నేను ఆ సమయాన్ని తగ్గించుకుంటున్నా: టిమ్‌కుక్

‘ఉదయాన్నే నాలుగింటికి లేస్తాను. యాపిల్ ఫోన్ల గురించిన ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే సమయం అది. గతంలో మాటలను పక్కన పెడితే నేనిప్పుడు ఫోన్ చూసే సమయాన్ని తగ్గించాలనుకుంటున్నా. బదులుగా ఒత్తిడిని తగ్గించే వ్యాయామానికి ఆ సమయాన్ని కేటాయిస్తా. నా నుంచే ఆరోగ్యకరమైన ఫోన్ అలవాట్లు మొదలవ్వాలనేది నా కోరిక. నేనే కాదు... యాపిల్ ఫోన్ వాడేవారంతా ఇదే బాç పట్టాలని అనుకుంటున్నా. అందుకే ఫోన్ వినియోగంపై అప్రమత్తం చేసేవిధంగా స్క్రీన్‌టైం ఆప్షన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అయినా ఇంతగొప్ప సాంకేతిక అద్భుతం నుంచి ఎలాంటి ఫలితాలు పొందాలనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా!
|
గూగుల్ సైతం...
ఇంతవరకూ మనకు వెల్బీయింగ్ అనే పదం శారీరక, మానసిక ఆరోగ్యాలకు సంబంధించిన పదంగానే తెలుసు. ఆ రెండూ బాగుండాలంటే ఇక నుంచి మనకు డిజిటల్ వెల్బీయింగ్ కూడా అవసరం అని భావిస్తోంది గూగుల్ సంస్థ. అంతూదరీ లేకుండా సాగే డిజిటల్ వెతుకులాటలో పడి సమయాన్ని వృథా చేసేవారికి మీరు అతిగా వాడుతున్నారు అనే విషయాన్ని పదేపదే చెప్పడం వల్ల కొన్ని రోజుల తర్వాత అయినా వారికి స్క్రీన్టైంపై ఒక అదుపు వస్తోందని భావిస్తోంది గూగుల్. అందుకు తగ్గట్టుగా ఫోన్ వినియోగంపై నియంత్రణ ఉండేందుకు వీలుగా ‘డిజిటల్ వెల్బీయింగ్’ అనే సరికొత్త యాప్‌ని ఆవిష్కరిస్తోంది. ఆండ్రాయిడ్‌లో జెన్‌స్క్రీన్ వంటి థర్డ్‌పార్టీ యాప్‌లు సైతం ఆన్లైన్ వెతుకులాటలో మీరు పక్కదారి పట్టిన సమయం ఎంత అనే విషయాన్ని గుర్తించి అప్రమత్తం చేస్తుంటాయి. నిరంతరం ఫొటోలను ఇచ్చిపుచ్చుకునే ఇన్స్టాగ్రామ్ సైతం స్క్రీన్‌టైంని నియంత్రణలో ఉంచే ఆప్షన్ని పరిచయం చేసింది. ఇక మనవంతుగా స్క్రీన్‌టైంని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం.
|
ఐడెంటీ క్రైసిస్
చాలామంది సోషల్మీడియాకి అతుక్కుపోవడానికి కారణం ఇదే. వ్యక్తిగత గుర్తింపు కోసం. అదెలా అంటే.. ఫేస్బుక్, ఇన్‌స్టాల హవా మొదలై దాదాపుగా పదేళ్లు అవుతోంది. ఎంత లేదన్నా ఈ వేదికల్లో ఒక్కొక్కరికి కనీసం వందమందైనా ఫాలోవర్లు ఉంటారు. మీ పుట్టినరోజులకి, మీరు సాధించిన చిన్నపాటి విజయాలకు... మీరు తీసిన ఫొటోలకు లైకులతో కంగ్రాట్స్‌తో పొగుడుతూ ఉంటే అదొక మత్తులా.. కిక్లా అనిపిస్తుంది. క్రమంగా అదే ఒకరకమైన వ్యసనంగా మారుతోంది. కానీ ఇందులో అందరూ మీకు హృదయపూర్వకంగానే స్పందిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరైనా అంతేకదా? ఓ లైక్ పడేస్తే పోలా అన్నట్టుగా యాంత్రికంగా ఓ లైక్ కొడతారు కదా! అవతలివాళ్లూ అంతే. క్వాన్టిటీ కన్నా క్వాలిటీకి ఓటేస్తే మీకు సోషల్ మీడియా అవసరమే ఉండదు. కంప్యూటర్ సోషలైజింగ్ కన్నా వాస్తవ ప్రపంచం చాలా గొప్పది.
|
టెక్ నిరక్ష్యరాస్యులమా?
ఫేస్బుక్లో, ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో చురుగ్గా లేకపోతే మనల్నంతా టెక్ నిరక్షరాస్యులు అనుకుంటున్నారనే ఓ చిన్న అనుమానం ఉండొచ్చు. కానీ అది నిజం కాదు. డిజిటల్ ప్రపంచంలో నేర్చుకోవడానికి చాలా అంశాలున్నాయి. సమయాన్ని వృథా చేసే ఈ పోస్టుల కన్నా ఇతరత్రా విషయాల మీద దృష్టిపెట్టి చూడండి.
|
ఏవి మన సమయం తింటున్నాయి
రాజకీయాలు, సినిమాలు.... ఇవే మన సమయాన్ని అతిగా తినేవి. రాజకీయ పార్టీల తరఫున కామెంట్లు, కొత్త సినిమాల విశేషాలు. మనం స్పందించడంతోపాటు ఎదుటివారి స్పందన కోసం ఎదురుచూడ్డం వల్ల సమయం అంతా తెలియకుండానే ఖర్చైపోతోంది. అందుకే మీ ఫోన్లోని సోషల్‌మీడియా యాప్స్‌ని సిస్టం(డెస్క్‌టాప్)కి పరిమితం చేయండి. దీంతో సమయం ఆదా అవుతుంది.
|
గ్రూపులకు దూరం
వాట్సాప్ నిజానికి సోషల్ మీడియా వేదిక కాదు. అయినా కూడా అందులో మనం గ్రూపులు కట్టి దాన్నో సోషల్‌మీడియా వేదికగా మార్చాం. వీలైనంతవరకూ గ్రూపులకు దూరంగా ఉంటే మేలు. లేనిపోని చర్చలతో సమయం వృథా కాకుండా ఉంటుంది.
|