close

ప్ర‌త్యేక క‌థ‌నం

కరోనా ఔషధాల విచ్చలవిడి విక్రయాలు!

 భయంతో ప్రజల ముందస్తు కొనుగోళ్లు
 కొరత ఏర్పడే ప్రమాదం ఉండడంతో సర్కారు దృష్టి
 సంబంధిత వైద్యుల చీటీ ఉంటేనే విక్రయించాలని ఉత్తర్వులు
 ఇష్టానుసారం వాడితే దుష్ఫలితాలు
 స్పష్టం చేస్తున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌

కరోనా వైరస్‌ ముప్పు ఉన్నవారు.. నివారణకు ఫలానా ఔషధాలు వినియోగించవచ్చనే ప్రచారంతో అవసరం లేకున్నా పలువురు వాటిని ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. ఔషధ దుకాణదారులు కూడా వైద్యుల సూచన లేకపోయినా విచ్చలవిడిగా వాటిని విక్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో.. నిజంగా అవసరమైనవారికి ఆ ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం తలెత్తడంతో తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అర్హులైన వైద్యులు రాసిచ్చిన చీటి ఉంటే తప్ప వాటిని విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఔషధ నిల్వలపై నివేదిక ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ సంచాలకులు డాక్టర్‌ ప్రీతిమీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

నిర్దేశించిన వారికే వినియోగించాలి
మన దేశంలో ముందస్తుగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి నిర్దేశించిన వ్యక్తుల్లో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ను వినియోగించవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనా బాధితులు, అనుమానితులకు చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది, బాధితుల కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఔషధం కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు  కరోనా నివారణకు ‘లొపినవిర్‌/రిటొనవిర్‌’ ఔషధాలను వినియోగించవచ్చనే ప్రచారం గత కొంత కాలంగా విస్తృతగా వ్యాప్తిలో ఉండడంతో.. వీటిని ముందస్తుగా వాడడానికి కొందరు మొగ్గుచూపుతున్నారు. సాధారణంగా ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ను కొన్ని రకాల మలేరియా జ్వరాల్లో, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, లూపస్‌ వంటి జబ్బులకు వినియోగిస్తారు. ఇది మలేరియాకు సాధారణంగా వినియోగించే ‘క్వోరోక్విన్‌’కు అనుబంధంగా ఉత్పత్తి చేసిన ఔషధమే. ‘క్లోరోక్విన్‌’తో పోల్చితే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’లో దుష్ఫలితాల శాతం కొంత తక్కువని నిపుణులు చెబుతున్నారు.

‘లొపినవిర్‌/రిటొనవిర్‌’ ఔషధాలను హెచ్‌ఐవీ రోగుల్లో వినియోగిస్తారు. ఈ ఔషధాలతో కరోనా వైరస్‌ను నివారించడం, నయం చేయడం సాధ్యమవుతుందా? అనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ కచ్చితమైన నిర్ధారణకు రాకపోయినా.. వేర్వేరు దేశాల్లో వేర్వేరు రీతుల్లో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ‘ది న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో తాజాగా ప్రచురితమైన ఒక వైద్యపరిశోధన పత్రంలో ‘రిటొనవిర్‌/లొపినవిర్‌’ ఔషధాలతో కరోనా చికిత్సలో ఆశించనరీతిలో సానుకూల ఫలితాలు వెల్లడవలేదని పేర్కొన్నారు.


3 లక్షల మాత్రలు అందుబాటులో..

ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఔషధ నియంత్రణాధికారులు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర తనిఖీలు జరుపుతున్నారు. రాష్ట్రంలో హోల్‌సేల్‌, రిటైల్‌ ఔషధ వర్తకుల వద్ద ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ మాత్రలు సుమారు 3 లక్షల వరకూ అందుబాటులో ఉన్నాయని గుర్తించారు. అన్ని జిల్లాల నుంచి ఈ మాత్రల్లో అధికశాతం గాంధీ ఆసుపత్రిలోని ఔషధ గిడ్డంగికి తరలించి, అక్కడినుంచి కరోనా నివారణ చర్యల్లో భాగంగా నిర్దేశించిన వ్యక్తులకు వినియోగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటితో పాటు క్లోరోక్విన్‌, లొపినవిర్‌/రిటొనవిర్‌ ఔషధాలను కూడా ఔషధ చీటి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విక్రయించకూడదని కఠినంగా ఆదేశాలు జారీచేశారు. కేవలం ‘ఎండీ జనరల్‌ మెడిసిన్‌’/పల్మనాలజిస్ట్‌’ సూచిస్తేనే ఇవ్వాలని స్పష్టీకరించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


గుండెపై దుష్ప్రభావం

ఏ మందైనా వైద్యుని సూచన లేకుండా వాడితే దుష్ఫలితాలు వస్తాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కూడా అంతే. ఐసీఎంఆర్‌ సూచించిన విధంగా నిర్దేశించిన వ్యక్తులు మాత్రమే వాడుకోవాలి. అలాకాకుండా ఇష్టానుసారం దీర్ఘకాలం వాడితే గుండెపై దుష్ప్రభావం పడుతుంది. ఈసీజీలో తేడాలొస్తాయి. గుండె కొట్టుకునే విధానంలో లయ తప్పుతుంది. గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. కొన్నిసార్లు కార్డియాక్‌ అరెస్టు కూడా జరిగే ప్రమాదముంది. గుండెజబ్బులున్నవారు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ధూమపానం చేసేవారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

- డాక్టర్‌ రాహుల్‌ పొట్లూరి, గుండె వైద్యనిపుణులు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.