close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గానమే నీదని... ప్రాణమే గానమని..

‘‘ఎంతో దుఃఖంగా ఉంది.’’
బాలు మరణం తర్వాత ప్రతి ఇంటా విన్పించిన మాట ఇది.
‘అరె ఏమైందీ....’
ప్రతి మదిలో మోగిన మౌనపాట ఇది!
నిన్నటి దాకా ఆయనో కీర్తి శిఖరుడు
¸నేటి నుంచి కీర్తి శేషుడు...
నిన్నటి దాకా మన స్వరమధురం
నేటి నుంచి ఓ మధుర జ్ఞాపకం
బాలుకు ముందు పాటుంది... బాలు తర్వాతా ఉంటుంది.
మరి బాలూకే మన గుండెల్లో ఎందుకింత ప్రత్యేకత?
మదిమదిలో ఎందుకింత ఆప్యాయత?
ఆసేతు హిమాచలం ఎందుకింత అనన్యత?

ఎందుకంటే బాలు అంటే ఒక కళా విశ్వరూపం
ఆయన విజయం అనితర సాధ్యం
ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉన్న వినయ సౌశీల్యం
ఆయనొక పరిపూర్ణ వ్యక్తిత్వం

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గాయకుడిగా జన్మనిచ్చిన కోదండపాణిగారికి¨, ఆయన చెప్పిందే తడవుగా అవకాశం ఇచ్చిన పద్మనాభం గారికి, ఆ తర్వాత పాట ఇచ్చిన ప్రతి సంగీత దర్శకుడికి, నిర్మాతకు, నా పాటను అభినయించిన నటులకు, గొప్ప సాహిత్యం అందించిన కవులకు, అద్భుతమైన వాద్యకళాకారులకు, అభిమానులకు,.. ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ మహాయాగం కోసం ఇంట్లో ఏం చేస్తున్నారో కూడా తెలియని, నన్ను భరించిన నా కుటుంబానికి కృతజ్ఞతలు.

- బాలు

పరిజ్ఞానం లేకున్నా పట్టుదలతో...

కాస్త ప్రయత్నిస్తే బాలు నాలా పాడగలడు. కానీ మరో జన్మ ఎత్తినా నేను బాలూలా పాడలేను!
* సంగీత సామ్రాట్టు బాలమురళీకృష్ణ బాలసుబ్రహ్మణ్యానికిచ్చిన కితాబిది! శంకరాభరణం విన్నవారెవరికైనా బాలు సంగీతం నేర్చుకోలేదంటే నమ్మలేం! కానీ సంగీతం నేర్చుకోకుండానే సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన బాలు పట్టుదలతో, సాధనతో ఏ పాటనైనా అలవోకగా పాడే నైపుణ్యం సాధించారు. ప్రతి పాటనూ తపస్సులా చేసేవారు. బాలూ అరంగేట్ర దశలో... తమిళంలో అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైన గాయకుడు టి.ఎస్‌.సౌందర్‌రాజన్‌! ఆయనంటే అందరికీ హడల్‌! ఒకరోజు సౌందర్‌రాజన్‌, బాలు ఒకే స్టూడియోలో రికార్డింగ్‌ చేస్తున్నారు. ముందు సౌందర్‌రాజన్‌ పాటైంది. తర్వాత వంతు బాలుది. ఆ తర్వాత మళ్ళీ సౌందర్‌రాజన్‌ది ఇంకోపాటుంది. బాలూ పాడాల్సిన పాట సంగీతపరంగా చూస్తే దాదాపు 2 గంటల సమయం తీసుకుంటుందని అనుకున్నారంట సౌందర్‌రాజన్‌! కాబట్టి ఈలోపు ఆయన కాస్త రిలాక్స్‌ అవ్వాలనుకున్నారు. కానీ కానీ బాలూ 45 నిమిషాల్లో పాట రికార్డింగ్‌ ముగించేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన సౌందర్‌రాజన్‌ ‘‘నీకు మంచి భవిష్యత్తుంది. సినిమాకు ఏం కావాలో పట్టేశావు...’’ బాలూను మెచ్చుకున్నారు. అలా సంగీతం నేర్చుకోలేదనే విషయాన్ని మరచిపోయి.... ఆత్మస్థైర్యం కోల్పోకుండా... సాధన చేసిన బాలు- సినిమాకు ఏం కావాలో పుణికిపుచ్చుకున్నారు. సంగీతం నేర్చుకోకున్నా... రాగతాళాల జ్ఞానం, సంగీత స్పృహ పెంచుకున్నారు. అందుకే సంగీత దరకత్వంలోనూ బాలూ భేష్‌ అన్పించుకున్నాడు. ‘బాగా పాడుతున్నావుగాని... తమిళం బాగా నేర్చుకుంటేనే అవకాశాలిస్తా’నంటూ షరతు పెట్టారు ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్‌.విశ్వనాథన్‌. దీంతో బాలు- ఆ పనిలో పడ్డారు. సినిమా పోస్టర్లు చూసి తమిళం నేర్చుకోవటం మొదలెట్టిన బాలు... అనతికాలంలోనే విశ్వనాథన్‌ ఆశ్చర్యపోయేలా తమిళం మాట్లాడారు. తమిళంలోనూ తిరుగులేని గాయకుడయ్యారు.
బ్రేక్‌ లేదు మిత్రమా....!
ఏ పాట ఇచ్చినా అలవోకగా పాడే నైపుణ్యం సాధించినా ఏనాడూ తన సాధనను తేలిగ్గా తీసుకోలేదు. తనకు బాగా వచ్చిన పాటైనా సరే రిహార్సల్‌ లేనిదే కార్యక్రమాల్లో పాడేవారు కాదు.  టీవీ కార్యక్రమాల నిర్వహణలో కూడా అంతే క్రమశిక్షణ! ఒక్కసారి షూటింగ్‌ మొదలైందంటే... బ్రేక్‌ తీసుకునేవారు కాదు.  కార్యక్రమంలో ప్రేక్షకులున్నా వారితో, టెక్నిషియన్స్‌తో కలసి పోయి ఉంటారు. అంతేగాని సెలబ్రిటీలా ఉండరు.  సమయస్ఫూర్తి, క్రమశిక్షణ ఆయన శంఖుచక్రాలు!

అనుభవించి... జీవించి
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు... గాయకుల్లో బాలూలాంటి గాయకులు కోటికొకరు పుడతారేమో! ఆయన పాటలో ఉన్నది మాధుర్యం ఒక్కటే కాదు... వైవిధ్యం! భాషా ప్రధానమైన పాట, మంచి సాహిత్య విలువలున్న పాటను బాలూలా అనుభవించి మరెవ్వరూ పాడలేరేమో! పాత్రతాలూకు శైలి అంతా ఆ గొంతులో వచ్చేస్తుంది. పాటను పొడిపొడిగా కాకుండా... దాన్ని పూర్తిగా అనుభవిస్తూ... పాటలో భావాన్ని వ్యక్తీకరించటం... నవరసాలు ఒలికించటం ఆయన సొంతం.
ఇన్ని సుగుణాలున్నా...
‘‘నాలాంటివాడు ఇంకొకడు ఉండడు. పుట్టడు. ఎందుకంటే ఇదంతా భవగదేశ్ఛ. పూర్వజన్మల్లో చేసుకోవాల్సిందేదో కొంత బాకీ ఉండుంటుంది. అందుకే భగవంతుడు నాకీ అవకాశం ఇచ్చాడు. లేదంటే ఎలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం, శిక్షణ లేకుండా శంకరాభరణంలాంటివి ఎలా పాడగలను? ఇన్నింటిని ఎలా సాధించగలను?’’ అంటూ అన్నీ భగవంతుడికి ఆపాదించి వెళ్ళిపోయారు.

కానీ బాలూ.... నువ్వులేని నీ పాట ఉంది.... మా అందరి గుండెల్లో అల్లుకొని!


 

అదివో అల్లదివో.... అంటే నిజంగానే ఆ స్వరంలో ఏడుకొండలు దర్శనమిస్తాయి.
అంతర్యామి అలసితి సొలసితి అని పాడితే నిజంగానే అలసిపోయి పాడుతున్నట్లే ఉంటుంది.
నీ పాదం పుణ్యపాదం- అంటే పాదం మీద ప్రార్థన చేస్తున్నట్లుంటుంది...
పుణ్యభూమి నా దేశం నమోనమామి అంటే ఆ స్వరం సైనికుడి కవాతు చేస్తున్నట్లుంటుంది...
మాతృదేవోభవ అంటూ పాండురంగంలో పాడుతుంటే పశ్చాత్తాపం గొంతులోంచి జాలువారుతుంటుంది...
ఆరేసుకోబోయి పారేసుకున్నానంటుంటే నిజంగానే సిగ్గులు ఒలికిపోతున్నట్లుంటుంది.
యురేకా సాకామికా అంటూంటే... యూత్‌ను ఛాలెంజ్‌ చేస్తుంటుంది...
బాటనీ పాఠముంది అంటుంటే...కుర్రాళ్ళలో చిలిపితనం కితకితలు పెడుతుంటుంది....
అందుకే- ‘‘బాలన్నయ్య పాట విన్నాక అభినయించటం చాలా సులభం. తన గొంతుద్వారా ఎలా నటించాలో సగం చెప్పేస్తారాయన’’ అంటారు చిరంజీవి!


గాత్రమే అమృతమై

బాలు గాత్రం ఎన్నో పాత్రలకు అమృతమై ప్రాణం పోసింది. సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో మొదట ‘మన్మధలీల’ తెలుగు చిత్రానికి డబ్బింగ్‌ చెప్పారాయన. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, భాగ్యరాజ్‌, నగేష్‌, కార్తిక్‌, రఘువరన్‌, సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌ లాంటి నటులకు తన గొంతు అరువిచ్చారు. ‘దశావతారం’ చిత్రంలో కమల్‌ నటించిన పాత్రలకు వైవిధ్యమైన గొంతుతో సంభాషణలు పలికిన తీరు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ‘అన్నమయ్య’, ‘శ్రీ సాయి మహిమ’ చిత్రాల్లో డబ్బింగ్‌ చెప్పినందుకు బాలు ఉత్తమ డబ్బింగ్‌ కళాకారుడిగా నంది బహుమతులు గెలుచుకున్నారు. రిచర్డ్‌ అటెన్‌ బరో నిర్మించిన ‘గాంధీ’ చిత్ర తెలుగు వర్షన్‌లో గాంధీ పాత్రధారి బెన్‌ కింగ్స్‌ లేకు గాత్రదానం చేసింది బాలూనే. గాంధీజీ మాటల్ని తెలుగులో మన గుండెలపై ముద్రించిన ఘనత బాలుదే.


నారూ నీరూ పోసి వటవృక్షాలను చేసి

టి.ఎం.సౌందర్‌రాజన్‌, ఘంటశాలతో కలసి పాడటంతో పాటు... రాబోయే తరం కుర్రాళ్ళతో కూడా అంతే చలాకీగా, ఉత్సాహంగా పాడటం, వారి వయసుకు దిగి... నిజంగా బాలుడిగా మారటం... వారిలో కలసి పోవటం బాలు ప్రత్యేకత  మర్రిచెట్టు కింద మరో మొక్క మొలవదంటారు... కానీ అలాకాకుండా... తాను మర్రిలా ఎదిగినా... వందల భావివృక్షాలకు నారు పెట్టి నీరు పోశారు. ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వందల మంది ఎస్పీబీలకు బీజాలు వేసి వెళ్ళారు. వేల గళాలను టెస్టు చేసిన ఘనుడాయన. బహుశా ఆయన విన్నన్ని గళాలు మరెవ్వరూ విని ఉండరు. ఆయన సూచనలతో చాలామంది పాడే విధానమే మారిపోయింది.


ప్రేమ అంటే ఇల్లు  ఖాళీ చేయించారు

బాలు, సావిత్రిది ప్రేమ పెళ్లి. వీరి ప్రేమ కావ్యం కూడా ఆసక్తికరమే. బాలు మద్రాసులోని అగస్తేశ్వరరావు ఇంట్లో అద్దెకుండేవారు. వారి కూతురే సావిత్రి. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే.. ఇద్దరిదీ ఒకే గోత్రం కావడంతో పెద్దలు నిరాకరించారు. అయినా యువజంట వెనక్కి తగ్గలేదు. అగస్తేశ్వరరావు బాలుతో ఇల్లు ఖాళీ చేయించారు. వారి అమ్మాయిని బెంగళూరుకు పంపించారు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. బాలు విరహగీతాల్లో మునిగారు. ఈ పరిస్థితి చూసిన మిత్రులు ఇద్దరినీ సింహాచలం తీసుకెళ్లి అప్పన్న సాక్షిగా మూడు మూళ్లు వేయించారు. ఆ నాటి సందర్భాన్ని ఆలయ రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ పాశర్ల సూర్యనారాయణ ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. ‘1969లో నేను ప్రసాదం విక్రయ కేంద్రంలో పనిచేసేవాడిని. ఓ రోజు ముగ్గురు యువకులు, ఓ అమ్మాయి వచ్చి పెళ్లికి రశీదు అడిగారు. తర్వాత దేవుడి సన్నిధిలో దండలు మార్చుకొని, దర్శనం చేసుకొని వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత మద్రాస్‌ నుంచి బాలు చిన్నాన్న వచ్చి నన్ను ఆరా తీస్తే కాని తెలియలేదు బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరో!’ అంటూ గుర్తు చేసుకున్నారు.


అజాత శత్రువు...

విమర్శను గౌరవంగా స్వీకరిస్తా! అలాగే ప్రశంసైనా! అందుకే... నాకెవ్వరితోనూ గొడవల్లేవు అని సగర్వంగా ప్రకటించిన అజాతశత్రువు బాలు! ఇన్నేళ్ళ కెరీర్‌లో ఎవరితోనూ గొడవపడింది లేదు. మధ్యలో ఒకసారి కృష్ణతో ఇబ్బంది వచ్చినా దాన్ని ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకరోగలిగారు. ఇళయరాజాతో పాటల విషయమై మనఃస్ఫర్తలు వచ్చినా వాటిని వ్యక్తిగత సంబంధాలకు ముడిపెట్టని సంస్కారి ఆయన. అందుకే ఇన్నేళ్ళ సుదీర్ఘ కెరీర్‌లో భాషలకు అతీతంగా అంతా ఆయన్ను తమ బాలుడిగానే చూశారు. శుక్రవారం ఆయన చనిపోయారని తెలియగానే... కర్ణాటకలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ సందేశం ఏంటంటే... వచ్చే జన్మలో మా కన్నడనాట పుట్టమని! మనమే కాదు... బెంగాల్‌ కూడా బాలూపై బెంగ పెట్టుకుంది.


అలుపెరగని పాటసారి...

దశాబ్దాల కాలం రోజూ నిరంతరం పాడుతూ ఉండే గొంతును కాపాడుకోవటం ఎంత కష్టం. అనుకున్నంత సులభం కాదు. ఎప్పుడో ఓసారి చేసేవారికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ రోజూ దాదాపు 50 సంవత్సరాలపైబడి పాడుతూనే ఉండటం మాటలు కాదు. కానీ తనదైన క్రమశిక్షణతో, మొండి పట్టుదలతో, తపస్సుతో తన గొంతును కాపాడుకున్నారాయన. అలాగని మిగిలిన గాయకుల్లా కాకుండా ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు తినేవారు. సిగరెట్టు తాగేవారు. (కానీ తన కూతురు పల్లవికి మాటిచ్చిన మరుసటి రోజు నుంచి సిగరెట్టు మానేశారు.) అవేవీ హద్దులు దాటకుండా చూసుకునేవారు. గీతాంజలి చిత్రం సమయంలో గొంతులో సమస్య వచ్చింది. స్వరపేటికల్లో నాడ్యూల్‌ ఉందని తేలింది. మందులతో తగ్గలేదు. శస్త్ర చికిత్స చేయించుకోవాలన్నారు డాక్టర్లు. కానీ ఆ తర్వాత మళ్ళీ పాడగలుగుతారో లేదో తెలియని పరిస్థితి. లతా మంగేష్కర్‌ లాంటివారు వద్దంటే వద్దన్నారు. కానీ బాలూ శస్త్రచికిత్సకే ధైర్యం చేశారు. అదృష్టవశాత్తు మళ్ళీ పాడగలిగారు. పాట కోసం రిస్క్‌ తీసుకున్నారాయన. తెలుగువాళ్ళు మనవాడు అనుకున్నట్లే... తమిళవాళ్ళు తమిళుడిగా...కన్నడవాళ్ళు కన్నడిగుడిగా... భావించారు. మిగిలిన భాషల్ని కూడా చాలా నేర్చుకున్నారు.


ఎంతవారలైనా పాదదాసుడే...

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎలాగో నేర్పాలన్నా... ప్రత్యక్ష ఉదాహరణ చూపాలన్నా బాలూనే అందుకు సరైన వ్యక్తి! గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, కార్యక్రమ నిర్వాహకుడిగా ... వివిధ రంగాల్లో తన విశ్వరూపాన్ని చూపి అన్ని విధాలుగాసెలబ్రిటీగా ఎదిగినా... పెద్దల దగ్గరా, పిల్లల దగ్గరా ఒదిగి ఉండటం బాలూ నైజం. సంగీత స్రష్ట ఇళయరాజా అంటే ఎంతో గౌరవం... భయం కూడా! ఎం.ఎస్‌ విశ్వనాథన్‌, కె.వి.మహదేవన్‌, పుహళేంది... కోదండపాణి అంటే ఎనలేని భక్తి. తనకు తొట్టతొలుత పాడే అవకాశం ఇచ్చిన కోదండపాణి అంటే చెప్పనే అక్కర్లేదు. కాస్త బిజీ అయ్యాక కోదండపాణి ఓసారి ఫోన్‌చేసి ఏదో పాట రికార్డింగ్‌కు టైమ్‌ అడిగితే... ఆ రోజు సమయం కుదరటం లేదు మాస్టారూ అన్నారట బాలు. కోదండపాణి- ‘ఈ సమాధానం చెప్పేలా నువ్వు ఎదిగే రోజు కోసమే ఎదురుచూస్తున్నాను రా!’ అంటూ సంబరపడి పోయారట. శబరిమల వెళ్ళినప్పుడు తనను డోలీలో మోసిన కూలీల కాళ్ళకు దండం పెట్టిన సంస్కారి బాలు!

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.