా తీసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. 

-ఈనాడు, ఆదిలాబాద్‌

ప్రశ్నించేతత్వంతోనే మహిళలకు సమన్యాయం

వని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో అతివలు పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా లింగ, వ్యక్తిత్వ, వేతన, సమానత్వ, సాధికారత విషయాల్లో వెనుకబడి ఉన్నారు. అవకాశమిస్తే ఆకాశమే హద్దుగా స్త్రీ శక్తియుక్తులు చాటుతున్నప్పటికీ ఆమెకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత అంతంతమాత్రంగానే ఉంటోంది. మహిళలందరూ తమకు జరుగుతున్న అన్యాయాలను, హక్కులను పొందడంలో ఎదుర్కొంటున్న వివక్షను, సమాజంలో కోల్పోతున్న సమన్యాయాన్ని కేవలం ప్రశ్నించేతత్వంతోనే సాధించుకోగలుగుతారు. సమాజంలో మూడు నెలల చిన్నారి నుంచి 90 ఏళ్ల వృద్ధురాలి వరకు ఎక్కడో ఓ చోట ప్రతి రోజు పురుషుల చేతుల్లో వేధింపులకు గురవుతున్నారు. ఆడ, మగ తేడాలను చూపకుండా చాక్లెట్‌ నుంచి వారసత్వపు ఆస్తుల వరకు ప్రతిదాంట్లో సమానంగా పంపకాలు చేపట్టే దిశగా తల్లితండ్రులు ఆలోచించాలి. ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరూ సమానమనే భావన ఇంటి నుంచే పెంపొందాలి. వివాహ వ్యవస్థలోనూ బలమైన సంస్కరణలు రావాలి. అప్పుడే అఘయిత్యాలు ఉండవు. ః ఎన్నో చైతన్య కార్యక్రమాలు..: పెద్దపల్లి జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇంకా వరకట్నం, లైంగిక హింస, గృహహింస, లింగ వివక్ష అనే రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. అసురక్షిత పద్ధతులతో రుతురుమాళ్లను ఉపయోగిస్తుండటం వల్ల చాలా మంది మహిళలకు ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నట్లు ఆరోగ్య నివేదికలు వెల్లడించాయి. వీటన్నింటిని అధిగమించి. వారికోసం తక్కువ ధరతో ‘సబల’ న్యాప్కిన్లను ప్రవేశపెట్టాం. 11 శాతం మాత్రమే ఉన్న సురక్షితమైన రుతురుమాళ్ల వాడకాన్ని 70 శాతం వరకు పెంచాం. మహిళలతోనే రూ.40 లక్షలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఉపాధి కల్పిస్తున్నాం. మహిళలకు ఉపాధి కల్పించేందుకు ‘బతుకమ్మ’ మెస్‌ పేరిట తక్కువ ధరలతో రుచికరమైన భోజనశాలను ఏర్పాటు చేశాం.

-ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

చైతన్యమే పురోగతికి వారధి

హిళలు చైతన్యవంతులైతే సమాజమూ పురోగతి సాధిస్తుంది. స్త్రీలు అనుకుంటే ఎంత కష్టమైన పనినైనా ఇష్టపడి సాధించుకుంటారునేది ఇప్పటికే ఎన్నో రంగాల్లో నిరూపితమైంది. ఏ రంగంలోనైనా కష్టానికి ప్రతిఫలం ఉంటుందనే సత్యాన్ని గ్రహించి ముందుకెళ్లాలి. ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తుండాలి. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. వీటిపై మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. 
పేరు మీది.. పెత్తనమూ మీదే కావాలి: నిర్మల్‌ జిల్లాలో జనాభా, ఓటర్ల పరంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం సంతోషకర పరిణామం. స్థానిక సంస్థల్లో 50 శాతం మంది మహిళలు వివిధ పదవుల్లో ఉన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు ప్రతి సమావేశానికి హాజరుకావాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. అభివృద్ధి విషయంలో మహిళలు ముందుండి నడిపిస్తే వారి వెంట అందరూ వస్తారు. 
‘సఖి’తో అండదండలు: మహిళలకు అండగా ఉండటంతో పాటు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్మల్‌లో త్వరలోనే ‘సఖి’ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో పోలీసులు, వైద్యులు, న్యాయవాదులు ఇలా అన్ని విభాగాల అధికారులు పనిచేస్తారు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు తీర్చడానికి సఖి కేంద్రం పనిచేస్తుంది. మహిళలను వేధింపులకు గురిచేస్తున్నా ఈ కేంద్రం ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ కేంద్రం ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం అవసరం. అతి త్వరలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు భవనంలో ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తాం. 

-ఈనాడు, ఆదిలాబాద్‌

అవగాహన, శిక్షణే కీలకం

మ హక్కులను సాధించుకునేందుకు ముందుకొచ్చే మహిళల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అవగాహన సరైన శిక్షణ ద్వారా మహిళల్లో రాజకీయ సాధికారత పెరిగేలా చూడొచ్చు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా భిన్న పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలను పరిశీలిస్తే మహిళలనే లబ్ధిదారులుగా గుర్తించి వారి పేర్ల మీదనే సంబంధిత పత్రాలూ అందిస్తున్నాం. ఇలా వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంచాల్సిన అవసరముంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చదువు, ఉద్యోగం, పెళ్లి... ఇలా అన్ని సందర్భాల్లోనూ అండగా నిలిచేలా ప్రభుత్వాలు కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆయా కుటుంబాలు ప్రయోజనం పొందే వీలుంది. నేను హైదరాబాద్‌లో పనిచేసేటప్పుడు ఇద్దరు కొడుకులు కలిసి తల్లి పేరిట ఉన్న ఇంటిని బలవంతంగా తమ పేరు మీద రాయించుకున్నారు. తల్లి అంగీకారం లేకుండానే ఇలా చేశారు. విషయం మా దృష్టికి రావడంతో మళ్లీ ఆ ఆస్తిని తల్లి పేరు మీదకు మార్పించాం. ఇలాంటి ఘటనలు వెలుగులోకి కొన్నే వస్తుంటాయి. కానీ చాలా మంది మహిళలు తమకు ఆస్తులు, ఇతరత్రా అంశాల్లో జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదు. తమలో తామే సర్దిచెప్పుకుంటూ మిన్నకుండిపోతున్నారు. న్యాయం కోసం పోరాడేలా ఇలాంటి వారిని ప్రేరేపించేలా అధికారులు చొరవ తీసుకుంటే మేలు.

-ఈనాడు, సంగారెడ్డి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.